తిరుపతి జిల్లా పాకాల మండలం లో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేదో… లేక కుటుంబ కలహాలే కారణమా.. అంతు చిక్కడం లేదు కానీ… జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త తన భార్యను, బంగారు భవిష్యత్తును చూడాల్సిన ఇద్దరు కూతుర్లను ఆ తండ్రి కసాయి లాగ మారి బావిలోకి తోసేశాడు. కొద్దిసేపటికి తాను కూడా మరింత సైకోలా ప్రవర్తించి తన గొంతు తానే కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమానుషమైన ఈ సంఘటన మద్దినాయునపల్లి హరిజనవాడలో జరిగింది. భార్య, ఇద్దరు కూతుళ్లను పాడుబడిన బావిలో తోసి చంపేసి, భర్త గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన దారుణం గ్రామం మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. మద్ది నాయన పల్లి హరిజనవాడకు చెందిన టి. గిరి 13 ఏళ్ల క్రితం హేమలతను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. గిరి తిరుపతిలో ఎలక్ట్రికల్ పనులు చేసుకుని కుమార్తెలను చదివించుకుంటూ దాంపత్య జీవితాన్ని సజావుగా సాగిస్తున్నాడు.
కానీ బుధవారం ఉదయం ఏపీ39 హెచ్ ఎక్స్ 0873 ద్విచక్ర వాహనంలో స్వగ్రామమైన మద్ది నాయన పల్లి హరిజనవాడకు వచ్చారు. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలతో గిరి గురువారం మధ్యాహ్నం మద్ది నాయనా పల్లి హరిజనవాడ వారి ఇంటి వద్ద స్కూటర్లో భార్య హేమలత(39), తనుశ్రీ (12), తేజశ్రీ (8) ఎక్కించుకొని పులిచర్ల వైపు వెళ్లి రోడ్డు ప్రక్కనే ఉన్న పాడుబడిన బావిలో గిరి భార్యను, ఇద్దరు కూతుర్లను బావిలో తోసి వేసి చంపేశాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ సమయంలో వెళ్ళతుండగా బావి దగ్గర గిరిని చూడడంతో టి. గిరి తన దగ్గర ఉన్న కత్తితో గొంతు కోసుకొని బావిలో దూకేశాడు. గిరికి ఈత రావడంతో ఈత కొట్టుకుంటూ బావి మెట్ట దగ్గరకు వచ్చేసాడు. గిరి భార్య కూతుర్లను బావిలో తోసి చంపేసినట్టు గ్రహించిన గ్రామస్తుడు ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గిరిని కాపాడేందుకు ఆటోలో వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.
గిరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామస్తులు బావి దగ్గరకు వచ్చే పరిశీలించగా భార్య హేమలత, చిన్న కుమార్తె తేజశ్రీ మృతదేహాలు బావిలోని నీటిపై తేలుతున్నాయి. వెంటనే గ్రామస్తులు పాకాల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ ప్రసాద్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బావిలోని తల్లి కూతుర్ల మృతదేహాలను వెలికి తీశారు. పంచనామా చేసి శవ పరీక్ష నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. టి గిరి మానసిక పరిస్థితి కూడా సక్రంగా లేకపోవడంతో గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో గిరి సైకోలా వ్యవహరించేవాడని బంధువులు తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.