కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) డిమాండ్ చేసింది. డిమాండ్‌ల సాధన కోసం ఈ నెల 23న సెర్ప్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. వెంకట్, ఎం. అడివయ్య ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతోందని, 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్బంగ ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ని గెలిపిస్తే 2023 డిసెంబర్ నుండే వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాని అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా పెన్షన్ పెంపు కోసం ఆలోచించడం లేదని విమర్శించారు.
పెన్షన్ పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను, చేయూత లబ్ధిదారులు 42 లక్షల మందిని మోసం చేసిందని విమర్శించారు. పెన్షన్ పెంపు కోసం రాష్ట్రంలో వికలాంగులు ఉద్యమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. కొత్తగా పెన్షన్స్ కోసం 24.85 లక్షల మంది దరఖాస్తూ చేసుకున్నారని, 2024 జనవరి నుండి కొత్త పెన్షన్స్ మంజూరు కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంపుతో పాటు పెండింగ్ పెన్షన్స్ మంజూరు చేయాలని కోరుతూ సెర్ప్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో వికలాంగులు, చేయూత లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.