Tuesday, July 29, 2025

ఆక్సిజన్ సరఫరా తగ్గి ముగ్గురు రోగులు మృతి

- Advertisement -
- Advertisement -

పంజాబ్ లోని జలంధర్‌లో ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం ఆక్సిజన్ సరఫరా తగ్గి ముగ్గురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా మార్చేటప్పుడు సాంకేతిక లోపం తలెత్తింది. ఆక్సిజన్ ప్రెజర్ పడిపోవడంతో సరఫరా తగ్గి వెంటిలేటర్‌పై ఉన్న ముగ్గురు రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీంతో ఆస్పత్రిలో భయాందోళన వాతావరణం ఏర్పడి గందరగోళానికి దారి తీసింది. సాంకేతిక సమస్య వల్ల ఆక్సిజన్ సరఫరా కొద్దిగా తగ్గినా వెంటనే బ్యాకప్ సిలిండర్లను ప్రారంభించడంతోపాటు ప్రధాన ఆక్సిజన్ ప్లాంట్ లోని సాంకేతిక లోపాన్ని కూడా సరిదిద్దినట్టు సీనియర్ మెడికల్ ఆఫీసర్ విజయ్ ఆనంద్ విలేకరులకు చెప్పారు. ఇదంతా కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లోనే జరిగిందన్నారు. ఆ ముగ్గురు రోగుల పరిస్థితి మొదటి నుంచీ విషమంగానే ఉందని , వేర్వేరు కారణల వల్ల వారు మృతి చెందారని తెలిపారు.

ఆక్సిజన్ సరఫరా లోపం వల్లనే ఆ ముగ్గురు చనిపోయారని మృతుల కుటుంబాల ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు తొమ్మిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని , ఈ కమిటీ రెండు రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని ఆస్పత్రి సూపరెండెంట్ రాజ్‌కుమార్ తెలిపారు. ఈ సంఘటనపై విజయ్ ఆనంద్ విలేకరులతో మాట్లాడుతూ రోగుల్లో ఒకరు పాముకాటుతో ఆస్పత్రి పాలయ్యారని, రెండో వ్యక్తి అత్యధిక మోతాదులో మందులు తీసుకున్నాడని, మూడో వ్యక్తి క్షయరోగి అని చెప్పారు. మరణాలకు కారణ ఏమిటని అడగ్గా ఆ రోగుల ఫైళ్లలో సంబంధిత డాక్టర్లు కారణాలను ప్రస్తావించారని వివరించారు. ఈ సంఘటన నేపథ్యంలో పంజాబ్ ఆరోగ్యమంత్రి బల్బీర్‌సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సంఘటనపై కమిటీతో దర్యాప్తు చేయిస్తామని, ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News