Monday, May 27, 2024

మాయదారి వైద్యం!

- Advertisement -
- Advertisement -

మనిషికి ప్రాణం పోసేవాడు దేవుడేనని భావిస్తే, ఆ మనిషి అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్యం చేసి, పునర్జీవితం ప్రసాదించేవాడు వైద్యుడు. అందుకనే వైద్యుడు దేవుడితో సమానమని చెబుతూ ‘వైద్యో నారాయణో హరిః’ అన్నారు. సేవాభావం ప్రస్ఫుటించే అరుదైన రంగాలలో వైద్యం కూడా ఒకటి. ఆత్మతృప్తినిచ్చే వైద్యవృత్తికి అంకితమై మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆచరించినవారు ఎందరో ఉన్నారు. రానురాను ఇతర రంగాల మాదిరిగానే వైద్యరంగం కూడా అవినీతి, ధనార్జన వంటి చీడపీడలతో కుంగి కృశిస్తోంది. సేవాతత్పరత తగ్గి, మితిమీరిన ధనాశతో కొందరు వైద్యులు తమ వృత్తికే కళంకం తెస్తున్నారు.

అవసరమైనా, కాకపోయినా ఎడాపెడా మందులు రాస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నట్లు భారతీయ వైద్య మండలి (ఐసిఎంఆర్) తాజా పరిశోధనలో వెలుగు చూడటం ఆందోళన కలిగించే అంశం. ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్ వంటి ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులలోనూ డాక్టర్లు రాస్తున్న ప్రిస్క్రిప్షన్లలో నిబంధనల అతిక్రమణ జరుగుతోందంటూ ఐసిఎంఆర్ అనుబంధ పత్రిక ఐజెఎంఆర్ లో ప్రచురితమైన ఈ నివేదిక- ముందూవెనకా చూడకుండా డాక్టర్లు ఏ రీతిన మందులు రాస్తున్నారో సవివరంగా కళ్లకు కట్టింది. వైద్యులు మందులు రాస్తున్న పద్ధతిలో ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూసేందుకు ఐసిఎంఆర్ ఏకంగా 4,838 ప్రిస్క్రిప్షన్లపై అధ్యయనం చేస్తే, వీటిలో 55 శాతం మటుకే నిబంధనల మేరకు ఉన్నాయట. జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్.. ఇలా ఒకటేమిటి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని విభాగాలలోనూ డాక్టర్లు ఎడాపెడా మందులు రాస్తున్నట్లు వెల్లడైంది.

ఇలా అయినదానికీ, కానిదానికీ మందులు రాసి పారేసే డాక్టర్లను చూసే కాబోలు ‘నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర’ అనే ఛలోక్తి పుట్టింది. పేదలకు ఔషధాలు అందుబాటులో ఉంచాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనరిక్ మందులను కూడా కొందరు డాక్టర్లు భ్రష్టు పట్టిస్తున్నారు. స్వయంగా ప్రధానమంత్రి జన ఔషధి పథకం ద్వారా దేశవ్యాప్తంగా వేలాది దుకాణాల ద్వారా ఈ మందులను అందుబాటులోకి తెచ్చినా, వాటిని కొనేవారి సంఖ్య అంతగా లేకపోవడానికి కారణం- బ్రాండెండ్ ఔషధాలను విక్రయించడానికే చాలా మంది డాక్టర్లు మొగ్గు చూపడమని నిస్సందేహంగా చెప్పవచ్చు. జనరిక్ మందులు నాసిరకమైనవని చెబుతూ, రోగులకు ఖరీదైన బ్రాండెడ్ మందులను అంటగడుతున్నారు. సదరు మందులను రాసినందుకు ఆయా కంపెనీలు ఇచ్చే తాయిలాలకు లొంగిపోయిన అనేక మంది డాక్టర్లు జనరిక్ మందులు రాయడానికి ఇచ్చగించరు. దీనివల్ల నష్టపోయేది రోగులు మాత్రమే.

ఇందులో మరో కోణం ఏమిటంటే- ప్రతి ప్రైవేటు ఆస్పత్రిలోనూ ఓ మందుల దుకాణం ఉంటోంది. ఆ దుకాణంలో లభ్యమయ్యే ఖరీదైన మందులను మాత్రమే రాయాలంటూ ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్లకు ఆదేశాలు ఇస్తుంది. ఫలితంగా ఆ మందుల దుకాణానికి గిరాకీ పెరుగుతుందన్నమాట. మరోవైపు, ధన సంపాదనలో పడిన అనేక మంది డాక్టర్లు వైద్య రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులపై దృష్టి పెట్టడం లేదు. ఆయా ఓషధుల గురించి తమ వద్దకు వచ్చే మెడికల్ రిప్రజెంటేటివ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ల ద్వారా మాత్రమే తెలుసుకుని, వాటినే రోగులకు ప్రిస్క్రైబ్ చేస్తున్న డాక్టర్లు లేకపోలేదు. కాగా, ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన కొన్ని రకాల మందులు మన దేశం లో ఇప్పటికీ చెలామణిలోనే ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. ఉదాహరణకు ప్రాక్టోలాల్, మెటామిజోల్ వంటి మందుల పై నిషేధం ఉన్నా, వాటిని మన దేశంలో ప్రిస్కైబ్ చేస్తూనే ఉన్నారు.

పన్నెండేళ్లలోపు పిల్లలకు వాడే నిమ్సులైడ్ అనే ఔషధాన్ని భారతదేశం 2011లోనే నిషేధించినా, ఆ మందును ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్లు ఇంకా ఉన్నారంటే ఏమనాలి? భారత డ్రగ్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డు నిషేధించిన మందుల గురించి క్షేత్రస్థాయిలో డాక్టర్లకు అవగాహన లోపించడం ఇందుకు కారణంగా కనబడుతున్నది. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 344 మందుల జాబితా గురించి గ్రామాల్లో వైద్యసేవలు అందించే డాక్టర్లకు సైతం తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించవలసిన బాధ్యత పాలకులపై ఉంది. ఐసిఎంఆర్ రూపొందించిన ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలు వైద్యులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి.

విద్యాధికులైన వైద్యులకు ఒకరు చెప్పవలసిన పని లేదు. కార్పొరేట్ ఆస్పత్రులు విసిరే కాసుల వలలో పడకుండా ప్రభుత్వ ఆస్పత్రులకే అంకితమైన పనిచేస్తున్న డాక్టర్లు అనేక మంది ఉన్నారు. సేవాభావమే ఊపిరిగా, ఆత్మతృప్తే పరమావధిగా వారు వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. వారి అడుగు జాడల్లో నడుస్తూ, ప్రజా శ్రేయస్సును కాంక్షించే డాక్టర్ల సంఖ్య పెరగాలి. ఎవరిదైనా ప్రాణమేననే ఇంగితజ్ఞానంతో వ్యవహరిస్తే వైద్య వృత్తికి వన్నెతెచ్చినవారవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News