రాష్ట్ర సచివాలయంలోకి సందర్శకుల ఎంట్రికి ఈ -పాస్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానం విజిటర్ ఈ పాస్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఈ రోజు నుంచి అమలులోకి వచ్చింది. ఇకపై సచివాలయంలోకి నిత్యం ఎంత మంది సందర్శకులు ప్రవేశిస్తున్నారు, ఏఏ ప్రభుత్వ శాఖల వద్దకు ఎంత మంది సందర్శకులు వెళ్తున్నారనే వివరాలు స్పష్టం అయ్యే అవకాశం ఉంది. కొత్త సచివాలయం నిర్మాణం పూర్తి అయ్యాక గత ప్రభుత్వం సచివాలయంలోకి సందర్శకులను, మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం రోజు నుంచి సచివాలయంలో మీడియాను, సందర్శకులను అనుమతిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో
సచివాలయంలోకి సందర్శకుల తాకిడితో పాటు వాహనాల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. వాహనాలను భద్రతా తనిఖీలు నిర్వహించడం కూడా గగనంగా మారింది. అందరూ విఐపిలకు సంబంధించిన వారు కావడం వల్ల వారి వాహనాలను నిలిపితేనే కసురుకునే పరిస్థితులను భద్రతాసిబ్బంది ఎదుర్కొంటున్నారు. సచివాలయంలో మంత్రులఅ వద్దకు వచ్చే పెద్దలు కొందరు వాహన భద్రత ప్రమాణాలు పాటించకపోవడం గమనార్హం. ఎవ్వరిని నొప్పించకుండా భద్రతా సిబ్బంది తమ విధులను నిర్వహిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు మంత్రుల పేషీల నుంచి వారికి మందలింపులు ఎదుర్కొనక తప్పడంలేదు. సచివాలయంలో పార్కింగ్ స్థలానికి మించి వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల సచివాలయం భద్రతాసిబ్బందికి కూడా ఇబ్బందికరంగా మారింది.