చెన్నై : నాగాలాండ్ గవర్నర్ గణేశన్ శుక్రవారం కన్నుమూశారు. ఈ నెల 8వ తేదీన కిందపడి గాయాలు అయిన 80 సంవత్సరాల గణేశన్ ఇక్కడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆయన కోలుకోలేకపొయ్యారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 1945లో తంజావూర్లో జన్మించిన గణేశన్ చిన్ననాటనే ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితులు అయ్యారు. సంఘ్ కార్యకర్తగా చురుగ్గా వ్యవహరించారు. 1991లో తమిళనాడు బిజెపిలో చేరిన గణేశన్ పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసేందుకు పాటుపడుతూ వచ్చారు. మధ్యప్రదేశ్ నుంచి బిజెపి కోటాలో రాజ్యసభ సభ్యులుగా వ్యవహరించారు. తరువాత ఆయనను ముందుగా మణిపూర్ గవర్నర్గా నియమించారు. 2022లో బెంగాల్ అదనపు గవర్నర్ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 2023 ఫిబ్రవరి నుంచి నాగాలాండ్ గవర్నర్గా ఉంటూ వస్తున్నారు. నాగాలాండ్ గవర్నర్ మృతి పట్ల ప్రధాని మోడీ శుక్రవారం సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నిబద్ధత, అంకితభావపు జాతీయవాది అని స్పందించారు. తమిళనాడులో బిజెపి బలోపేతానికి అకుంఠిత దీక్షతో పాటుపడ్డారని కొనియాడారు.
నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -
- Advertisement -