మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకంలో అవకతవకల నిర్మూలనకు ప్రభుత్వం గ్రామ స్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం అమల్లో కొన్ని తప్పులు జరగడం, సిబ్బందిపై ఆరోపణలు రావడంతో కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుని కమిటీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. అయితే ఈ కమిటీలు ఏర్పాటు ప్రతిపాదన ఇంకా కార్య రూపం దాల్చలేదని తెలుస్తోంది. ఇంకా కార్యాచరణ అమలు దిశగానే ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిఘా వ్యవస్థను ప్రవేశపెట్టింది. గ్రామస్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఆ నిబంధనలు సక్రమంగా అమలు చేయడం ద్వారా నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకునేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. సోషల్ ఆడిట్ ద్వారా ఉపాధి హామీలో అవకతవకలకు చెక్ పెట్టేందుకు ప్రతి నెలా మొదటి వారంలో కమిటీలు తనిఖీలు చేపడతాయి.
ఇప్పటికే ఈ పథకం అమల్లో క్షేత్రస్థాయిలో పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఈ ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్ ట్రాకింగ్, రియల్ టైమ్ రిపోర్టింగ్ ద్వారా అక్రమాలను అరికట్టడం, షాడో కూలీలు, నిధుల దుర్వినియోగం వంటి వాటికి చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒక్కో గ్రామస్థాయి కమిటీలో ఐదుగురు చొప్పున ప్రభుత్వ సిబ్బంది సభ్యులుగా ఉంటారు. ఇతర గ్రామాల్లో వారిని సభ్యులుగా నియమించడం ద్వారా స్థానికంగా ఉన్న వారి ప్రభావం వారిపై తగ్గుతుందని ప్రభుత్వ యోచన. ఈ కమిటీ ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనుల తీరును పర్యవేక్షించడం, కూలీల హాజరు నమోదు పరిశీలన, వారికి చెల్లింపులు జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాయి. ఈ కమిటీలపై జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు దృష్టిసారించాల్సి ఉంటుంది. సోషల్ ఆడిట్లో ఏదైనా అక్రమాలు బయట పడితే అందుకు బాధ్యులైన వారిని గుర్తించి సత్వర చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి వారి నుంచి దుర్వినియోగమైన నిధులు రాబట్టడం, అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో పరిశీలించి లోతుగా విచారించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది.
పేదలకు జీవనాధారం.. ఉపాధి హామీ పథకం
ఉపాధి హామీ పథకం పేదలకు జీవనాధారంగా ఉంది. గ్రామాల్లో సరిగ్గా పని లేని వారికి జీవనాధారంగా మారింది. అయితే ఈ పథకంలో అక్రమాలు చోటుచేసుకోవడం వల్ల కమిటీల రూపకల్పన జరిగింది. ఈ పథకంలో కీలకమైన ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల పథకం అమలుకు తూట్లు పడుతోందని ప్రభుత్వానికి చాలా సందర్భాల్లో నివేదికలు అందాయి. కూలీలకు రావాల్సిన సొమ్ములు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యంగా హాజరు విధానంలో అవకతవకలు ఎక్కువ జరిగినట్లు నివేదికలు అందడంతో అటువంటి వాటిని కట్టడి చేసేందుకు ఈ కమిటీలు పని చేయాల్సి ఉంటుంది. పనిచేసే చోట కూలీలను రెండుసార్లు ఫొటో తీసి ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది.
నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లో కార్మికుల ఫొటోలను నమోదు చేయాల్సి ఉంది. మొదటి ఫొటో ఉదయం 9 గంటలకు తీసి అప్ లోడ్ చేసి, తర్వాత ఫొటో సాయంత్రం 4 గంటల తర్వాత తీసి సంబంధిత యాప్లో నమోదు చేయాలి ఉంటుంది. ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేసేందుకు కమిటీలు పర్యవేక్షించాల్సి ఉంది. ఈ ప్రక్రియ అన్ని గ్రామాల్లో ఇంకా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని తెలుస్తోంది. ఈ కమిటీలపై పర్యవేక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉండగా, నిత్యం నివేదికలను సంబంధిత ఎండిఓలకు అందించాల్సి ఉంటుంది. అవకతవకలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది.