రెండు శ్లాబ్‌లు తగ్గనున్న జిఎస్‌టి
5,18 శాతం శ్లాబ్‌లకు కుదింపు
12,28శాతం శ్లాబ్‌ల తొలగింపు
నిత్యావసర వస్తువులపై తగ్గనున్న పన్ను భారం
కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై ప్రత్యేక రేటు
కేబినెట్ కమిటీకి ప్రతిపాదించిన కేంద్ర ఆర్థికశాఖ
ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతున్నా ప్రజలకు భారం తగ్గించాలన్నదే లక్షం
సెప్టెంబర్ తదుపరి జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీ : ప్రజలపై పన్ను భారం తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ రెండు అంచెల జిస్‌టి (వస్తు, సేవల పన్ను) రేటు నిర్మాణాన్ని కేబినెట్ కమిటీ (మంత్రుల బృందం)కి ప్రతిపాదించింది. దీనిలో ఎంపిక చేసిన కొన్ని వస్తువుల పై ప్రత్యేక పన్ను రేట్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రోజువారీ వినియోగ వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ‘నెక్ట్ జనరేషన్‘ జిస్‌టి సంస్కరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. జిఎస్‌టి వ్యవస్థలో ’స్టాండర్డ్’, ’మెరిట్’గా వర్గీకరించే -రెండు స్లాబ్‌లను మాత్రమే కల్గివుండాలని రాష్ట్ర ఆర్థిక మంత్రుల కమిటీకి కేంద్రం సూచించింది. అం తేకాకుండా కొన్ని వస్తువులపై ప్రత్యేక రేట్లు కూ డా విధించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ‘నెక్ట్ జనరేషన్‘ జిఎస్‌టి సంస్కరణను ప్రకటించారు. ఇవి చిన్న పరిశ్రమలకు ప్రయోజనాలతో పాటు పన్ను భారాన్ని కూడా తగ్గిస్తాయని హామీ ఇచ్చారు. ఈ తక్కువ పన్నులు ప్రజలకు దీపావళి బహుమతి అని అన్నారు.
ప్రధానంగా ఉండేవి 5 శాతం, 18 శాతం స్లాబ్‌లే..
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిఎస్‌టి స్లాబ్‌లలో 5 శాతం, 18 శాతం మాత్రమే ఉండనున్నాయి. ఈ కొత్త స్లాబ్‌లు ఈ సంవత్సరం దీపావళి నాటికి అమల్లోకి రానున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం నిత్యావసర వస్తువులపై సున్నా జిఎస్‌టి విధిస్తుండగా, రోజు వారీ వినియోగించే వస్తువులపై 5 శాతం పన్ను ఉంది. ఇక స్టాండర్డ్ వస్తువులపై 12 శాతం స్లాబ్, ఎలక్ట్రానిక్స్, సేవలపై 18 శాతం స్లాబ్, లగ్జరీ, హానికరమైన వస్తువులపై 28 శాతం జిఎస్‌టి స్లాబ్ విధిస్తున్నారు. పునరుద్ధరించిన జిఎస్‌టిలో కేవలం రెండు స్లాబ్‌లు 5 శాతం, 18 శాతంతో పాటు లగ్జరీ, హానికరమైన వస్తువులపై 40 శాతం స్లాబ్ మాత్రమే ఉండనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం నాలుగు అంచెల జిఎస్‌టి వ్యవస్థ
ప్రస్తుతం జిఎస్‌టి నాలుగు అంచెల పన్ను వ్యవస్థను కలిగి ఉంది. దీనిలో- 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం స్లాబ్‌లు ఉన్నాయి. ముఖ్యమైన వస్తువులు పన్ను రహితం లేదా తక్కువ పన్ను రేటును కల్గివున్నాయి. అయితే విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై అత్యధిక జిఎస్‌టి రేటు విధించారు. పాన్ మసాలా, కార్లు వంటి వస్తువులపై అదనపు పరిహార సెస్ కూడా విధిస్తారు. పరిహార సెస్ 2026 మార్చి 31న ముగుస్తుంది. ఆ తర్వాత జిఎస్‌టి కౌన్సిల్ ఈ వస్తువులపై కొత్త పన్ను అంచనా కోసం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే జిఎస్‌టి కౌన్సిల్ సెప్టెంబర్‌లో ఈ ప్రతిపాదనపై చర్చిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో సామాన్య ప్రజలకు దీని ప్రయోజనాలు చేరేలా వీలైనంత త్వరగా ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి కృషి చేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.