భారతదేశం గ్రామీణ ఆధారిత దేశం. నూటికి 65% పైగా ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. వ్యవసాయం గ్రామీణ ప్రజల జీవనాధారం. భూమి కలిగి ఉండటం రైతు కుటుంబానికి సామాజిక హోదాను కల్పిస్తుంది. 78 సంవత్సరాల ‘స్వాతంత్య్రం’ తర్వాత కూడా గ్రామీణ ప్రాంతంలో భూమి లేని నిరుపేదలు అత్యధికంగా ఉన్నారు. 1970 దశకంలో ప్రజల ముఖ్యంగా గిరిజన ప్రజల పోరాటం ఫలితంగా భూమి సమస్య ప్రధాన ఎజెండాగా ముందుకు వచ్చింది. రాష్ట్రాల వారీగా భూసంస్కరణల చట్టాలు వచ్చాయి. 1972లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో జాతీయ స్థాయిలో ఒకే సీలింగ్ విధానాన్ని రూపొందించారు. ఈ సీలింగ్ ద్వారా 67 లక్షల ఎకరాల మిగులు తేలింది. ప్రభుత్వ విధానాలు, పాలసీలపై పరిశోధన, శిక్షణ నిమిత్తం ఏర్పడిన లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ అకాడమీ ఆఫ్ అడ్మనిస్ట్రేషన్ అంచనా ప్రకారం సీలింగ్లో పోగా మిగులు భూమి 5 కోట్ల, 20 లక్షల ఎకరాలు ఉంటాయని అంచనా వేసింది.
పాలకులు మిగులు భూమిగా ప్రకటించిన 67 లక్షల ఎకరాల్లో 20 లక్షల, 30 వేల ఎకరాలు స్వాధీనం చేసుకుని అందులో 10 లక్షల 90 వేల ఎకరాలను 50 లక్షల కుటుంబాలకు పంపిణీ (Distribution families) చేసినట్లు జాతీయ భూసంస్కరణల కౌన్సిల్ 2008లో ప్రకటించింది. దీన్ని గమనిస్తే మిగులుగా ప్రకటించిన భూమిలో 11 లక్షల ఎకరాల లోపు మాత్రమే పేదలకు పంపిణీ చేయబడింది. దేశంలో 15 కోట్ల, 50 లక్షల ఎకరాల సాగు భూములు ఉంటే, 67 లక్షలు మాత్రమే మిగులు భూమిగా ప్రకటించటం భూసంస్కరణలు ఎంత బూటకంగా మారింది అర్థమవుతుంది. భూస్వాములు, ధనిక రైతులు బినామీల, కోర్టుల కేసుల ద్వారా తమ భూములు సీలింగ్లోకి రాకుండా కాపాడుకున్నారు.
మిగులు భూమిలో 1.25% మాత్రమే దళితులకు, పేదలకు పంపిణీ చేయబడింది. పంపిణీ చేయబడి భూముల్లో అత్యధికం అంతకు ముందే పేదలు సాగు చేసుకుంటున్న భూములే ఉన్నాయి. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1972లో భూ సంస్కరణల చట్టం చేయబడి 1973లో అమల్లోకి వచ్చింది. భూసంస్కరణల చట్టప్రకారం మొదట 18 లక్షల ఎకరాలను మిగులు భూమిగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి సవరణలతో కుదిస్తూ చివరికి 7.9 లక్షల ఎకరాల మిగులు భూమి ప్రకటించి అందులో 6.47 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుని, 5.82 లక్షల ఎకరాలను లక్షా, 79 వేల మందికి పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని భూస్వాములు, ధనిక రైతులు సీలింగ్లోకి రాకుండా తమ భూములు కాపాడుకున్నారు.
భూసంస్కరణల చట్టాలవల్ల భూసంబందాల్లో మౌలికమైన మార్పులు జరగలేదు. కొద్ది మంది వద్దే భూమి కేంద్రీకరించబడి ఉంది. 2020 జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం 84%గా ఉన్న చిన్న, సన్నకారు రైతులు హెక్టార్ కన్నా తక్కువ భూమి కలిగి ఉన్నారు. వీరి వద్ద ఉన్న మొత్తం భూమి 47.3%గా ఉంది. 13.8%గా ఉన్న ధనిక రైతాంగం పంట భూమిలో 47% పైగా కలిగి ఉన్నారు. కేవలం 4.9% ఉన్న భూస్వాముల వద్ద 32% సాగు భూమి ఉంది. రాష్ట్రాలవారీగా కూడా భూకేంద్రీకరణలో వ్యత్యాసాలు ఉన్నాయి. పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో 10%గా భూస్వాముల వద్ద 80 శాతం భూమి ఉంది. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, రాష్ట్రాల్లో 55% భూమి 10% గా ఉన్న భూస్వాముల వద్ద ఉంది. భారతదేశంలో ఒక పెద్ద భూకామందు ఒక సన్నకారు రైతు కన్నా 45 రెట్లు భూమి కలిగి ఉన్నారు.
దేశంలో ఇప్పటికీ 20 ఎకరాల పైబడి భూమి కలిగిన 93 వేల ధనిక కుటుంబాల వద్ద 4 కోట్ల, 40 లక్షల ఎకరాల భూమి ఉంది. 10 నుండి 12 ఎకరాల సీలింగ్ విధించి భూ సంస్కరణలు అమలు జరిపితే లక్షల కొద్ది భూములు పేదలకు పంపిణీచేయవచ్చు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 24 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచవచ్చు. భూకామందుల వద్దే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద, మత సంస్థల వద్ద లక్షలాది ఎకరాల భూమి ఉంది. 2021 నాటికి భారతదేశంలోని 51 కేంద్ర మంత్రిత్వ శాఖలు, 1160 ప్రభుత్వ రంగ సంస్థలు 15,531 చదరపు కిలోమీటర్ల భూమిపై యాజమాన్యం కలిగి ఉన్నాయి. డైరెక్టరేట్ డిఫెన్స్ ఎస్టేట్ ప్రకారం రక్షణ శాఖ 17.99 లక్షల ఎకరాల భూమి కలిగి ఉంది దేశంలో అతిపెద్ద భూయజమానులలో ఒకటిగా ఉంది. భారత రైల్వేలు 2022 నాటికి 4.86 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది.
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వేతర భూస్వాముల్లో కాథలిక్ చర్చ్ 17.29 కోట్ల ఎకరాల భూమి కలిగి ఉంది. వక్ఫ్ సంస్థలు 60 లక్షల ఎకరాలతో దేశంలో మూడవ అతిపెద్ద భూస్వామిగా ఉంది. ఇంకా గోద్రేజ్ పాపర్టీస్, డిఎల్ఎఫ్, ఎల్అండ్టి రియాల్టీ, ఇండియా బుక్స్ రియల్ ఎస్టేట్ సంస్థలు వేల ఎకరాల భూములు కలిగి ఉన్నాయి. ఇవేకాకుండా అనేక రాష్ట్రాల్లో వేలాది ఎకరాల ఆలయ భూములు ఉన్నాయి. తెలంగాణలో 91,827 ఎకరాలు, తమిళనాడులో 4.78 లక్షల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల ఎకరాల హిందూ ధర్మాదాయ భూములు, కర్ణాటకలో ముజ్లాయి దేవాలయాల పేరుతో 15, 414.17 ఎకరాలు, ఒడిశాలో 13 దేవాలయాలు 12,776 ఎకరాలు, గుజరాత్ లోని సోమనాధ్ ఆలయానికి 1,700 ఎకరాలు భూములు ఉన్నాయి. ఈ వాస్తవాన్ని గ్రహిస్తే భూకేంద్రీకరణ ఎంతగా ఉంది, భూ కేంద్రీకరణను బద్దలు కొట్టాల్సిన ఆవశ్యకత అర్ధమవుతుంది.
దేశంలో భూసంస్కరణలు అమలు జరిపారని, భూస్వామ్య విధానం లేదని, దాని అవశేషాలు మాత్రమే ఉన్నాయని, పంచటానికి భూములు లేవని కొందరుచేస్తున్న వాదనలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. కొద్ది మంది వద్దే భూకేంద్రీకరణ ఉండటం, ప్రభుత్వ రంగ సంస్థల వద్ద లక్షలాది ఎకరాలు ఉండటం, మత సంస్థల ఆధీనంలో అపారంగా భూములు ఉండటం వీరికి కన్పించటం లేదు. కొత్తగా భూ పరిమితిని సవరించి, మిగులు భూములను స్వాధీనం చేసుకుని, ప్రభుత్వరంగ సంస్థలకు అవసరం మేరకే భూకేటాయింపు చేసి, మతసంస్థల వద్ద ఉన్న భూములను స్వాధీనం చేసుకుని భూపంపిణీ చేయగలిగినప్పుడే పేదలకు భూమి లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర పాలకులు ఇలాంటి విధానాలు అమలు జరపకుండా, ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉన్న భూములను దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయి. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ పేదలు భూమి కోసం సంఘటితం కావాలి.
- బొల్లిముంత సాంబశివరావు
98859 83526