వరుసగా పట్టుబడుతున్న విద్యార్థులు
ప్రముఖ కాలేజీల్లో జోరుగా డ్రగ్స్ దందా
మనతెలంగాణ, సిటిబ్యూరోః డ్రగ్స్ మాఫియా కార్పొరేట్ కాలేజీలను టార్గెట్‌గా చేసుకుని విక్రయాలు చేస్తున్నారు. ఈగల్ పోలీసులు వరుసగా దాడులు కార్పొరేట్ కాలేజీలు, ప్రఖ్యాత యూనివర్సిటీల్లో తనిఖీలు చేస్తుండడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేరుమోసిన కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలుగా మారినట్లు బయటపడింది. ఈగల్ పోలీసులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. తనిఖీల్లో పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థులు డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేస్తుపట్టుబడ్డారు. ఈగల్ పోలీసులు మహీంద్రా యూనివర్సిటీపై దృష్టి పెట్టడంతో డ్రగ్స్, గంజాయి తీసుకుంటున్న 50మంది విద్యార్థులు పట్టుబడ్డారు. వీరికి పరీక్షలు నిర్వహించేందుకు ఈగల్ పోలీసులు సిద్దమవుతున్నారు. ఇది వరకు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు, ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్ నుంచి ఆన్‌లైన్‌లో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. నిందితుడు విద్యార్థులకు ఎండిఎంఏ డ్రగ్స్ కొరియర్ ద్వారా పంపిస్తున్నాడు.
డ్రగ్స్ తీసుకుంటున్న విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. విద్యార్థులు డ్రగ్స్‌తో పట్టుబడడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది, విద్యార్థులు చదువు కోవడానికి వచ్చి మత్తుమందులకు బానిసలుగా మారుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే కాకుండా గురునానక్ ఇంజనీరింగ్ కాలేజి, చైతన్య భారితి ఇంజనీరింగ్ కాలేజీ తదితర కాలేజీల విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నారని, వారిపై నిఘా పెట్టామని ఈగల్ పోలీసులు హెచ్చరించారు. మరిన్ని కాలేజీల్లో దాడులు చేసేందుకు ఈగల్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రముఖ కాలేజీలు కావడంతో స్థితిమంతుల పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. వారు కాలేజీకి వెళ్లడంతో పాటు డ్రగ్స్ బారినపడుతున్నారు. ఈ కాలేజీల్లో యాజమాన్యాలు విద్యార్థులను గాలికి వదిలేయడం వల్లే డ్రగ్స్‌కు అడ్డామారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా కాలేజీ హాస్టళ్లలో ఉంటున్న వారిపై ఎలాంటి నిఘా లేదని, విద్యార్థుల రూములు తనిఖీలు చేయడం లేదని పోలీసులు ఆరోపించారు. దీంతో హాస్టళ్లలో విద్యార్థులు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేసి తీసుకుని వచ్చి హాస్టల్ రూముల్లోనే వినియోగిస్తున్నారు. విద్యార్థుల డ్రగ్స్ వినియోగంపై పోలీసులు మరింత దృష్టి సారించి అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
పుష్కలంగా డబ్బులు…
మహీంద్ర యూనివర్సిటీలో చదువు కోవాలంటే లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇక్కడ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన పిల్లలు చదవడం సాధ్యం కాదు. కేవలం ఉన్న స్థితిమంతులు పిల్లలు మాత్రమే చదువు కోగలరు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. వీరికి తల్లిదండ్రులు పాకెట్‌మనీగా భారీగా డబ్బులు ఇస్తుండడంతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. విద్యార్థుల వద్ద డబ్బులు ఎక్కువగా ఉండడంతో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. రూ.2,500కు ఎండిఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ చదివే విద్యార్థులకు నెలకు రూ.20,000 కేవలం డ్రగ్స్ కొనుగోలుకు వెచ్చిస్తున్నారు.