Monday, September 1, 2025

విద్యకు, కేరళకు విడదీయరాని అనుబంధం ఉంది: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

విద్యకు ప్రాధాన్యతనిస్తున్న కేరళ దైవ భూమి
కేరళ అమలు చేస్తున్న ‘వయోజన విద్యా కార్యక్రమం’
అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది

తెలంగాణలో విద్యాశాఖను తీసుకునేందుకు నేతలెవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు
కెసి వేణుగోపాల్ రచించిన పుస్తకావిష్కరణలో సిఎం రేవంత్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో విద్యాశాఖను తీసుకునేందుకు నేతలెవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలోని అలెప్పీలో కెసి వేణుగోపాల్ రచించిన పుస్తకాన్ని సిఎం రేవంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వందశాతం అక్షరాస్యతో దేశంలోనే కేరళ ఫస్ట్ ప్లేస్‌లో ఉందన్నారు. విద్యకు, కేరళకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. దేశంలో వందశాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచిందన్నారు. ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘వయోజన విద్యా కార్యక్రమం’ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని సిఎం రేవంత్ అన్నారు. కేరళ రాష్ట్రం విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్య అనేది మనకు లభించిన ఒక గొప్ప బహుమతి అని ఆయన అభివర్ణించారు. విద్య అన్నది ఒక గొప్ప ఆయుధమని, అదే అందరికీ గొప్ప శక్తి అని తాను కూడా చాలా బలంగా విశ్వసిస్తానని ఆయన తెలిపారు. అలాంటి విద్యకు ప్రాధాన్యతనిస్తున్న దైవ భూమి కేరళ అని సిఎం రేవంత్ కొనియాడారు. అందుకే అందరితో పాటు తనకు కూడా కేరళను చూస్తే అసూయగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. 10వ, 12వ తరగతి తర్వాత సున్నా శాతం డ్రాప్ అవుట్స్ సాధిస్తే అందులో ఆశ్చర్యమేమీ ఉండదని ఆయన అన్నారు.

ఏఐ టెక్నాలజీతో ఐటిఐ స్టూడెంట్స్‌కు టీచింగ్ ఇప్పిస్తున్నాం
తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన విద్య అందిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని సిఎం రేవంత్ అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. పిపిపి మోడల్ పద్ధతిలో యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీకి రూ.5 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏఐ టెక్నాలజీతో ఐటిఐ స్టూడెంట్స్‌కు టీచింగ్ ఇప్పిస్తున్నామన్నారు. తెలంగాణలో కూడా విద్యాభివృద్ధికి పెద్ద ఎత్తున దృషి సారించామని సిఎం రేవంత్ తెలిపారు. విద్యకు ఉన్న ప్రాధాన్యత గురించి తాను ప్రతి సందర్భంలోనూ ప్రజలకు చెబుతున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు ఏదీ చేసినా విద్య మనకు అత్యంత ప్రాధాన్యత కలిగిందని ఆయన తెలిపారు. యూత్ స్కిల్స్ అభివృద్ధిలో సౌత్ కొరియా అగ్రస్థానంలో ఉందని సిఎం రేవంత్ అన్నారు.

తెలంగాణలో పోటీకి ప్రియాంక గాంధీని ఆహ్వానించాం
పేదలు, మైనార్టీల కోసం కెసి వేణుగోపాల్ నిరంతర పోరాటం చేస్తున్నారని ఆయన అండతోనే తెలంగాణ అభివృద్ధిపై మరింత ఫోకస్ చేశామని రేవంత్ తెలిపారు. ఎంపిగా గెలిచిన ప్రియాంకగాంధీ తన నియోజకవర్గాన్ని కర్మ భూమిగా భావిస్తారని రేవంత్ చెప్పారు. తెలంగాణలో పోటీకి ప్రియాంక గాంధీని ఆహ్వానించామని, కానీ, కెసి వేణుగోపాల్ విజ్ఞప్తి మేరకే ప్రియాంక కేరళలో పోటీ చేశారన్నారు. కెసి వేణుగోపాల్ అణిచివేతకు, అన్యాయానికి గురవుతున్న బాధితుల తరఫున గొంతుకగా నిలుస్తున్నారని అన్నారు. ఆయన కేరళ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ, ప్రత్యేకించి మహిళలు, పిల్లల న్యాయం కోసం, వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారని సిఎం రేవంత్ చెప్పారు. 2006లో కెసి వేణుగోపాల్ ప్రారంభించిన పొంథువల్ (ఎంపి) మెరిట్ అవార్డులకు దేశంలోనే చాలా ప్రత్యేకత ఉందన్నారు. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి, వారిలో ఒక స్ఫూర్తిని నింపడానికి ఈ మెరిట్ అవార్డులు ఎంతగానో దోహదపడుతున్నాయని సిఎం రేవంత్ అన్నారు. ఈ ఏడాది వందశాతం ఫలితాలను సాధించిన 150 పాఠశాలల్లో దాదాపు 3,500 లకుపైగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవార్డులు అందిస్తున్నారన్నారు.

55 రోజుల్లో 11,055 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశాం
2047 నాటికి తెలంగాణ 3 మిలియన్ డాలర్ల ఎకానమీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు. వచ్చే పదేళ్లలో తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేరుకుంటుందని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేవలం 55 రోజుల్లో 11,055 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించబోతున్నామని ఆయన తెలిపారు. ఒక్కో స్కూల్‌ను రూ.200 కోట్లు ఖర్చుతో 25 ఎకరాల్లో నిర్మించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.

2029లో జరిగేవి దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు
త్వరలో కేరళ రాష్ట్రానికి ఎన్నికలు రాబోతున్నాయని 2026లో జరిగే ఎన్నికలను కేవలం కేరళ అసెంబ్లీ ఎన్నికలుగా భావించవద్దని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అవి 2029లో దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అవుతాయన్నారు. దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి రాజీవ్ గాంధీ ఓటు హక్కు కల్పించారన్నారు. అదే బిజెపి నాయకుడు నరేంద్ర మోడీ పౌరుల నుంచి ఓటు హక్కును కొల్లగొడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 2029లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిల మధ్య ఉన్న తేడాను గమనించాలని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News