Monday, September 1, 2025

ఆరునూరైనా.. బిసిలకు 42 శాతం ఇస్తాం: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

చట్టబద్దంగా ముందుకెళుతున్నాం..తప్పుడు ధోరణితో అడ్డుపడొద్దు
‘స్థానిక’ ఎన్నికలోల బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు చిత్తశుద్ధితో ఉన్నాం
బిసిలకు న్యాయం చేయాలని చూస్తుంటే బిఆర్‌ఎస్ అడ్డుకుంటోంది
కెసిఆర్ చేసిన 2018 పంచాయతీరాజ్ చట్టమే ఇప్పుడు గుదిబండగా మారింది
అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లులపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో చట్టబద్దంగా, చిత్తశుద్దితో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తమ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్లు జనాభా ప్రాతిపదికన ఎవరికి ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలో అంత ఇచ్చేందుకు కృషి చేస్తుంటే బిఆర్‌ఎస్ పార్టీ అడ్డుపడుతోందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తాము చిత్తశుద్దితో పని చేస్తున్నామని అన్నారు. ఆరునూరైనా రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ఆదివారం బీసీ రిజర్వేషన్లపై చర్చ ప్రారంభం కాగా ఆ చర్చలో బిఆర్‌ఎస్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో స్పందించారు.

రిజర్వేషన్ల అమలుపై సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి తెలియకుండా తాను నిర్ణయం తీసుకోలేదని అసెంబ్లీ సాక్షిగా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని, ఇప్పటికే ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఐదు సార్లు ప్రయత్నించామని అన్నారు. ప్రధానిపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా కూడా చేశామని, ఇతర రాష్ట్రాల వారు తమకు మద్దతిచ్చారు కానీ అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ ఎంపీలు మాత్రం స్పందించలేదని విమర్శించారు. బలహీనవర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్‌ఎస్‌కు ఇష్టం లేదని సిఎం వ్యాఖ్యానించారు.

కోర్టు ఆదేశాలో డెడికేటెడ్ కమిషన్ వేశాం
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హైకోర్టులో వేసిన పిటీషన్‌పై కోర్టు ఇచ్చిన ఆదేశాలతో బీసీ రిజర్వేషన్లకు రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్‌ను వేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలని తాము ప్రయత్నిస్తోంటే బీఆర్‌ఎస్ అడ్డుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ కు పంపిస్తే గవర్నర్, గత సీఎంల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే బిల్లులు ఆగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తెరవెనుక లాబీయింగ్ జరిగిందని పేర్కొన్నారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలైతే తాను సంతోషంగా ఉంటానని మాత్రమే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారని, తమ నాయకులైన కేసీఆర్, కేటీఆర్ ఈ బిల్లు అమలైతే సంతోషంగా ఉండరని చెప్పకనే చెప్పారని చురకలు వేశారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలుపై ఆరోపణలు చేయడం మాని, సూచనలు చేయాలని గంగుల కమలాకర్‌ను కోరారు. ఎలాంటి సవరణలు లేకుండా బిల్లును ఆమోదించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. అది కల్వకుంట్ల కుటుంబం కాదని, ఎవరూకలవకుండా చూసే కుటుంబమని కేసీఆర్ కుటుంబంపై వ్యాఖ్యానించారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్న చిత్తశుద్ధి కేసీఆర్‌కు ఏ మాత్రం ఉన్నా సభకు వచ్చేవారని అన్నారు. ఈ సభను వేదికగా చేసుకొని బలహీన వర్గాలకు అనుమానం కలిగేలా గంగుల కమలాకర్ తప్పుడు సమాచారాన్ని ఇవ్వొద్దని కోరుతున్నానని అన్నారు.

అడ్డంకులు రాకూడదనే అధికారులు, మంత్రుల కమిటీలను ఇతర రాష్ట్రాలకు పంపించాం
బీహార్, రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో జివో అమలు చేస్తే అడ్డంకులు వచ్చాయని గంగుల కమలాకర్ గతంలో చెప్పారని అయితే అలాంటి అడ్డంకులు తెలంగాణలో రాకూడదనే అధికారుల కమిటీని, మంత్రులను పంపించి ఇతర రాష్ట్రాలలో సమాచారాన్ని సేకరించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను పరిశీలించిన తర్వాతనే డెడికేషన్ కమిషన్‌ను నియమించామని అన్నారు. ఈ మొత్తం ప్రక్రియ 2024 ఫిబ్రవరి 4న మొదలుపెట్టి 2025 ఫిబ్రవరి 4 న పూర్తి చేశామని తెలిపారు. 365 రోజుల్లో పకడ్బందీగా చట్టాన్ని చేసి స్థానిక సంస్థల్లో బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభలో ఆమోదించుకుని విద్య, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రెండు వేర్వేరు బిల్లులను గవర్నర్‌కు పంపించామని సిఎం వివరించారు. గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపిస్తే ఐదు నెలలుగా ఆ రెండు బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలపై కొందరు హైకోర్టుకు వెళ్లారని, దీంతో సెప్టెంబరు 30 లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.

2018లో ఆనాడు కేసీఆర్ తీసుకొచ్చిన చట్టం గుదిబండగా మారిందని వ్యాఖ్యానించారు. అందుకే తమ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని గవర్నర్‌కు పంపామని చెప్పారు. గవర్నర్ వీళ్ల మాటలు నమ్మి ఆ ఆర్డినెన్స్‌ను కూడా రాష్ట్రపతికి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెరవెనక లాబీయింగ్ చేసి రాష్ట్రపతికి పంపేలా చేశారని విమర్శించారు. ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదు కాబట్టి అత్యవసరమైతే ఆ బిల్లును సభలో ఆమోదించుకుంటామని, ఇవాళ ఆ బిల్లును ఆమోదించుకుందాం అంటే ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. బలహీన వర్గాలు ఒకరినొకరు అవమానించుకుని ఇతరుల ముందు పలుచన కావొద్దని, గంగుల కమలాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్‌ల మధ్య జరిగిన సంభాషణపై సిఎం వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News