Monday, September 1, 2025

కాళేశ్వరానికి కర్త, కర్మ, క్రియ కెసిఆరే

- Advertisement -
- Advertisement -

దేశంలో అతిపెద్ద మానవ తప్పిదం కాళేశ్వరం 
డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా లేకుండా పనులు
సిడబ్లుసి అనుమతి లేకుండానే నిర్మాణం
అధికారులు హెచ్చరించినా కెసిఆర్ వినలేదు 
కేబినెట్ అనుమతి లేకుండానే నిర్మాణానికి జిఒ 
కెసిఆర్‌పై చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది
అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలు
నీళ్లు, డబ్బులు పోయాయి : భట్టి

మన తెలంగాణ/హైదరాబాద్: సిడబ్లూసి అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ఈ విషయాన్ని పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ మాజీ సిఎం కెసిఆర్ అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం అసెంబ్లీలో పిసి ఘోష్ కమిషన్ నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి లఘు చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద మానవ తప్పిదం కాళేశ్వరం నిర్మాణమని, అధికారులు హెచ్చరించినా ఆనాడు కెసిఆర్ వినలేదని మంత్రి ఉత్తమ్ సభకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ఆయన అన్నారు. మేడిగడ్డ నిర్మాణం మాజీ సిఎం కెసిఆర్‌ది వ్యక్తిగత నిర్ణయమని ఆయన తెలిపారు. అప్పటి కేబినెట్ అనుమతి లేకుండానే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి జీఓ ఇచ్చారని మంత్రి ఉత్తమ్‌కుమార్ ఆరోపించారు.

కాళేశ్వరం కోసం రూ.87,449 కోట్లకు పైగా ఖర్చు చేశారని, తీరా ఇప్పుడు చూస్తే ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. రూ.21 వేల కోట్లతో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కట్టారని ప్రస్తుతం ఆ బ్యారేజీలు నిరుపయోగంగా మారాయ న్నారు. 20 నెలల నుంచి అవి నిరుపయోగంగా ఉండటం చాలా బాధాకరమైన విషయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడు బ్యారేజీల టెండర్‌ల విధానంలోనూ నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలో కమిషన్ సూచించిందని ఆయన ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టాలని 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని, వాప్కోస్ రిపోర్ట్ కంటే ముందే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. 2014లో హైడ్రాలజీ క్లియరెన్స్ సైతం వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రాణహిత చేవెళ్లపై 2014 నాటికే రూ.11 వేల 600 కోట్లు ఖర్చు పెట్టామని, ప్రాణహిత ప్రాజెక్టు అంచనా రూ.38 వేల 500 కోట్లు అయితే కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేల కోట్లు ఖర్చు చేశారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు.

రూ.38 వేల 500 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్లను అకారణంగా రీజన్ లేకుండానే కెసిఆర్ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి దానిని లక్షా 47 వేల కోట్ల రూపాయలకు పెంచారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. అప్పటి సిఎం అహోదాలో కెసిఆర్ ఇంజనీర్‌లా వ్యవహారించి టెక్నికల్ అంశాల్లో జోక్యం చేసుకున్నారని ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 195 టిఎంసిల నీటిని ఎత్తివేస్తామని బిఆర్‌ఎస్ చెప్పిందని, ఐదేళ్లలో మొత్తం 125 టిఎంసీలను మాత్రమే లిఫ్ట్ చేశారని, అందులో 35 టిఎంసీలను మళ్లీ సముద్రంలోకి వదిలేశారని ఆయన తెలిపారు. లక్షకు పైగా కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టులో అతి తక్కువ కాలంలోనే ఆరు పిల్లర్లు కూలిపోవడం దారుణమని మంత్రి ఉత్తమ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

సరైన ప్రణాళికలు లేకుండానే మేడిగడ్డ చేపట్టారని కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని, భూగర్భ జలాలు దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు కట్టలేదని తేల్చిందని మంత్రి పేర్కొన్నారు. ఈ మూడు ప్రాజెక్టుల్లో సరైన నిర్వహణ లేదని, నిర్లక్ష్యంగా,అక్రమంగా, అసంబంధ్ధంగా ఈ ప్రాజెక్టు కట్టారని కమిషన్ తన నివేదికలో తెలిపిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్లానింగ్ డిజైనింగ్‌లో మెయింటనెన్స్‌లో విఫలం అయ్యిందని కమిషన్ తన నివేదికలో పేర్కొందన్నారు. ఏయే నేతలు, అధికారులు ఈ ప్రాజెక్టుల్లో బాధ్యులో కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. అందుకే 600 పేజీల పిసి ఘోష్ కమిషన్‌ను నివేదికను సభ ముందుంచామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వైఫల్యంలో ఇంజనీర్లు, ఐఏఎస్‌లతో పాటు నీటిపారుదల శాఖ, ఆర్థికశాఖ మంత్రులు కూడా బాధ్యులేనని నివేదికలో కమిషన్ తెలిపిందన్నారు.

చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది
కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని, ప్రాజెక్టులో రాజకీయ జోక్యం, నిర్లక్ష్యం ఉందని ఆయన తెలిపారు. రూల్స్ కు విరుద్దంగా నిర్మాణాలకు బడ్జెట్ రిలీజ్ చేశారని, ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్‌పై చట్ట ప్రకారం తగిన చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు.

డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా లేదు
సభ్యుల అభిప్రాయం తీసుకున్నాకే సిఎం రేవంత్‌రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని మంత్రి తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ కమిషన్ అని ఎలా అంటారని మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టకుండా చూడాలని కోర్టుకు వెళ్లింది ఎవరని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. ఎన్‌డిఎస్‌ఏపై బిఆర్‌ఎస్ నేతలు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారని, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బిల్లు తెచ్చినప్పుడు బిఆర్‌ఎస్ మద్ధతు ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా లేకుండా పనులు చేశారని ఎన్‌డిఎస్‌ఏ నివేదికలో ఉందని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News