Thursday, September 11, 2025

మీసేవ ద్వారా సులభంగా కుల ధ్రువీకరణ పత్రాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాల జారీని మరింత వేగవంతం చేస్తూ, ప్రజలకు సులభతరం చేస్తామని ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. మీసేవ ద్వారా ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన 15 రోజుల్లోనే 17,500 మందికి పైగా లబ్ధి చేకూరిందని, ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది ఈ మార్పులతో ప్రయోజనం పొందనున్నారని ఆయన తెలిపారు. కొత్త విధానంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కుల ధ్రువీకరణ పత్రం మళ్లీ తీసుకునేటప్పుడు ప్రతి సారి ఆమోద ప్రక్రియకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీసేవ కేంద్రాల్లోనే నేరుగా పత్రాలు జారీ అవుతాయి. అయితే 2020 సెప్టెంబర్ 9న జారీ చేసిన జి.ఓ.ఎమ్.సంఖ్య 3 ప్రకారం హిందూ ఎస్సీ వర్గానికి చెందిన వారు క్రైస్తవ మతంలోకి మారి బీసీ-సీ వర్గంలోకి వచ్చే ప్రత్యేక సందర్భాల్లో మాత్రం పూర్వపు ఆమోద విధానం అమల్లోనే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

Also Read: గ్రూప్ 1 కుంభకోణం కేసును సిబిఐకి అప్పగించాలి:ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రజలకు వేగంగా, నిశ్చితంగా సేవలు అందించడమే మా ఉద్దేశ్యం. అవసరం లేని ఆమోదాలు తొలగిస్తూనే ప్రత్యేక సందర్భాల్లో కఠినతర పరిశీలన కొనసాగుతుందని శ్రీధర్ బాబు సమీక్షా సమావేశం అనంతరం తెలిపారు. కొత్తగా జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రంలో మొదటిసారి ఆమోదం తెలిపిన అధికారిపేరు, కొత్త జారీ తేదీ ఉంటాయి. పాత సర్టిఫికేట్ నంబర్ తెలిసినవారు వెంటనే ముద్రణ పొందవచ్చు. గుర్తు లేకపోతే జిల్లా, మండలం, గ్రామం, ఉపజాతి, పేరుతో శోధన చేసి పత్రం ఇస్తారు. పేరు, ఇంటిపేరు, తండ్రి పేరు వంటి సవరణల కోసం మాత్రం జిల్లా అధికారికి ఫిర్యాదు చేసి, కొత్త దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీసీఎల్‌ఏ, బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమ శాఖలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లతో జరిగిన సంప్రదింపుల తర్వాత ఈ మార్పులు అమల్లోకి వచ్చాయని మంత్రి వివరించారు. మరిన్ని వివరాలకు పౌరులు మీసేవ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదా సమీప మీసేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News