హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్య్రం ఎలా లభించిందో, గ్రామీణ ప్రాంతాల్లో నిజాం పాలనలో జరిగిన అత్యాచారాలు, అరాచకాలను తెలియజేసేలా, ఆర్యసమాజ్ వంటి సంస్థలు రజాకర్లకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటాన్ని రజాకర్ సినిమాలో స్పష్టంగా చూపించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రావు అన్నారు. రజాకర్ చిత్ర నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో ‘రజాకర్’ సినిమా వీక్షించిన అనంతరం బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రాన్ని కమర్షియల్ ఎలవెంట్స్ లేకుండా, నిజాం పాలనలో రజాకార్లు ప్రజలపై చేసిన దాడులు,
అరాచకాల గురించి వాస్తవంగా చూపిస్తూ చరిత్రను కళ్ల ముందు ఉంచారని అభినందించారు. బైరాన్ పల్లి, గుండ్రాంపల్లి, పరకాల, నిర్మల్ వెయ్యి ఉరుల చెట్టు, జోడేఘాట్ వంటి చారిత్రక ప్రదేశాలు, ఆ ప్రాంతాల్లో జరిగిన పోరాటాలను వివరంగా చూపించారు. భావితరాలకు చరిత్రను తెలియజేయడం ముఖ్య లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ‘రజాకర్’ సినిమాకు అవార్డు ప్రకటించిందని గుర్తు చేశారు. గూడూరు నారాయణరెడ్డి చారిత్రాత్మకంగా మంచి సినిమా తీశారని, అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యకర్తల ద్వారా ప్రజలకు ఈ సినిమా చూపించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
Also Read: కవితతో చింతమడక వాసుల భేటీ
ఈ నెల 17న నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారని రామ్‌చంద్రరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు జరగనున్నాయని తెలిపారు. పెద్దఎత్తున ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊరిలో భారత జెండాను ఎగురవేసి అమరవీరుల త్యాగాలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.