రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ వృత్తి విద్య సహా డిగ్రీ, కాలేజీలు సోమవారం(సెప్టెంబర్ 15) నుంచి నిరవధిక బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) ప్రకటించింది. సోమవారం నుంచి ఇంజనీరింగ్ సహా ఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ, నర్సింగ్, బి.ఇడి, లాతో పాటు డిగ్రీ, పిజి కళాశాలలు బంద్‌లో పాల్గొంటాయని ఫెడరేషన్ చైర్మన్ రమేష్ వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం జెఎన్‌ఎఎఫ్‌ఎయులో ఫతి ఆధ్వర్యంలో ప్రైవేట్ యాజమాన్యాలు సమావేశమై ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సాధించేకునేందుకు చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఫెడరేషన్ నాయకులు రమేష్, కృష్ణారావు, సునీల్‌కుమార్, రాందాస్, సూర్యనారాయణరెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఇప్పటికే అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో బంద్ పాటించాలని నిర్ణయించామని తెలిపారు. ఈనెల 21వ తేదీలోగా ఇప్పటికే టోకెన్లు విడుదల చేసిన రూ.1400 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మొత్తం బకాయిల్లో అక్టోబర్ 31లోగా 50 శాతం, డిసెంబర్ 31లోగా మిగిలిన శాతం నిధులు విడుదల చేయాలని కోరారు. ఇక నుంచి రెగ్యులర్‌గా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దసరా పండుగకు కూడా తమ సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దీనస్థితిలో ఉన్నామని, దాంతో సిబ్బంది నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : ప్రాణం తీసిన యూరియా
విద్యార్థులు కాలేజీలకు రావొద్దు
మెడిసిన్ మినహా అన్ని ప్రైవేట్ కాలేజీలు బంద్‌లో పాల్గొంటున్న నేసథ్యంలో విద్యార్థులు కళాశాలలకు రావొద్దని ఫెడరేషన్ చైర్మన్ రమేష్ కోరారు. ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో కాలేజీలు నపపలేని అనివార్య తప్పనిసరి పరిస్థితుల్లో కాలేజీల నిరవధిక బంద్‌ను పాటిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు కాలేజీలకు వచ్చి ఇబ్బంది పడవద్దని అన్నారు.
జీతాలు ఇవ్వనందుకు సిబ్బందికి క్షమాపణలు
ప్రైవేట్ కాలేజీల్లో సిబ్బందికి సకాలంలో చెల్లించలేకపోతున్నందుకు ఫెడరేషన్ చైర్మన్ రమేష్ క్షమాపణలు చెప్పారు. ఉద్ధేశపూర్వకంగా తాము వేతనాలు నిలిపివేయలేదని, విధిలేని పరిస్థితుల్లోనే వేతనాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. ప్రైవేట్ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు పేరుకుపోవడం దసరా పండుగను సైతం సంతోషంగా గడుపలేని పరిస్థితిలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు.