Saturday, July 27, 2024

ఆరోపణల దుమారంలో ‘ఆప్’

- Advertisement -
- Advertisement -

ఈ నెల 25న ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ అనేక ఆరోపణల దుమారంలో ఇరుక్కోవడం ఆ పార్టీకి అగ్నిపరీక్షే. ముఖ్యంగా తాజా గా ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతీ మాలీవాల్‌పై కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌కుమార్ దాడి చేయడం, దీనిపై కేజ్రీవాల్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అత్యంత వివాదాలకు దారి తీసింది. కేజ్రీవాల్‌ను ఆయన అధికారిక నివాసంలో కలుసుకోడానికి మే 14న తాను వస్తుంటే ఆయన నివాసంలోనే బిభవ్‌కుమార్ క్రూరంగా దాడి చేశారని పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో చివరకు బిభవ్‌కుమార్‌ను పోలీస్‌లు అరెస్ట్ చేశారు.

ఆమెపై దాడి వల్ల గాయాలయ్యాయని కూడా వైద్య నివేదిక నిర్ధారించడం స్వాతి ఆరోపణలకు బలం చేకూర్చినట్టయింది. దీనిపై దర్యాప్తు ముమ్మరం అయింది.సిట్ ఏర్పాటయింది. సిఎం పేషీ సిబ్బందిని, సెక్యూరిటీ సిబ్బంది నుంచి వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో కేజ్రీవాల్ నివాసం లోని సిసి ఫుటేజీలో రికార్డు కాకపోవడం అనుమానాలకు దారి తీయడంతో ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. బిభవ్‌కుమార్ మొబైల్ ఫోన్ కూడా పని చేయకపోవడంతో కాల్ డేటాను సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. కేజ్రీవాల్ బెయిల్‌పై బయటకు వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ పరిణామాలు జరగడం ఆప్ పార్టీకే కాదు, కూటమి లోని పార్టీలకు కూడా తలనొప్పిగా మారింది. అసలు బిభవ్‌కుమార్ దాడి చేయడానికి కారణాలేమిటి? ఇంతవరకు బయటపడలేదు.

స్వాతీమాలీవాల్ ఆమ్‌ఆద్మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి పార్టీలో ఉన్నారు. అన్నాహజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్‌తో పాటు ఆమె కూడా కీలక పాత్ర వహించారు. ఈ కారణంగానే ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పగ్గాలు చేపట్టిన తరువాత 2015లో ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా స్వాతీమాలీవాల్‌కు కేజ్రీవాల్ పదవిని కట్టబెట్టారు. ఆమె సామర్థానికి గుర్తింపుగా ఈ ఏడాది రాజ్యసభ సభ్యురాలిగా ఆప్ ఎన్నుకొని నియమించింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో స్వాతీ దాదాపు 17 వేల కేసులను పరిష్కరించగలిగినట్టు పేరు పొందినప్పటికీ, నియామకాల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణలను ఆసరా చేసుకుని బిజెపి భయపెట్టడం వల్లనే ఆడిస్తున్న రీతిలో స్వాతి ఆడుతోందని ఆమ్‌ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఏదేమైనా అత్యంత విశ్వసనీయంగా కేజ్రీవాల్‌కు వ్యవహరించిన ఆమె ఒక్కసారి కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎదురు తిరగడం ఊహించరాని పరిణామం.

మే 14న స్వాతిపై బిభవ్‌కుమార్ అమర్యాదగా ప్రవర్తించారని ఆప్‌నేత సంజయ్ సింగ్ బహిరంగంగా ప్రకటించారు. కేజ్రీవాల్ ఈ సంఘటనను గుర్తించారని, కఠినమైన చర్యలు తీసుకుంటారని కూడా సంజయ్ సింగ్ ప్రకటించారు.కానీ బిభవ్‌కుమార్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఎలాంటి చర్య తీసుకోలేదు సరికదా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి తనతోపాటు బిభవ్‌కుమార్‌ను తీసుకెళ్లడం మరింత వివాదమైంది. కేజ్రీవాల్ మౌనం వహించడం, ఆప్‌పార్టీ స్వాతిపై విమర్శలకు దిగడం మరో మలుపు తిరిగింది. బిజెపికి స్వాతి పావుగా మారారని ఆప్ ధ్వజమెత్తుతోంది.

మరోపక్క ఇండియా కూటమిలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా కేజ్రీవాల్ మౌనాన్ని ప్రశ్నిస్తోంది. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే చట్టాల కోసం ప్రచారం సాగించిన కేజ్రీవాల్ ఇప్పుడు మహిళలపై అఘాయిత్యాల పట్ల అదీనూ స్వంత ఎంపి స్వాతీ మాలీవాల్‌పై జరిగిన దాడి పట్ల నిర్లక్షం వహించడం ఏమిటని ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా స్వాతీమాలీవాల్ పక్షాన నిలబడతానని ప్రకటించారు. మీడియా ప్రసారాలు కానీ, రాజకీయ పోరాటాలు కానీ నికార్సయిన వాస్తవాన్ని నిర్ణయించలేవు. నిష్పక్షపాత దర్యాప్తు ఒక్కటే దీనికి పరిష్కారం. ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ స్వాతీమాలీవాల్ విషయంలో సరైన నిర్ణయం ప్రకటించడం అవసరం. తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం, బిజెపియే ఇదంతా చేస్తోందని ఆరోపించడం సరైన సమాధానం కాదు.

దేశంలో రాజకీయాలు క్షీణిస్తున్న తరుణంలో సరైన ప్రతిస్పందనలో భాగంగా ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆదర్శాలు వల్లెవేస్తూ తలెత్తిన పార్టీ ఇప్పుడు అనేక ఆరోపణలను ఎదుర్కొంటోంది. అవినీతి, బంధుప్రీతి నుంచి నిరంకుశత్వం, విషపురుషత్వం వరకు అనేక అవకతవకలతో తమ మిత్రపక్షాలను ఇరుకున పెడుతోంది. ఒక దశాబ్దానికి పైగా మనుగడ సాగిస్తున్నప్పటికీ, ప్రజల పరిశీలన నుండి, లేదా అంతర్గత జవాబుదారీతనం నుండి దూరమైపోతోంది. నిర్ణయాలు తీసుకునే సంస్థాగత వ్యవస్థ ఇంకా రూపుదిద్దుకోలేదు. తరచుగా మధ్యవర్తిత్వ చర్యలను ఆశ్రయిస్తోంది. ఇప్పుడు మాలీవాల్ కేసు దర్యాప్తు ఫలితంతో సంబంధం లేకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను వినియోగించే బిజెపి ధోరణికి భిన్నంగా, ఆమ్‌ఆద్మీ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవడం తక్షణ కర్తవ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News