కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు దాడిచేసి 26 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటనలో పొరుగు దేశానికి మరోసారి గట్టిగా బుద్ధి చెప్పడానికి భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి రెండు వారాలు పట్టింది. నిజమే, ఇటువంటి ప్రధానమైన నిర్ణయం, దాదాపుగా పొరుగుదేశం మీద యుద్ధం చేస్తున్నంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి అంత సమయం పట్టడంలో ఆశ్చర్యం లేదు. అసలు ఆ విషాదం నుంచి దేశం తేరుకోవడానికే వారం రోజులు పట్టి ఉంటుంది. ఇప్పటికీ ఇంకా ఈ దేశప్రజల కళ్ళల్లో ఆ దృశ్యాలు మెదులుతూనే ఉంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకున్నదే తప్ప మన భారతదేశ మీడియాకు మాత్రం అంత ఓపిక లేదు. సంఘటన జరిగిన మరునాటి నుండే మన మీడియా.. ముఖ్యంగా 24 గంటల వార్తా ప్రసారాలు చేసే న్యూస్ ఛానళ్లు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించేసాయి. ‘ఇంకా ఆలస్యం దేనికి? యుద్ధం మొదలు పెట్టండి’ అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని గదమాయిస్తున్న, సలహాలిస్తున్న ప్రసారాలు అనేకం మనకి ఈ పక్షం రోజుల్లో కనిపించాయి, వినిపించాయి.’
ఎటువంటి నియంత్రణలకు అవకాశం లేని మాధ్యమాల పేరిట చలామణి అవుతున్న సామాజిక వేదికల బాధ్యతరాహిత్యం గురించి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వచ్చి పెద్దయెత్తున చర్చ జరుగుతున్న సమయంలో, ఎంతో కొంత నియంత్రణకు లోబడి పని చేస్తాయి అనుకుంటున్న, ప్రధాన స్రవంతి మీడియాగా చెప్పుకుంటున్న 24 గంటల వార్తా ప్రసారాలు సాగించే ఛానళ్ళ నిర్వాకం ఈ పక్షం రోజుల్లో చూసినవాళ్ళు, ఆ హింసను అనుభవించిన వాళ్ళు వీటిని నియంత్రించడం ఎలా అనే ఆలోచనలో పడ్డారు.వార్తాపత్రికలు తమ సర్కులేషన్లను, వార్తాప్రసార మాధ్యమాలు తమ టీఆర్పీలను (వీక్షకుల సంఖ్య) పెంచుకోవడానికి సంచలనాలకోసం పాకులాడటం కొత్త విషయం ఏమీ కాకపోయినా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వాటి ఈ వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు గురవుతున్నది. కొంతలో కొంత ప్రింట్ మీడియా సంయమనం పాటిస్తున్నప్పటికీ, 24 గంటల న్యూస్ ఛానళ్ళు మాత్రం రెచ్చిపోయి తమకు తోచిన విధంగా అసత్యాలు, అర్థసత్యాలు, అభూతకల్పనలను దేశ ప్రజల చెవులు చిల్లులు పడేట్టు అరిచి చెప్తున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ జరుగుతున్న క్రమంలో ఒక మీడియా హౌస్ సంపాదకవర్గ సమావేశంలో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బ్రీఫింగుకు సంబంధించిన వార్తలు మాత్రమే ప్రచురించాలన్న ప్రతిపాదన చర్చకు వచ్చినప్పుడు..
అలా అయితే పేజీలు నింపడం ఎలా? అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయట. 24 గంటలలో ఒకసారి మాత్రమే ఉదయంపూట పాఠకుల చేతికి అందే దినపత్రికల పరిస్థితే ఇలా ఉంటే ప్రసార మాధ్యమాలు 24 గంటలు ఏం చూపించాలి, ఏం మాట్లాడాలి? అందుకే ఒకరు ఇస్లామాబాద్ పని అయిపోయిందంటే, మరొకరు లాహోర్ మట్టి కొట్టుకుపోయిందని, ఇంకొకరు కరాచీ కనిపించకుండాపోయిందని మసాలాలు దట్టించి వార్తలు ప్రసారం చేయడం మనం ‘ఆపరేషన్ సిందూర్’ మొదలయినప్పటినుండి చూస్తున్నాం. పాకిస్తాన్ పని అయిపోయిందని ఒక ప్రముఖ పాత్రికేయుడు వ్యాఖ్యానిస్తే, ఆ దేశ ప్రధానమంత్రి ఇల్లు వదిలి పారిపోయాడని మరొక వార్త ఛానల్ చెబుతుంది. లేదు, ఆ దేశంలోని ప్రముఖులంతా బహరిన్‌కు తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోయారని ఇంకొక ఛానల్ చెప్తుంది. అసలు జరుగుతున్నది ఏమిటి? ఈ దేశ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత.. అందులోనూ వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత తన మీద ఉందన్న విషయం మీడియా మరిచిపోయింది. దానికి కారణం.. అసలు ఏం జరుగుతుందో పూర్తిగా తెలియకపోవడం, తెలుసుకునే ప్రయత్నం చెయ్యకపోవడం. సీనియర్ పాత్రికేయురాలు కల్పనాశర్మ ఒకచోట రాసినట్టు భారతదేశాన్ని తీవ్రమైన టెర్రరిజం అనే మబ్బులు కమ్మేసి ఏం జరుగుతుందో కనిపించని, ఏ శబ్దాలు వినిపించని వేళ మన మీడియా పుంఖానుపుంఖాలుగా కథనాల్ని వండి వార్చేస్తున్నది.
నిజానికి ఏం జరుగుతున్నది? పహల్గాం మారణకాండ అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్‌లోని తొమ్మిది టెర్రరిస్ట్ కేంద్రాలను టార్గెట్‌గా చేసుకొని చేసిన దాడి, ఆ దాడిలో 100 మంది వరకు మృతి చెందిన విషయం, దానికి జవాబుగా భారత భూభాగంపైకి పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లను మట్టికరిపించే పనిలో భారత సైనిక బలగాలు పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించి గత మూడు రోజులుగా సైన్యానికి సంబంధించిన ఉన్నతాధికారులు అధికారికంగా పత్రికా సమావేశాలు నిర్వహించి వివరాలు వెల్లడిస్తూనే ఉన్నారు. అది మాత్రమే రాసి ఊరుకుంటే 24 గంటలు న్యూస్ ఛానల్ నడపడం ఎలా? వీక్షకుణ్ని మరో ఛానల్ వైపు వెళ్లకుండా ఆపడం ఎలా? ఇదీ ఇవాళ మెజారిటీ న్యూస్ ఛానల్ పరిస్థితి దేశంలో. ప్రభుత్వం వెల్లడించిన సమాచారాన్ని మాత్రమే ప్రజలకు తెలిపి ఊరుకుంటే అది మీడియా బాధ్యతా ఎలా అవుతుందని ఆ మాధ్యమాల వాళ్లు ప్రశ్నించవచ్చు. నిజమే.. మామూలు పరిస్థితుల్లో అయితే ప్రభుత్వం అందించే సమాచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుని అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజెయ్యాల్సిన బాధ్యత మీడియాది. ఆ పని మీడియా చేస్తున్నట్టు కనిపించదు. ఇటువంటి యుద్ధ వాతావరణం ఉన్న సమయలో ఆ అవకాశాలు కూడా తక్కువే ఉంటాయి. అందుకని మనం చేస్తున్నదేమిటి.. చర్చల పేరిట గాలి పోగు చేసి వీక్షకుల మీదకు వదులుతున్నాం.
ఇందులో కొన్ని మినహాయింపులు లేవని చెప్పలేం, అయితే అవి చాలా స్వల్పం. కేంద్రప్రభుత్వం కూడా ఈ మెజారిటీ న్యూస్ ఛానళ్ళు రోజుల తరబడి ప్రసారం చేసే అసత్యాలు, అర్థసత్యాలు, అభూతకల్పనల జోలికి వెళ్లడం లేదు. నిపుణుల పేరుతో గంటల తరబడి తెలిసీ తెలియని విషయాలు చర్చించేవాళ్ళని కూడా ఎవరూ తప్పు పట్టడం కానీ, సరి చెయ్యడం కానీ జరగడం లేదు. చరిత్ర తీవ్ర వక్రీకరణలకు గురికావడానికి రేపు ఈ మాధ్యమాలవారు బాధ్యులు కాక తప్పదు.
విశ్వసనీయత చెడకుండా వీలైనంతవరకు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని వాస్తవాలను మాత్రమే ప్రజలకు అందించాలనే ఆలోచన కలిగిన, ఆ మార్గాన్నే నడుస్తున్న కొన్ని ఛానళ్లు లేదా కొన్ని డిజిటల్ వేదికలు సహజంగానే వెనుకబడిపోతున్నాయి. ఇలా యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న ఛానళ్ళను వదిలేసి విచిత్రంగా ‘ది వైర్’ వంటి డిజిటల్ ఛానల్‌ను ఆ ఛానల్ యాజమాన్యానికి సమాచారం లేకుండా 2000 సంవత్సరం ఐటీ చట్టం కింద బ్లాక్ చేసినట్టు సర్వీస్ ప్రొవైడర్ ద్వారా తెలియజేయడం,
ఏ కారణం చేతనో ఒక రోజు తర్వాత మళ్లీ దాన్ని పునరుద్ధరించడం చూసాం. సమాచారం తెలుసుకునేందుకు భారత రాజ్యాంగం ఈ దేశప్రజలకు ఇచ్చిన హక్కును కాపాడే బాధ్యతను మాత్రమే నిర్వర్తించాల్సిన మీడియా ఆ పని మాత్రం మరిచిపోయి ఆశ్శరభ శరభ అంటూ శివాలెత్తిపోతున్న వేళ వాటిమీద ఏ చర్యా లేకుండా వదిలేసి, సత్యాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని ప్రసారం చేసే, ప్రచురించే ఇటువంటి మాధ్యమాలకు ఆటంకాలు సృష్టించడం పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగించడమే అనడంలో సందేహం లేదు. భారతదేశం మీద పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలు ఇవాళ కొత్తగా జరుగుతున్నవేమీ కాదు. దానికి దీటుగా సమాధానం చెప్పేందుకు భారతదేశం వైపు నుంచి కూడా చర్యలు జరగడం ఇవాళ కొత్త ఏమీ కాదు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కనీసం మూడు సందర్భాలలో ‘ఆపరేషన్ సిందూర్’ వంటి భారీ జవాబులు భారతదేశం ఇచ్చింది. మన మీడియా, పొరుగుదేశ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న దానిని యుద్ధం అంటున్నాయి కానీ భారత ప్రభుత్వం దీన్ని యుద్ధం అని అనకపోవడం గమనార్హం.మొత్తానికి తాత్కాలికంగానయినా ఇది రాయడం పూర్తవుతున్న సమయాన ఇరు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకారం ప్రకటించాయి. అయితే భవిష్యత్తులో భారతదేశంలో జరిగే ఏ ఉగ్రదాడినయినా యుద్ధంగానే పరిగణిస్తామని భారత్ ప్రకటించింది. మన మీడియా ఇప్పుడేం చేస్తుంది? ఇవాళ్టి నుండి ఒక కొత్త యుద్ధాన్ని వెతుక్కోవాలేమో.