బీబీనగర్ మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ ఉమ్మడి నల్లగొండ డిఎస్పి జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఉదయం 11 గంటల సమయంలో కార్యాలయ గేట్ మూసివేసి దాడులు ప్రారంభించిన అధికారులు సాయంత్రం వరకు సోదాలు కొనసాగించారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ నల్లగొండ డీస్పీ జగదీష్ చంద్ర విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజుల క్రితం బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అవినీతి జరుగుతుందని తమకు ఫిర్యాదు అందిందని ఆ మేరకు గురువారం ఆకస్మికంగా దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సోదాల సమయంలో రిజిస్ట్రేషన్ చేయడం కోసం 12 మంది డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు ఆఫీసులో ఉన్నట్లు తెలిపారు.
కార్యాలయ నిబంధనల ప్రకారం డాక్యుమెంట్ రైటర్‌లు, ఏజెంట్స్ కార్యాలయంలోకి రావద్దని నిబంధనలకు విరుద్ధంగా ఏజెంట్లు దగ్గరుండి రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నట్లు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. 93 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ యజమానులకు ఇవ్వకుండా సబ్ రిజిస్ట్టార్ కార్యాలయంలోనే పెట్టుకున్నట్లు గుర్తించామన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ. 61,400 లెక్కతేలని నగదు దొరికిందని నగదుపై సరైన సమాధానం ఇవ్వకపోవడంతో సదరు డబ్బులను సీజ్ చేసినట్లు తెలిపారు. సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో రికార్డులు సరిగా నిర్వహించట్లేదని సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదని వెల్లడించారు. కార్యాలయం నిర్వహణ గురించి సబ్ రిజిస్ట్ట్రార్ తాటికొండ నరేష్‌ను ప్రశ్నించామని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాన్ని అంతా ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు డీస్పీ జగదీష్ చంద్ర తెలిపారు.