Tuesday, April 30, 2024

అదానీ చట్టానికి అతీతుడా?

- Advertisement -
- Advertisement -

అదానీ బొగ్గు కుంభకోణం విషయం పైన ఒక ప్రఖ్యాత బ్రిటన్ పత్రిక ‘ఫైనాన్స్ టైమ్స్’ ప్రచురించిన కథనం చూస్తుంటే మన దేశంలోని ఏళ్ళ తరబడి చారిత్రిక ఘనత కలిగిన ప్రింట్ మీడియా మౌనం ఎందుకు దాల్చింది? ప్రపంచంలో చీమ చిటుక్కుమంటే పసిగట్టే ఎలక్ట్రానిక్ మీడియా విశ్రాంతి తీసుకుందా? దేశంలో లెక్కకు మించిన వివిధ భాషా టివి చానెళ్ళు ఏం చేస్తున్నాయి? కండ్ల ముందు ప్రత్యక్షంగా ఇంత బాహాటంగా కనిపిస్తున్నా ఆర్ధిక నేరాలను చూసీచూడనట్లు ఉమ్మడిగా, కూడబలుక్కొన్నట్లు ఉదాసీనత నటిస్తున్నాయా? ప్రధాన మంత్రి మోడీకి అత్యంత సన్నిహిత మిత్రు డు గనుక మనకెందుకులే పేచీ అని మిన్నకున్నాయా? బాధ్యత మరిచాయా? ఇంత పెద్ద ఆర్ధిక నేరాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇదే విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బహిరంగంగా ప్రజా సమూహం ముందు ప్రశ్నిస్తున్నాడు. దానికి ఎవరు సమాధానం చెబుతారు? యుపిఎ పరిపాలనా కాలంలో ఉన్న దానికీ లేని దానికీ కోడి గుడ్డుపై ఈకలు పీకే ఈ మీడియా ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా స్తంభించి పోయింది? గతంలో ప్రతి దానికి ఇదిగో కుంభకోణం, అదిగో కుంభకోణం అంటూ రాద్ధాంతం చేసిన ఈ మీడియా కలాలకు పక్షవాతం వచ్చిపడిందా?

నరేంద్ర మోడీ పరిపాలనలో కొనసాగుతున్న లక్షల, కోట్ల అవినీతి దందా పై ఎందుకు నోరు మెదపటం లేదు? ఎందుకు కలాలకు సంకెళ్ళను తమకు తామే స్వచ్ఛందంగా వేసుకున్నారు? మీ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ రహస్యం ఏమిటో ఎవరికీ అంతుపట్టడడం లేదు.మీడియా సంగతి అలా వుంచితే మన ఇడి, ఐటి, రా, సిబిఐ మొదలైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన, కాకలుతీరిన దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి? ‘ఊ’ అంటే విపక్ష నేతల ఇళ్ళపై, ఆఫీసులపై, వ్యాపార సంస్థలపై ఆగమేఘాలపై పరుగెత్తి వందల సంఖ్యలో జట్లు జట్లుగా విడిపోయి గంటల తరబడి సోదాలు నిర్వహించే ఈ సంస్థలకు కూడా సెలవులు ప్రకటించారా? లేక దర్యాప్తులు అధికార పక్షం వాళ్ళ విషయంలో చురుకుగా పని చేయవా? బాంబే స్టాక్‌ఎక్సేంజ్, సెబి, ఆర్‌బిఐ మొదలైన సంస్థలు మార్కెట్ ట్రేడింగ్‌లు అధ్యయనం చేయటం మానుకొన్నాయా? అసలు ఈ సంస్థల ఉనికి ఉన్నపళంగా ఏమైంది? అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. అదానీ షల్ కంపెనీలు బాహాటంగా బోర విరుచుకుని తప్పు మీద తప్పు పదే పదే ఆర్థిక నేరాలు చేస్తుంటే ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే ఈ సంస్థలన్నీ ఏం ఉద్ధరిస్తున్నాయి? ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన శక్తి ఉన్న పత్రికా కథనాలు ఇప్పుడు మీడియా దృష్టికి ఎందుకు రావటం లేదు? అదానీ సంస్థలు దిగుమతి చేసుకుంటున్న

బొగ్గు విలువలను అధికంగా చూపి ఇక్కడ వినియోగదారులను దోచుకుంటున్న వ్యవహారాన్ని మీడియా సంస్థలు అలక్ష్యం చేస్తే చేయవచ్చు గాక, మరి కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్ధిక అవకతవకలను ఎలా సహిస్తుంది? కస్టమ్స్ రికార్డ్‌లతో సహా అనేక డాక్యుమెంట్లను క్షుణ్ణంగా, లోతుగా పరిశీలించి ఫైనాన్షియల్ టైమ్స్ ఎంతో సాధికారికంగా ఈ కథనాన్ని ప్రచురించింది. తైవాన్, ఇండోనేషియా, దుబాయ్, సింగపూర్ దేశాలలోని కొన్ని డొల్ల కంపెనీల ద్వారా ఇండోనేషియా నుంచి ఎంతో కారుచౌకగా బొగ్గును కొనుగోలు చేసిన అదానీ గ్రూప్ దాని ధరలను అనేక రెట్లు అధికంగా చూపి ఇక్కడే మన దేశంలో విద్యుత్ సంస్థలను ఎలా మోసగించిందో ఆ కథనాన్ని వివరంగా పూసగుచ్చినట్లు వివరించింది. రెండేళ్ల కాలంలో 30 షిప్‌మెంట్లకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లో జరిగిన మోసాలను తాను నేరుగా కాకుండా మధ్యవర్తి కంపెనీల నుంచి కొన్నట్టుగా సృష్టించిన తప్పుడు రికార్డులను ఈ పత్రిక ప్రజల ముందు నగ్నంగా నిలుచోబెట్టింది. ఈ విధంగా దిగుమతి ధరలను హెచ్చించి చూపిన బొగ్గుతో తన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ధరలను పెంచి డిస్కములను అదానీ గ్రూపు మోసగిస్తున్నది.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు లోబడి వివిధ రాష్ట్రాల డిస్కంలు అదానీ విద్యుత్తును ఇలా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు రావడంతో భారతీయులు వేల కోట్ల ధనం అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. మార్కెట్ ధర కంటే ఇది చాలా అధికమని ఫైనాన్షియల్ టైమ్స్ అన్ని ఆధారాలను చూపెడుతూ చక్కని విశ్లేషణ చేసింది. గతంలో హిండెన్ బర్గ్ నివేదిక ప్రకారం షల్ కంపెనీల ద్వారా రూ. 20 వేల కోట్లు దోచుకున్న అదానీ గ్రూపు, బొగ్గు దిగుమతుల్లోనూ అదే తరహా మోసాలతో మొత్తం రూ. 32,000 కోట్లను దోచుకుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లెక్కలు చెబుతున్నారు. నేను మోడీకి సహాయపడుతున్నాను. అదానీ గ్రూపు వ్యవహారాల మీద ఆయన ఎందుకు దర్యాప్తు చేయించడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధాన మంత్రి ఆశీస్సులు రక్షణ లేకుండా అదానీ ఇన్ని అక్రమాలకు పాల్పడే అవకాశం లేదని కూడా రాహుల్ గాంధీ తనకు తానే సమాధానం కూడా చెప్పుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయించనున్నట్లు రాహుల్ గాంధీ హామీని కూడా ఇస్తున్నారు.

దర్యాప్తు సంస్థలకు కనిపించకుండా పోయిన డాక్యుమెంట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పత్రికకు ఎలా దొరికాయి? అన్న రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలలోనే సమాధానం కూడా దాగిఉంది. వివిధ డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించిన నిధులతోనే అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను నిలబెట్టుకొంటూ వస్తున్నదని ఈ ఏడాది జనవరిలో హిండెన్ బర్గ్ నివేదిక ఆరోపించిన విషయం తెలిసిందే. మొన్న మార్చిలో అంతర్జాతీయ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఒసిసిఆర్‌పి సాగించిన ఇన్వెస్టిగేషన్ లోనూ ఇదే విషయం బయటపడింది. అరబ్ ఎమిరేట్స్, తైవాన్ నుంచి అదానీ కంపెనీలోకి ప్రవహిస్తున్న నిధులు ఏయే డొల్ల కంపెనీలవో ఆ పెట్టుబడిదారులకు గౌతమ అదానీ సోదరుడు వినోద్ అదానీతో ఉన్న సంబంధం ఏమిటో అది బయటపెట్టింది. ఇటువంటివి బయటపడుతున్నప్పుడు బిజెపి నేతలుదానిని విదేశీ కుట్రగా అభివర్ణించడం కూడా మామూలే. బిజెపి రేపు ప్రజల ముందు ఏం మాట్లాడబోతుందో ప్రజలు గత 9 సంవత్సరాల అనుభవంతో ఇట్టే పసికట్టి ముందే చెబుతున్నారు.

చివరికి సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సెబీ చేపట్టిన దర్యాప్తు కూడా నత్తనడకన నడుస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దర్యాప్తులో తనకు ఎదురవుతున్న ఆటంకాలను సెబీ ఎప్పటికప్పుడు కోర్టుకు తెలుపుతూ ఉండడం సమస్యను వీలైనంత వరకు వాయి దా వేయించడానికే అని అర్ధమవుతుంది. సెబీ వంటి ఒక శక్తివంతమైన సంస్థ నిజంగానే అదానీ గ్రూప్ అక్రమాలను వెలికితీసే విషయంలో శ్రద్ధగా ఉందా? అన్న సంశయం ప్రజలకు వస్తుంది. ఇలాంటి ధర్మ సందేహాలు ప్రజలకు ఎందుకు వస్తున్నాయంటే సంస్థలను మేనేజ్ చేయడం కార్పొరేట్ రంగాలకు వెన్నతో పెట్టిన విద్య కదా! అందుకు. దర్యాప్తులో జాప్యం మాటిమాటికీ వాయిదాలు పడుతూ ఉండటాన్ని గమనిస్తే సెబీ మీద ప్రజలకు, విపక్షాలకు అనుమానాలు కలుగుతున్నాయి. సెబీ నిజాన్ని నిగ్గు తేల్చకుండా, సమాచారాన్ని దాచిపెట్టేందుకు, కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలతో పలు వైపులనుండి విమర్శలూ వస్తున్నాయి. సెబీ తన దర్యాప్తును నిజాయితీగా, సత్వరంగా ముగించని పక్షంలో కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరుతుంది అనడంలో సందేహం లేదు. ప్రజల్లో సెబీ పైనా, పత్రికల నిష్పాక్షికత పైనా, దర్యాప్తు సంస్థల పైనా నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఆయా సంస్థల నిజాయితీ పైనే ఆధారపడి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News