Wednesday, December 4, 2024

తప్పు అదానీదంటే కేంద్రానికి ఉలుకు!

- Advertisement -
- Advertisement -

గౌతమ్ అదానీ నేడు ప్రపంచంలోనే సంపన్నులలో ఒకరు. భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యాపార లావాదేవీలపై వస్తున్న ఆరోపణలు తమపై చేస్తున్న ఆరోపణలుగా భారత ప్రభుత్వం భావిస్తున్న ధోరణి కనిపించడం చాలా ప్రమాదకరం. గౌతమ్ అదానీపై ఆరోపణలు చేయడం అంటే ప్రధాని నరేంద్ర మోడీపై చేస్తున్న ఆరోపణలుగా కేంద్రంలోని అధికార పక్షం భావిస్తూ ఉండటం దురదృష్టకరం. అందుకనే ఈ ఆరోపణలపై చర్చ జరగాలని, కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు కోరితే ప్రభుత్వంపై దాడిగా పరిగణిస్తున్నారు. అందుకోసం పార్లమెంట్ సమావేశాలను సైతం జరగనీయకుండా అధికార పక్షమే వాయిదాలు వేస్తుండటం విచిత్రంగా కనిపిస్తుంటుంది. భారతదేశంలోని అనేక మంది పారిశ్రామికవేత్తలలో అదానీ ఒకరు.

ఇతరులపై ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం అంత సున్నితంగా స్పందించిన దాఖలాలు లేవు. అమెరికాలో ఆయన వ్యాపార లావాదేవీలపై సంవత్సరంన్నరకు పైగా దర్యాప్తు జరుగుతున్నది. చివరకు అమెరికా కోర్టు సైతం సమన్లు జారీ చేసింది. అయినా, భారత ప్రభుత్వం గాని, దేశంలోని దర్యాప్తు సంస్థలు గాని ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమైన అంశం. పైగా, అమెరికాలో దర్యాప్తు జరపడం అమెరికా అధ్యక్షుడు కాబోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు మన ప్రధానికి సన్నిహితుడు కావడంతో, ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ కక్షగట్టి ఇటువంటి దుశ్చర్యకు పాల్పడినట్లుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా ఓ పారిశ్రామికవేత్తతో మన ప్రధాన మంత్రి గుర్తింపు పొందటం దేశప్రతిష్ఠకే అవమానకరమని గుర్తించాలి. అదానీపై వస్తున్న ఆరోపణలను విదేశీ పెట్టుబడిదారులు భారత ప్రభుత్వంపై ఆరోపణలుగా పరిగణిస్తే మనదేశంలో పెట్టుబడులకు వెనకడుగు వేసే ప్రమాదముంది. అమెరికాలో తనకంటూ విశేషమైన పలుకుబడి అదానీకి ఉంది. అత్యంత ఖరీదైన న్యాయవాదులను నియమించుకొని తన కేసు వాదించుకోగలరు. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పైగా, ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే అదానీపై కేసును ఉపసంహరించుకుంటారనే ప్రచారాన్ని తాజాగా ప్రారంభించారు.

అమెరికా ప్రభుత్వంలో, కీలక వ్యవస్థలలో కార్పొరేట్లు ఆధిపత్యం వహిస్తూ ఉండటం యదార్ధమే. అయితే అక్కడి చట్టబద్ధ పాలన విచిత్రమైనది. అంత సులభంగా రాజకీయ నిర్ణయం తీసుకోలేరు. పైగా, ట్రంప్ పక్కా వ్యాపారి. ఈ కేసు తొలగించాలంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ముందుగా, భారత దేశంలో సౌర విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించారని చెబుతున్న ముడుపులకు రెట్టింపుగా తనకు ప్రయోజనం కలిగించమని పట్టుబట్టే అవకాశం ఉంది. మరోవంక, భారత ప్రభుత్వం దౌత్యపరంగా కోరితే గాని ఈ కేసు విషయంలో ట్రంప్ జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. అందుకోసం భారత ప్రభుత్వం సైతం భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. అమెరికా ఆయుధాలను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయమని అడిగే అవకాశం లేకపోలేదు. లేదా ఇతరత్రా భారత దౌత్యవిధానాలను మార్చుకోమని స్పష్టం చేసే అవకాశం ఉంది.

అందుకనే ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, తన ప్రతిష్టకు సంబంధించిన అంశంగా భావించడం, తమపై రాజకీయ దాడిగా పరిగణించడం దేశ దీర్ఘకాల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని గ్రహించాలి. ఇప్పటికే అమెరికాతో అనేక దౌత్యపరమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాము. చైనాతో నాలుగేళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభన ఇటీవల ఒప్పందంతో తొలగిపోయింది సంబరం చేసుకుంటున్నాం. కానీ ఆ ఒప్పందం ఏమిటో రెండు దేశాలు అధికారికంగా ప్రకటించనే లేదు. ఎటువంటి వివాదం లేని 4,000 కిమీకు పైగా భూభాగాన్ని లడఖ్ ప్రాంతంలో ఇటీవల కాలంలో చైనా ఆక్రమించిందని మాజీ కేంద్ర మంత్రి డా. సుబ్రమణియన్ స్వామి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై భారత ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయడానికి సైతం వెనుకాడుతున్నది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగితే ‘దేశ భద్రత’ దృష్ట్యా అంటూ సమాధానం దాటేస్తున్నారు.

కేవలం ఈ ఒప్పందంతో సరిహద్దులో తమ సేనలను రెండు దేశాలు వెనుకకు జరుపుకోవడం మినహా చైనా ఆక్రమించిన వివాదం కాని ప్రదేశాలు ఎక్కడి నుండి ఒక్క అంగుళం కూడా కదిలిన దాఖలాలు లేవు. మోడీ బలం చూసి చైనా భయపడి ఒప్పందానికి వచ్చినట్లు మనం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొంటున్నాము. కానీ చైనా అధికారిక మీడియాలో తమ దేశం ముందు భారత్ లొంగుబాటు ప్రదర్శించిందని రాసుకుంటున్నారు. ఎవరిది నిజం? ఎందుకని రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం విషయంలో కుదిరిన ఒప్పందాన్ని కనీసం పార్లమెంట్ ముందైనా పెట్టొచ్చు గదా?
మరోవంక, బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణమైన దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే భారత్ ఒక విధంగా ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుంది. దౌత్యపరంగా ఈ విషయమై అంతర్జాతీయ వేదికలపై ఆ దేశ నాయకత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేకపోతున్నాము.

కనీసం డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడినంత ఘాటుగా మాట్లాడలేకపోతున్నాం. అక్కడ హిందువులకు రక్షణ కల్పించే విషయంలో భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని పలు హిందూ సంస్థలు సైతం కోరుతున్నాయి. మరోవంక, అదానీ వివాదం మనదేశం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా పట్ల సందేహాలను వ్యక్తం చేస్తున్నది. కార్పొరేట్ సంస్థలు ఉత్పత్తి చేసే సౌర విద్యుత్‌కు ఉత్పాదన ఖర్చులు, సరఫరా ఖర్చులు విపరీతంగా ఉంటూ ఉండడంతో రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఆ విద్యుత్ కొనుగోలుకు సుముఖంగా ఉండటం లేదు. అందుకనే వారిపై ఒత్తిడి తెచ్చి, ముడుపులు చెల్లించి బలవంతంగా కొనుగోలు చేయించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడవుతుంది. ఈ ప్రక్రియలో సెకి ద్వారా కేంద్ర ప్రభుత్వం దళారి పాత్ర వహిస్తున్నది. వాస్తవంగా మొత్తం ప్రపంచంలో భారీ స్థాయిలో సౌర విద్యుత్ ఎక్కడా లాభదాయకంగా ఉండటం లేదు. కేవలం ఇళ్లల్లో, పరిశ్రమల్లో స్థానికంగా ఉత్పత్తి చేసుకొనే విధంగా ప్రోత్సహించడం ద్వారానే సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందింపగలం. అందుకు అనేక విజయవంతమైన నమూనాలు నేడు ప్రపంచం ముందున్నాయి. అటువంటి నమూనాలను పట్టించుకోకుండా అదానీ వంటి పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉత్పత్తి చేపడితే ప్రజలపై మోయలేని భారం మోపినట్లు కాగలదు.

పైగా, ఈ ఒప్పందాలు 20 నుండి 25 ఏళ్ళ వ్యవధి మేరకు ఉండటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే సాంకేతికంగా అత్యంత వేగంగా మార్పులు వస్తున్నాయి. ఈ మధ్యలో సౌర విద్యుత్ ఉత్పాదనలో పెను మార్పులు వచ్చి, చాలా చౌకగా ఉత్పత్తి చేసే అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి అవకాశాలకు సమాధి చేసే విధంగా ఈ ఒప్పందాలు ఉంటున్నాయి. ఇటువంటి ప్రమాదకర విధానాన్ని కొంతకాలం క్రితం థర్మల్ విద్యుత్‌లో సైతం అనుసరించారు. అదానీ వంటి కంపెనీలకు ఆస్ట్రేలియా నుండి పెద్ద ఎత్తున బొగ్గు దిగుమతి చేసుకునేందుకు అనుమతులు ఇచ్చి, వారి బొగ్గుకు మన దేశంలో డిమాండ్ కలిగించడం కోసం కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని కోల్ ఇండియా ద్వారా జరుగుతున్న బొగ్గు ఉత్పత్తిలో కృత్రిమ కొరతను సృష్టించారు. విదేశీ బొగ్గును నిర్దేశిత శాతం మేరకు, అత్యధిక ధరలకు ప్రతి రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పాదన సంస్థలు కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ‘చట్ట వ్యతిరేక’ నిబంధనలు పెట్టింది.

మన దేశంలో చౌకగా లభిస్తున్న బొగ్గు ఉత్పత్తిని తగ్గించివేసి, విదేశాల నుండి అత్యధిక ధరకు దిగుమతి చేసుకున్న బొగ్గు కొనాలని పట్టుబట్టడం ద్వారా విద్యుత్ వినియోగదారులపై పెనుభారం మోపారు. ఇప్పుడు సౌర విద్యుత్ విషయంలో సైతం అటువంటి విధానమే అనుసరిస్తున్నారు. అదానీ చేబడుతున్న వ్యాపారాలపై కేవలం అమెరికాలోనే కాకుండా కెన్యాలో ప్రజల నుండి ఒత్తిడి చెలరేగడంతో అక్కడి ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకొంటున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. ఫ్రాన్స్‌లో ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థ అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టలేమని ప్రకటించింది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో సైతం వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే, ఈ వివాదాలు అన్ని భారత ప్రభుత్వం సొంతం చేసుకోవడం, తన దౌత్యపరపతిని వాటి పరిష్కారం కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేయడం దేశప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది. ఆయా వివాదాలను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత అదానీది మాత్రమే అని గ్రహించాలి. ఆర్థికపరమైన అక్రమాలు, అవినీతి ఆరోపణలకు ప్రభుత్వం దూరంగా ఉండాలి. లేని పక్షంలో మన దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News