Saturday, September 21, 2024

బిజెపిని ఢీకొనేందుకే కాంగ్రెస్‌తో ఒప్పందం: ఫరూఖ్ అబ్దుల్లా

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : సంఘటిత కూటమిగా బిజెపిని ఢీకొని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్షంగా కాంగ్రెస్‌తో సీట్ల పంపకం ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) నేతలు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా మంగళవారం వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ కూటమి ప్రయత్నిస్తుందని వారు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సి, కాంగ్రెస్ వరుసగా 51, 32 సీట్లకు పోటీ చేయడానికి అంగీకరించిన మరునాడు ఎన్‌సి అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఒక సంకీర్ణంలో భాగస్వామ్య పక్షాలు పరస్పరం సర్దుబాటు చేసుకోవలసి ఉంటుందని అన్నారు. ‘ఒక సంకీర్ణంలో ఎవరైనా పలు విషయాలు భరించవలసి వస్తుంది. కొన్ని (సీట్లు) రాబట్టేందుకు కొన్ని (సీట్లను) వదులుకోవలసి ఉంటుంది. సంకీర్ణం తీసుకున్న తుది నిర్ణయం ఎంతో మంచిది.

భగవంతుడు కరుణిస్తే, సంకీర్ణం గెలిచి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే యత్నం చేస్తుంది’ అని ఫరూఖ్ పుల్వామా జిల్లా అవంతిపొరా ప్రాంతంలో విలేకరులతో చెప్పారు. ‘మా లక్ష్యాలు మంచివైతే మేము విజయం సాధిస్తాం’ అని ఆయన అన్నారు. నామినేషన్ పత్రాల దాఖలుకు వెళుతున్న లోక్‌సభ మాజీ సభ్యుడు, పాంపోర్ సీటుకు ఎన్‌సి అభ్యర్థి జస్టిస్ (రిటైర్డ్) హస్నైన్ మసూది వెంట ఫరూఖ్ అబ్దుల్లా ఉన్నారు. ఒమర్ అబ్దుల్లా అనంతనాగ్ జిల్లా బిజ్‌బెహరాలో విలేకరులతో మాట్లాడుతూ, ‘కాంగ్రెస్‌తో సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. బిజెపి, దానికి మద్దతు ఇస్తున్న పార్టీలపై సంఘటిత కూటమి ఏర్పాటు చేసి, ఎన్నికల్లో పోటీ చేసి, విజయావకాశాలను మరింత పెంచుకునేందుకే ఈ యత్నం’ అని చెప్పారు. సీట్ల పంపకం ఒప్పందం గురించి ఒమర్ ప్రస్తావిస్తూ, గత 5 నుంచి 10 సంవత్సరాలుగా కష్టించి పని చేసిన, ఎన్నికల్లో పోటీ చేయాలని అభిలషించిన నేతలు కొందరికి అభ్యర్థిత్వం దక్కలేదన్నది తనకు తెలుసు అని చెప్పారు.

‘మా మిత్రులు అనేక మంది 510 సంవత్సరాలుగా బాగా శ్రమించారని, ఎన్‌సి టిక్కెట్లపై పోటీ చేయాలని ఆకాంక్షించారని గ్రహించాను. కానీ, దురదృష్టవశాత్తు ఈ సీట్ల పంపిణీలో వారిలో కొందరిని తప్పించవలసి వచ్చింది. అందుకు విచారిస్తున్నాం. మున్ముందు వారికి అవకాశం కల్పించాలని అనుకుంటున్నాం. సంస్థకే కాకుండా ప్రజలకు కూడా సేవ చేసే అవకాశం వారికి లభించాలి’ అని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. నామినేషన్ పత్రాలు దాఖలుకు వెళుతున్న బిజ్‌బెహరా అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఎన్‌సి అభ్యర్థి బషీర్ అహ్మద్ వీరి వెంట ఒమర్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News