న్యూఢిల్లీ: ఈ మధ్యకాలంలో ఎయిర్ ఇండియా విమానాలు (Air India Plane) ప్రమాదాలకు గురవుతున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదంలో ఒకరు మినహా విమానంలో ఉన్నవారందరూ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదం మరువక ముందే వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. సోమవారం ముంబై ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానం అదుపు తప్పింది. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది.
ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎఐ 315 విమానంలో (Air India Plane) మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వచ్చిన విమానానికి ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీలో ల్యాండైన కాసేపటికే విమానం నుంచి ప్రయాణికులు దిగుతున్న సమయంలో విమానం పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలార్పి ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. ఈ ప్రమాదంలో ఎఐ 315 విమానం స్వల్పంగా దెబ్బ తింది.