సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో దేశప్రజలంతా మాకు అండగా నిలిచారని డిజిఎంఓ ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదులు కొన్నేళ్లుగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారని తెలిపారు. సైనికులనే కాకుండా, యాత్రికులను, భక్తులను టార్గెట్ చేస్తున్నారన్నారు. 9, 10 తేదీల్లో పాక్ భారత వైమానిక స్థావరాలను టార్గెట్ చేసిందని.. కానీ, డిఫెన్స్ వ్యవవస్థతో వాటిని అడ్డుకున్నామని చెప్పారు. మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకొని పాక్ మన వైమానిక స్థావరాలను ధ్వంసం చేయలేకపోయిందని ఆయన తెలిపారు.
“శత్రువుల విమానాలను మనదేశంలోకి రాకుండా అడ్డుకున్నాం.. మన అన్ని సైనిక స్థావరాలు సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి ఆపరేషన్‌కు అయినా మేం సన్నద్ధంగా ఉన్నాం. పాక్‌కు జరిగిన డ్యామేజీ వాళ్లు చెప్పుకోవడం లేదు. పాకిస్తాన్ వివిధ రకాల డ్రోన్లను వినియోగించింది. దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో మనం వాటిని అడ్డుకున్నాం. ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువులను దీటుగా ఎదుర్కొన్నాం. చైనా తయారు చేసిన పీఎల్-15 మిస్సైళ్లతో పాక్ దాడి చేసింది. వాటిని మనం ఆకాశ్ క్షిపణులతో నిర్వీర్యం చేశాం. పాక్‌లోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసింది. నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ రన్‌వేకు తీవ్రనష్టం జరిగింది” అని ఏకే భారతి వివరించారు.