Monday, May 20, 2024

కుమారుడిని కాదు కాబట్టే అవకాశం దక్కలేదు:అజిత్ పవార్

- Advertisement -
- Advertisement -

పుణె: ఎన్‌సిపి(శరద్ పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ కుమారుడిని కాదు కాబట్టే తనకు రాజకీయ అవకాశం లభించలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గురువారం వ్యాఖ్యానించారు. 80 ఏళ్లు పైబడిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బిజెపితో చర్చలు జరిగాయని, కాని తుది నిర్ణయం తీసుకోలేదని శరద్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ కనీసం చర్చలు జరిగాయని అయినా ఆయన(శరద్ పవార్) ఒప్పుకున్నారని, చర్చలకు తానే ప్రత్యక్ష సాక్షినని అజిత్ చెప్పారు. గత ఏడాది జులైలో అజిత్ పవార్, మరో 8 మంది ఎన్‌సిపి ఎమ్మెల్యేలతో కలసి మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే-బిజెపి ప్రభుత్వంలో చేరారు. దీంతో శరద్ పవార్ స్థాపించిన ఎన్‌సిపిలో చీలిక అనివార్యమైంది.

గురువారం పుణె జిల్లాలోని షిరూర్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో అజిత్ పవార్ ప్రసంగిస్తూ తనకు కూడా 60 ఏళ్లు దాటాయని, తనకు అవకాశం లభించాలా వద్దా అని ప్రశ్నించారు. తాము తప్పుగా ఏమి ప్రవర్తించలేదని, అందుకే తమకు ఆవేశం వచ్చిందని ఆయన చెప్పారు. పవార్ సాబ్ తమకు దేవుడు లాంటివారని, ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదని అజిత్ స్పష్టం చేశారు. అయితే ప్రతి వ్యక్తికి ఒక కాలం ఉంటుందని, 80 ఏళ్లు దాటిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌కు తాను కుమారుడినైతే తనకు అవకాశం వచ్చి ఉండేదా కాదా అని ఆయన ప్రశ్నించారు. కచ్ఛితంగా తనకు అవకాశం వచ్చి ఉండేదని, కాని తాను సొంత కుమారుడిని కాని కారణంగానే తనకు అవకాశం లభించలేదని ఆయన చెప్పారు. ఇదేమి న్యాయమని ఆయన ప్రశ్నించారు. షిరూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్‌సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివాజీరావు అధల్‌రావు పాటిల్ తరఫున అజిత్ పవార్ ప్రచారం చేశారు. పుణె జిల్లాలోని బారామతి పవార్‌ల కంచుకోటగా ఉంది. బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ తన మరదలు, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పోటీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News