మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు బ్యారేజీలపైనే విచారణ జరిపించడాన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్-బిఆర్‌ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందన్న అనుమానం కలుగుతున్నదని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అవినీతి చేసిన వారిని జైలుకు పంపించకుండా కంటి తుడుపు చర్యగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారని ఆయన విమర్శించారు. ఆదివారం అసెంబ్లీ సమావేశంలో పిసి ఘోష్ కమిషన్ నివేదికపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దోషులను శిక్షించాలన్న ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
కమిషన్ల కోసం ప్రాజెక్టు కట్టారని ఆరోపించిన వారు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై కేసులు పెట్టబోమని అంటున్నారని ఆయన కాంగ్రెస్‌నుద్దేశించి విమర్శించారు. కమిషన్ నివేదికలో కెసిఆర్ పేరు ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. అవినీతి చేసిన వారిపై ఏమి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లక్ష కోట్ల దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు ప్రజలు ఊరుకోరని ఆయన తెలిపారు. సిబిఐ లేదా సిట్ విచారణ జరిపిస్తారా? చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కమిషన్ ఎందుకు వేశారో, అసెంబ్లీ సమావేశాలను హడావుడిగా ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని మహేశ్వర్ రెడ్డి అన్నారు.
ఏటిఎంలా మారిన ప్రాజెక్టులుః అక్బరుద్దీన్
మజ్లీస్ శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తూ సాగు నీటి ప్రాజెక్టులు ఏటిఎంలా మారాయని విమర్శించారు. గతంలో కూడా న్యాయ విచారణ కమిషన్లను నియమించినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏటిఎంల పాస్ వర్డ్‌లు మారుతున్నాయని ఆయన విమర్శించారు. న్యాయ విచారణ అనంతరం మంత్రుల కమిటీని నియమిస్తున్నారని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.