- వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చొరవతో అంబులెన్స్ మంజూరు
- 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్న అంబులెన్స్ సిబ్బంది
- అత్యవసర సమయాలలో అపూర్వ స్పందన
- తమ సేవలతో శహబాష్ అనిపించుకుంటున్న 108 వాహన సిబ్బంది
మన తెలంగాణ/కారేపల్లి : కారేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 108 వాహనం (Ambulance) అవసరం అని వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం అత్యవసర వాహనం అంబులెన్స్ మంజూరు చేసిన పిదప, ఎంతోమంది ప్రాణాలను నిలుపుతున్నది. అత్యవసర సమయంలో వైద్య సేవలను అందిస్తూ మండల ప్రజల మన్ననలను పొందుతున్నది. గతంలో అత్యవసర సమయంలో పొరుగు మండలమైన కామేపల్లినుండి అంబులెన్స్ రాక కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. 41 గ్రామపంచాయతీలను కలిగి ఉన్న కారేపల్లి మండల ప్రజలకు ఈ అంబులెన్స్ (Ambulance) సేవలు ఎంతో ఉపయోగకరంగా మారాయి. విద్యుత్ ఘాతం,రోడ్డు ప్రమాదాలు, గుండె సంబంధిత సమస్యలు,అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు, అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్సను అందించి,మెరుగైన వైద్య సేవల కోసం ఖమ్మం పట్టణ వైద్యశాలకు తరలిస్తున్నారు. సకాలంలో పేషెంట్లను ఆసుపత్రులకు చేర్చడం ద్వారా ప్రాణాలను నిలుపుతున్నారు. 2024 డిసెంబర్ 15వ తేదీ నుండి అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శివకుమార్,ఇన్చార్జి దుర్గాప్రసాద్ గైడెన్స్ పొందుతూ అంబులెన్స్ సిబ్బందిగా వేములపల్లి సంపత్ (పైలట్),చింత అనిత (ఈఎంటి), చేపల రేణుక (ఈఎంటి),అజ్మీరా సంపత్ (పైలట్) తమ విధులను నిర్వర్తిస్తున్నారు. 24గంటలు చొప్పున డ్యూటీ చేస్తూ విడతల వారీగా సేవలు అందిస్తున్నారు. అంబులెన్స్ మంజూరైన ఆరునెలల వ్యవధిలోనే దాదాపు 1000 కేసులకు పైగా ప్రజలకు సేవలు అందించారు. సహజంగా ప్రతినెల 70 నుంచి 80 కేసులకు అంబులెన్స్ సేవలు అందించే తరుణంలో కారేపల్లి మండలానికి సంబంధించి ప్రతినెల 130 నుంచి 150 కేసులకు వైద్య సేవలు లభిస్తున్నాయి.
పెరిగిన సాధారణ కాన్పులు…
సకాలంలో అంబులెన్స్ సేవలు దొరుకుతున్న తరుణంలో గర్భిణీల సాధారణ కాన్పు కేసులు గణనీయంగా పెరిగాయి. ఇటీవల ఆగస్టు నెలలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణి లావణ్యను అనంతారం తండా వద్ద వరద ఉధృతి నుండి సురక్షితంగా బయటకు తీసుకొని వచ్చి పిహెచ్సికి తరలించారు.ఈ క్రమంలో లావణ్య సురక్షితంగా మగబిడ్డకు జన్మనిచ్చింది
ఇతర ప్రాంతాల కేసులకు సైతం వైద్య సేవలు…
కారేపల్లి మండలంతో పాటు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని అనేక కేసులకు కూడా సేవలు అందించిన సందర్భాలున్నాయి.
అంబులెన్స్ సేవలు అభినందనీయం…
అంబులెన్స్ వాహనం వచ్చిన తర్వాత మండల ప్రజలకు అనేక వైద్య సేవలు లభిస్తున్నాయి.అత్యవసర సమయంలో అంబులెన్స్ వాహనమే ప్రజల ప్రాణాలను కాపాడుతున్న పరిస్థితి ఉన్నది. రోడ్డు ప్రమాదాల కేసులకు వేగంగా సేవలు అందుతున్నాయి.
– నాగండ్ల జగన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
Also Read : ఎసిబికి చిక్కిన వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్