Sunday, April 28, 2024

మన అంతరిక్ష సాంకేతికతను అమెరికా అడిగింది: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్

- Advertisement -
- Advertisement -

రామేశ్వరం: చంద్రయాన్ 3 విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. అంతకు ముందే చంద్రయాన్ 3 అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన అమెరికా అంతరిక్ష నిపుణులు… సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్టు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. కాలం మారిందని, భారత్ సైతం అత్యుత్తమ పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగలదని, అందుకే ప్రధాని మోడీ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌కు ద్వారాలు తెరిచారని చెప్పారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 92 వ జయంతి సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సోమనాథ్ ప్రసంగించారు.

“చంద్రయాన్3 వ్యోమనౌకను తయారు చేసిన తరువాత నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ నిపుణులను ఆహ్వానించామని, ఐదారుగురు నిపుణులు అక్కడ నుంచి వచ్చి అంతా పరిశీలించారని, తామెలా రూపొందించామో, ఇంజినీర్లు ఏ విధంగా కష్టపడ్డారో, చంద్రుడిపై ఏ విధంగా ల్యాండ్ చేయనున్నామో తదితర విషయాలు వారికి చెప్పామని సోమనాధ్ పేర్కొన్నారు. చాలా తక్కువ ఖర్చుతో సులభంగా, అత్యాధునిక సాంకేతికతతో ఎలా మన శాస్త్రీయ పరికరాలు తయారు చేశారో వారు అడిగారని, ఈ సాంకేతికతను అమెరికాతో ఎందుకు పంచుకోకూడదని వారు అడిగారని సోమనాథ్ గుర్తు చేసుకున్నారు.

అంతరిక్ష సాంకేతికతలో భారత్‌ను మరింత శక్తిమంతం చేసే దిశగా, రాకెట్లు, ఉపగ్రహాల తయారీకి ముందుకు రావాల్సిందిగా ప్రజలను ఆహ్వానిస్తున్నానని విద్యార్థుల నుద్దేశించి ఆయన పిలుపు నిచ్చారు. కలాం సిద్ధాంతాన్ని అనుసరించాలని యువతను ఉద్దేశించి ఆయన సూచించారు. కలలు కనడం అనేది చాలా శక్తివంతమైన పరికరమని, అందుకే రాత్రుళ్లు కాకుండా, నిద్ర నుంచి లేచిన తరువాత కలలు కనండని కలాం చెప్పేవారని ఆయన కలాంను గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News