Saturday, July 27, 2024

నక్సలిజంపై పోరులో గెలుపు మాదే:అమిత్ షా

- Advertisement -
- Advertisement -

హజారీబాగ్ : నక్సలిజం నిర్మూలనకు దేశంలో ఇప్పుడు చర్యలు వేగవంతం అయ్యాయని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ క్రమంలో పురోగతి దిశలో ఉన్నామని వివరించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం నక్సలిజంపై పోరులో గెలుపు దక్కించుకునేందుకు కృతనిశ్చయంతో ఉందన్నారు. శుక్రవారం హోం మంత్రి జార్ఖండ్‌లోని హాజరీబాగ్‌లోని మేరులో బిఎస్‌ఎఫ్ 59వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. దళాలను ఉద్ధేశించి ప్రసంగించారు. 1965లో ఈ రోజునే (డిసెంబర్ 1న) 2.65 లక్షల మంది సిబ్బందితో బిఎస్‌ఎఫ్ అవతరించింది. విశిష్ట సేవలు అందిస్తోంది. గత పదిసంవత్సరాలలో దేశంలో నక్సల్స్ చర్యలు దాదాపుగా 52 శాతం మేర తగ్గినట్లు, పూర్తిస్థాయిలో నక్సలిజం ఏరివేత జరుగుతుందని ప్రకటించారు. గతంలో 96 జిల్లాలు నక్సల్స్ ప్రభావితం అయ్యాయి. ఇప్పుడీ సంఖ్య 45కు చేరింది. నక్సల్స్ చర్యలలో హతుల సంఖ్య దాదాపు 70 శాతం వరకూ తగ్గింది. వామపక్ష తీవ్రవాద చర్యలతో దెబ్బతిన్న పోలీసు స్టేషన్ల సంఖ్య ఇంతకు ముందు 495 వరకూ ఉండగా , ఇప్పుడిది 176కు చేరిందని హోం మంత్రి తెలిపారు. బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్,

ఐటిబిపి వంటి బలగాలతో ఇప్పుడు నక్సలైట్లపై పోరు తుది దశకు చేరిందని వివరించారు. నక్సలిజం సమస్య లేకుండా చేసే దశకు చేరుకుంటున్నామని తెలిపారు. జార్ఖండ్‌తో పాటు పలు రాష్ట్రాలలో నక్సలిజం నిర్మూలన దిశలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. 2019 నుంచి ఇప్పటివరకూ నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాలలో పలు వ్యూహాలతో భద్రతా బలగాలు విజయపథంలో సాగుతున్నాయి. నక్సల్స్‌పై చక్రబంధం ప్రయోగిస్తున్నాయి. ఈ క్రమంలో అటవీ, పర్వత ప్రాంతాలలో మావోయిస్టులు దిగ్బంధం జరిగింది. మోడీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కొత్తగా 199 వరకూ భద్రతా బలగాల క్యాంపులు ఏర్పాటు చేసినట్లు , దీనితో నక్సలిజం నిర్మూలన మరింతగా కార్యాచరణకు మారిందని వివరించారు. సుశిక్షితులైన మన వీర జవాన్ల బలగాలతో మన సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. దేశ ప్రగతికి సరిహద్దుల భద్రత కీలకం. ఈ నేపథ్యంలో మనం కంటినిండా కునుకు తీయడానికి, మరింత పురోగమించడానికి పరోక్షంగా పాటుపడుతున్నది జవాన్లే అని వారికి మనసారా సెల్యూట్ అని అమిత్ షా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News