Tuesday, December 10, 2024

అమిత్ షా రాజీనామా చేయాలి

- Advertisement -
- Advertisement -

మోడీ మణిపూర్‌కు వెళ్లాలి
అఖిలపక్ష భేటీ జరగాలి
మణిపూర్‌పై కాంగ్రెస్ డిమాండ్

న్యూఢిల్లీ : మణిపూర్‌లో పరిస్థితి పూర్తిగా దిగజారినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి. షాతో పాటు సిఎం బీరెన్ సింగ్ కూడా పదవి నుంచి వైదొలగాల్సి ఉంది. ప్రధాని మోడీ ఇక ఆలస్యం చేయకుండా మణిపూర్‌లో పర్యటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే మోడీ మణిపూర్‌కు వెళ్లాలని కాంగ్రెస్ నాయకులు జై రాం రమేష్ సోమవారం డిమాండ్ చేశారు. పరిస్థితిపై ఇప్పటికీ ప్రధాని మోడీ స్పందించడం లేదు. వెంటనే పరిస్థితిని సమీక్షించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది. 25వ తేదీన పార్లమెంట్ సెషన్ ఉంది. దీనికి ముందే మణిపూర్ పరిస్థితిపై జాతీయ స్థాయిలో సమీక్ష అత్యవసరం అని కాంగ్రెస్ నేత తెలిపారు. మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు కె మేఘచంద్ర సింగ్, రాష్ట్ర ఎఐసిసి ఇన్‌ఛార్జి గిరిష్ ఛోడంకర్‌తో కలిసి జైరాం విలేకరులతో మాట్లాడారు.

2023 మే నుంచి మణిపూర్‌లో పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. మణిపూర్ మండిపోతూ ఉండగా ప్రధాని మోడీ దీని గురించి పట్టించుకోకుండా విదేశీ పర్యటనలకు వెళ్లి వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన నిజంగానే లోకం చుట్టి వచ్చినట్లు అయింది. అయితే రెండేళ్లు దాటినా ఆయన ఒక్కసారి కూడా మణిపూర్‌కు వెళ్లలేదు. ప్రజలకు ధైర్యం చెప్పలేదని విమర్శించారు. మోడీ వెంటనే మణిపూర్ వెళ్లాలి. పార్టీలు, రాజకీయ నేతలు, సంఘాలు, సంస్థలను కలియాలి. అక్కడి సహాయక శిబిరాలలో ప్రజలతో మాట్లాడాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

జులై నుంచి అక్కడ పూర్తి స్థాయి గవర్నర్ లేరని, అంతకు ముందు వరకూ ఉన్న గవర్నర్ ఎస్‌టి అని, ఆమెను కేవలం 18 నెలలకే తొలిగించి వేశారని చెప్పారు. వెంటనే అక్కడ పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించాల్సి ఉందన్నారు. ఇప్పటి పరిస్థితి చూస్తూ ఉంటే ప్రధాన మంత్రి మణిపూర్‌ను హోం మంత్రికి ఔట్‌సోర్సింగ్‌గా వదిలిపెట్టినట్లుగా ఉందని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేతకానితనంతో రాష్ట్రంలో పూర్తిగా అరాచకంనెలకొంది. దీనికి పూర్తి బాధ్యత హోం మంత్రిదే. ఆయన వెంటనే రాజీనామా చేయాలనేదే తమ డిమాండ్ అని మణిపూర్ పిసిసి చీఫ్ మెఘాచంద్ర సింగ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News