అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డి, డిజిపి హరీశ్ కుమార్ గుప్తా భారత ఎన్నికల సంఘానికి(ఈసిఐ) వివరణ ఇవ్వడానికి గురువారం ఢిల్లీకి వెళ్లారు. వారితో పాటు అదనపు డైరెక్టర్ జనరల్ కుమార్ విశ్వజీత్ కూడా వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో సోమవారం పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై వారు వివరణ ఇవ్వనున్నారు.
హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా వారెందుకు నివారించలేకపోయారో వివరించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకే దఫాలో నిర్వహించగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ గా ఉందని వినికిడి. మాచర్ల, నరసారావుపేట్, తాడిపత్రి నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు ఘోరంగా జరిగాయి. ఈవిఎం లను ఎవరు ధ్వంసం చేశారో వారందరిపై కేసులు బుక్ చేయాల్సిందిగా ఈసిఐ ఆదేశించిందని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.