Monday, May 20, 2024

వెనుకబడిన వర్గాలు ఇక వెనకేనా?

- Advertisement -
- Advertisement -

భారత రాజ్యాంగంలో వెనుకబడిన వర్గాలను నిర్వచించకపోవడం వలన వెనుకబడిన వర్గాలు అనే పదానికి నిర్దిష్టమైన నిర్వచనం లభించడం లేదు. కనీసం రాజ్యాంగ రచయితలైనా లేదా సామాజికవేత్తలైనా వెనుకబాటుతనాన్ని నిర్వచించకపోవడం శోచనీయాంశం. 1956లో ప్రచురించిన వెనుకబడిన వర్గాల నివేదిక ఎస్‌సిలు, ఎస్‌టిలు, బిసి లను కలిపి వెనుకబడిన వర్గాలుగా పేర్కొన్నది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు నిర్వచించిన దాని ప్రకారం వెనుకబడిన వర్గం అంటే కులం, మతం, జాతి, భాష, వృత్తి తదితర ప్రాతిపదికలపై నిర్ధారించదగిన, గుర్తించదగిన వ్యక్తుల సమూహమై సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో వెనుకబాటు లక్షణాలతో ఉన్నదే వెనుకబడిన వర్గం. తక్కువ అక్షరాస్యత, విద్యలేమి, పేదరికం, శ్రామిక దోపిడీ, అంటరానితనం వంటి లక్షణాలతో కూడిన సాంఘిక సమూహాలు, వర్గాలు లేదా కులాలే వెనుకబడిన వర్గాలు. సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలైన కూలీలు, తెగలుకలిసి ఏర్పడిన సామాజిక వర్గమే వెనుకబడిన వర్గం. ఆర్టికల్ 15(4)- సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గం గురించి చెప్పింది.

ఆర్టికల్ 16(4)- వెనుకబాటు వర్గం గురించి చెప్పి సేవా రంగాలలో వారికి సరైన ప్రాతినిధ్యం లేదని చెప్పింది. ఆర్టికల్ 45- ఉచిత నిర్బంధ విద్య గురించి చెప్పింది. ఆర్టికల్ 46- ఎస్‌సిలు, ఎస్‌టిలు అంతర్భాగంగా బలహీన వర్గాల అందరినీ కలుపుకొని వెనుకబడిన వర్గాలు అవుతారని చెప్పింది. ఆర్టికల్ 340- ప్రతి రాష్ట్రం ఆ రాష్ట్రంలో నివసిస్తున్న వెనుకబడిన వర్గాల స్థితిగతులను పరిశీలించి వారి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని చెప్పింది.పైన పేర్కొన్న అభిప్రాయాలు, ఆర్టికల్స్ పరిశీలిస్తే ఎస్‌సిలు, ఎస్‌టిలు, బిసి లు కలిపి వెనుకబడిన వర్గాలుగా చెప్పవచ్చు. కానీ ఎస్‌సి, ఎస్‌టిల విషయానికి వచ్చేసరికి రాజ్యాంగం వారికి రాజ్యాంగ రక్షణ కల్పించింది. కానీ అదే బిసిల విషయానికి వస్తే రాజ్యాంగ రక్షణ లేదు, నిర్దిష్టమైన నిర్వచనం లేదు.

భారత దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలోనే కొన్ని కులాలకు రిజర్వేషన్లు ఉండేవి. కాలక్రమేణా 1882- 91 ప్రాంతంలో కొల్హాపూర్ సంస్థానాధిషుడైన ఛత్రపతి సాహు మహారాజ్ సాంఘికంగా వెనుకబడిన జాతుల ప్రజలకు మొదటిసారి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాడు. 1918లో మైసూరు రాజు కృష్ణరాజ వడియార్ నల్వాడి సాంఘికంగా అణగారిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాడు. కానీ దీనికి నిరసనగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన పదవికి రాజీనామా చేశాడు.ఆ తర్వాత 1921లో ప్రథమ జస్టిస్ పార్టీ ప్రభుత్వం మొదటి కమ్యూనల్ గవర్నమెంట్ ఆర్డర్ (జిఒ నెంబర్ 613)ని ఆమోదించి తద్వారా భారత దేశ శాసన చరిత్రలో రిజర్వేషన్లను చట్టబద్ధం చేసిన మొట్టమొదటి ఎన్నికైన ప్రభుత్వంగా చరిత్రలో నిలిచింది. ఈ విధానం అప్పటి నుండి దేశ వ్యాప్తంగా ప్రామాణికతను సంతరించుకుంది.

ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్- 340 అనుసరించి తేదీ 30 జనవరి 1953లో కాకా కాలేల్కర్ ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిశీలించేందుకు కమిషన్ వేసింది. ఇక్కడ వెనుకబడిన వర్గాలు అంటే ముఖ్యంగా బిసిల స్థితిగతులపై పరిశీలన. ఈ కమిషన్ 30 మార్చి 1955న వెనుకబాటుతనాన్ని నిర్ణయించేందుకు ప్రమాణాలు నిర్ణయిస్తూ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం హిందూ మతంలోని సాంప్రదాయక నిచ్చెన మెట్ల కులాల అమరికలో సాంఘికంగా అట్టడుగు స్థానం లో ఉండటం. ఒక కుల సముదాయంలో అంతర్భాగంగా లేదా ఆ కులంలో అభివృద్ధికి ఆమడ దూరంగా ఉండడం. ప్రభుత్వ సేవల్లో ప్రాతినిధ్యం లేకపోవడం.

ఈ కొలమాన అంశాల పరంగా కాకా కాలేల్కర్ కమిషన్ 2399 సముదాయ సమూహాలను విద్యాపరంగా, సాంఘికంగా వెనుకబడినవిగా ప్రకటించింది. వీటిలో 913 సముదాయాల జనాభా 11.5 కోట్లుగా పేర్కొంది. ఎస్‌సి, ఎస్‌టిల జాబితాలు తరువాత తిరిగి ప్రకటించింది. అప్పటి దేశ జనాభా సుమారు 39,85,77,992. మిగిలిన 1486 సముదాయాల జనాభా పరిగణనలోకి తీసుకోబడలేదు.అంటే వారి జనాభా ఇంకెంత ఉంటుందో ఊహించుకోవచ్చు. నాటి నుండి నేటి వరకు బిసిల జనాభా 50 శాతానికి పైమాటే. కమిషన్ చేసిన కొన్ని సిఫారసులను పరిశీలించినట్లయితే 1961 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని వారి జనాభా లెక్కలు తయారు చేయాలి. కానీ ఇంతవరకు కులగణన చేయకపోవడం బిసిల దౌర్భాగ్యం. బిసిలపై పాలకులకు ఉన్న కుటిలనీతికి నిదర్శనం.సిక్కు, క్రిస్టియన్, ముస్లింలలోని కొన్ని సమూహాలను ఒబిసి వర్గాలుగా గుర్తించాలి.

రాజ్యాంగపరంగా చట్టపరమైన రక్షణను కల్పించే పరిపాలన వ్యవస్థ మొత్తం కులతత్వంతో (ఆధిపత్య కులాలతో) నిండిపోయింది. కనుక ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దకపోతే దేశంలో కులవర్గాలు చెలరేగి జాతీయ సమైక్యతకు పెను విఘాతం కలుగుతుందని చెప్పింది. ఒబిసి విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలి. వృత్తి విద్య కళాశాలలో 70% సీట్లు కేటాయించాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్థానిక సర్వీసుల్లో క్లాస్-1 ఉద్యోగాల్లో 25%, రెండో తరగతి ఉద్యోగాల్లో 33.33%, మూడవ, నాలుగవ తరగతి ఉద్యోగాల్లో 40% ఒబిసిలకు కేటాయించాలి. వీటికి ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు చేర్చబడవు. అన్ని రిజర్వేషన్లు 49% దాట వద్దని కోరింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను కేంద్రం తోసిపుచ్చింది. ఈ నివేదికపై అప్పటి విద్యాధికా సంపన్న ఉన్నత సామాజిక వర్గాల వారు చాలా చాలా విమర్శలు చేశారు. సబ్బండ శ్రామిక వృత్తులు చేసే నిమ్నజాతి ప్రజలు మస్తు సమాజ ప్రగతి రథాన్ని నడిపిస్తున్నారు.

ఈ ప్రజల బాగుకోసం రాజ్యాంగ రూపశిల్పులు సానుకూల వివక్ష (రిజర్వేషన్)ను పొందుపరిచారు. 70 సంవత్సరాల రిజర్వేషన్ చరిత్రలో అణగారినవర్గాల బతుకులు పూరి గుడిసెల్ల పూటగడవని స్థితిలోనే కొనసాగుతున్నాయి.
2015 బీహార్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ విధానంపై సామాజిక సమీక్ష జరగాలని అన్నారు. దాని పరమార్ధం ఏమిటో నేటికీ అంతుచిక్కడం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ వారు రిజర్వేషన్లు రద్దు చేస్తారు అని ఆరోపించడం జరిగింది. ప్రతిగా మోహన్ భగవత్ మళ్లీ రిజర్వేషన్ రద్దు అనేది జరగదు అని సెలవిచ్చారు.

ఎస్‌సి, ఎస్‌టిలకు జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగాలతో పాటు చట్టసభలలో సైతం రిజర్వేషన్ విధానం అమలవుతుంది. కానీ ఇప్పుడు వారి జనాభా సైతం పెరిగింది వారి రిజర్వేషన్లను కూడా సరిచేయాల్సి ఉంది. రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీం కోర్టు గీతగీసింది. కానీ గతంలో విపి సింగ్ ప్రభుత్వం, పివి నరసింహారావు ప్రభుత్వాలు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నించి విఫలమైనవి. 2019లో బిజెపి ప్రభుత్వం మాత్రం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16(6) లను సవరించి అగ్రవర్ణ పేదలకు (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్- ఇడబ్ల్యుఎస్) 10% రిజర్వేషన్లు కల్పించారు.

103వ రాజ్యాంగ సవరణ మొత్తం రిజర్వేషన్లను 59.50 శాతానికి నెట్టింది అనేది గమనార్హం. బిసిలకు కూడా రాజ్యాంగ సవరణ చేసి 50% రిజర్వేషన్ కల్పించినట్లయితే సముచితంగా ఉండేది. బిసిల విషయంలో క్రిమిలేయర్ పేరిట కాస్త అభివృద్ధి చెందిన ఎనిమిది లక్షల పైబడి ఆదాయం కలిగిన బిసి లందరికీ ఆ కొద్దిపాటి రిజర్వేషన్లు కూడా అందడం లేదు. ముఖ్య విషయం ఏమిటంటే అగ్రవర్ణ పేదలకు ఇచ్చే ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ ఆదాయ పరిమితి కూడా ఎనిమిది లక్షలు మాత్రమే. క్రిమి లేయర్ అనేది బిసిల మధ్య అనైక్యతకు దారితీస్తుంది ఎందుకంటే క్రిమిలేయర్‌లో ఉన్న బిసిలకు ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. నాన్ క్రిమిలేయర్‌లో ఉన్న బిసిలకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది.

భారత రాజ్యాంగం ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యం ఏర్పడేటట్లు చూడాలని నిర్దేశిస్తుంది. అందరికీ సమాన అవకాశాలు కల్పించి ఆర్థిక, సామాజిక న్యాయం సమకూర్చాలని చెప్పింది. దేశంలో జాతీయ ప్రాముఖ్యత గల ప్రభుత్వ విద్యాసంస్థలలో, కొన్ని జాతీయ ప్రాముఖ్యమున్న సంస్థల లో నేటికీ వెనుకబడిన వర్గాలు రిజర్వేషన్లకు నోచుకోలేకపోతున్నవి. కానీ జరుగుతున్న పరిణామక్రమాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక అంతరాలే కాదు సామాజిక వెనుకబాటుతనం కూడా రోజురోజుకు పెరిగిపోతున్నది. కారణం కొందరు ఉన్నత సామాజిక వర్గాలవారు మేము ఉన్నతులమని వెనుకబడిన వర్గాలు తక్కువవారని భావిస్తున్నారు. ఫలితంగా సమాజంలో ప్రజల మధ్యలో శత్రుభావం పెరిగి అశాంతిరాజుకునే అవకాశం ఉంది. ఇది దేశ సమగ్రతను ప్రమాదంలోకి నెట్టుతుంది.

ప్రభుత్వం వెనుకబడిన వర్గాల వారికి విద్య, ఉపాధిలో వారి జనాభా దామాషా ప్రకారం సరైన ప్రాతినిధ్యం కల్పించి ఆర్థికంగా వీరిని ప్రోత్సహిస్తూ సంపద కొందరి చేతుల్లో పోగుపడకుండా అందరికీ అందేలా చూడాలని రాజ్యాంగంలోని 38, 39 అధికరణలు చెపుతున్నాయి. ఆర్థికంగా బలపడిన నాడే ఈ వర్గాలు తమ వెనుకబాటుతనాన్ని దూరం చేసుకోగలుగుతాయి. ఆర్థికంగా కింది వరుసలోనున్న వెనుకబడిన వర్గాలవారు కావాలంటే వారి వెనుకబాటుతనం పోవాలంటే ప్రభుత్వాలు వారి కోసం నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి. వారి ఆశయాలను నెరవేర్చుకునే అవకాశం కల్పించాలి. అధిక సంఖ్యకులైన బడుగు బలహీన వర్గాలు బాగుపడిన నాడే దేశం బాగుపడుతుంది.

డా. కావలి చెన్నయ్య ముదిరాజ్
90004 81768

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News