Monday, April 29, 2024

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు

- Advertisement -
- Advertisement -

మధ్యంతర బెయిల్ కు నిరాకరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : స్కిల్ డెలవప్‌మెంట్ స్కాం కేసులో ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టులో పూర్తవ్వగా తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. చంద్రబాబుకు ఈ సందర్భంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు కోరారు. తాము మెయిన్ పిటిషన్‌పై వాదనలు విన్నామని, దానిపై తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం పేర్కొంది. మధ్యంతర బెయిల్ పై నిర్ణయం తీసుకోలేమని పరోక్షంగా చెప్పినట్లయింది. దీంతో చంద్రబాబుకు తీర్పు వచ్చే వరకూ ఉత్కంఠ సాగనుంది. శుక్రవారం లోపే తీర్పు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో ఎపి ప్రభుత్వం కూడా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ రాతపూర్వకంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. తాము కూడా అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని చంద్రబాబు తరపు లాయర్ సాల్వే సుప్రీం కోర్టుకు వెల్లడించారు. ధర్మాసనం అందుకు అంగీకరించింది. మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభమైన ముకుల్ రోహత్గీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. చంద్రబాబుకు 17ఎ సెక్షన్ వర్తించదన్నారు. వాదనల సందర్భంగా ధర్మాసనం పలు సందేహాలను లెవనెత్తింది. విచారణ ప్రారంభమయ్యే సరికి సెక్షన్ 17ఎ ఉంది కాబట్టి వర్తిస్తుందని న్యాయమూర్తి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. గంటకుపైగా వాదనలను ప్రభుత్వం తరపు న్యాయవాది రోహత్గీ వినిపించారు. తర్వాత చంద్రబాబు తరపు లాయర్ వాదించారు. చంద్రబాబు తరఫున వర్చువల్‌గా వాదనలు వినిపించిన సాల్వే చట్ట సవరణను ముందు నుంచి వర్తింపచేసే అంశంపై వాదనలు వినిపించారు. చట్టసవరణను ముందు నుంచి వర్తింపచేసే అంశంపై పలు తీర్పులను ఉటంకించారు. 2019 నాటి ‘శాంతి కండక్టర్స్’ కేసును ప్రస్తావించారు. ఈ కేసులో చంద్రబాబుకు 17ఎ చట్టం కింద రక్షణ ఉంటుందని, రాజకీయ కక్ష సాధింపులు లేకుండానే ఈ సెక్షన్ తీసుకు వచ్చారని, ఎన్నికలకు ముందు ఈ తరహా రాజకీయ కక్ష సాధింపులు ఉంటాయని అన్నారు.
సర్వత్రా ఉత్కంఠ
ఈ కేసులో రిమాండ్ సమయంలో చంద్రబాబును చేర్చారని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17ఎ వర్తిస్తుందని సాల్వే అన్నారు. రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయని, విపక్ష నేతను విచారించడం తమ హక్కుగా ఈ ప్రభుత్వం భావిస్తోందన్నారు. చంద్రబాబుకు 17ఎ సెక్షన్ వర్తిస్తే మొత్తం కేసులన్నీ తేలిపోయే అవకాశం ఉండటంతో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి కనబడుతోంది.
ఫైబర్ నెట్ కేసును శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
టిడిపి అధినేత చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదిస్తున్నారు. అయితే మంగళవారం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం వాదనలు వింటోంది. ఫైబర్ నెట్ కేసు విచారణ కూడా జరగాల్సి ఉండడంతో, ఈ వాదనల మధ్యలో సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకున్నారు. సమయం 3 గంటలు అయిందని, ఫైబర్ నెట్ కేసు విచారణ కూడా మంగళవారం ఉందని గుర్తు చేశారు. అయితే, ఫైబర్ నెట్ కేసును మరో రోజు చూద్దాం అని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. ముందు క్వాష్ పిటిషన్ విచారణ ముగిద్దాం అని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు.

ఫైబర్ నెట్ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నాం అని, ఆ మేరకు ఆదేశాలు ఇస్తాం అని వెల్లడించారు. అందుకు చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా స్పందిస్తూ ఈ కేసులో కోర్టు విచారణ పూర్తయ్యేవరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని గతంలో ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాలను కూడా పొడిగిస్తున్నట్టే కదా అని ధర్మాసనం నుంచి మరింత స్పష్టత కోరారు. అందుకు జస్టిస్ అనిరుద్ధ బోస్ బదులిస్తూ అవును, అది కూడా పొడిగిస్తున్నట్టే అని స్పష్టం చేశారు. అంతేకాదు, విచారణ ముగిసేంతవరకు అరెస్ట్ చేయవద్దన్న చంద్రబాబు అభ్యర్థనను అంగీకరించాలని ఎపి ప్రభుత్వానికి సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News