Monday, April 29, 2024

టిడిపి-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే కష్టాలు తీరుస్తా

- Advertisement -
- Advertisement -

ఎపిలో సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర

మన తెలంగాణ / హైదరాబాద్: టిడిపి -జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎపి ప్రజల కష్టాలు తీరుస్తానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఎపిలో సుదీర్ఘ విరామం తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రారంభమైన పాదయాత్రలో లోకేశ్ మాట్లాడుతూ వ్యవస్థలను మేనేజ్ చేసి టిడిపి అధినేత చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని విమర్శించారు. తనపైనా సిఐడి అధికారులు కేసులు పెట్టారని, ఒక్క ఆధారమూ చూపలేకపోయారన్నారు. ఏ తప్పూ చేయనందునే మళ్లీ ఇక్కడ నిలబడ్డానని చెప్పారు.

‘ యువగళం’ పాదయాత్రలో భాగంగా డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో నారా లోకేష్ మాట్లాడారు. ‘స్కిల్ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా? నాపై ఆరు కేసులు పెట్టారు. అయినా వెనక్కి తగ్గం. ఎపి మంత్రులకు చెబుతున్నా. మీకు కౌంట్ డౌన్ మొదలైంది. నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తుంటే ఎలా అడ్డుకున్నారో చూశాం. మాపై ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. మేం కూడా మీలాగే చేస్తే వైకాపా నేతలంతా జైలులోనే ఉంటారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఆయనకు అండగా నిలిచారు. ఆయన్ను జైలుకు పంపితే నా పాదయాత్ర ఆగుతుందని వైసిపి నేతలు అనుకున్నారు. ఎన్ని అడ్డంకులు కలిగించినా టిడిపి యువగళం పాదయాత్ర ఆగదు. వైసిపి బస్సు యాత్ర కాస్త తుస్సు యాత్రగా మారింది. ఇప్పుడు ‘వై ఏపీ నీడ్స్ జగన్ ’ అంటున్నా.. వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. జగన్ పాలనలో సామాజిక అన్యాయం జరిగింది. అనేక మంది దళితులను వేధించి చంపారు. ” అని నారా లోకేశ్ ఆరోపించారు.

మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి ప్యాకప్ :
సైకో జగన్ కు ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయ్యిందని, మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి ప్యాకప్ అని నారా లోకేష్ అన్నారు. సోమవారం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ యువగళం పాదయాత్రకు 79 రోజులు బ్రేక్ ఇచ్చినందుకు క్షమించాలన్నారు. పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నానని టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

ప్రతి వంద కిలోమీటర్ల పాదయాత్రకు గుర్తుగా ప్రత్యేక హామీలు ఇచ్చానన్నారు. వైసిపి నాయకుల అవినీతిని భయటపెట్టానని, ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దోపిడీ బయటపెట్టానని చెప్పారు. పాదయాత్ర మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే సైకో జగన్ అడ్డుకోవడానికి స్కెచ్ లు వేశారన్నారు. అన్న ఎన్టీఆర్ ఇచ్చిన గొంతు ఆపే మగాడు పుట్టలేదని ముందే చెప్పా. సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర అని యువనేత హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News