మన తెలంగాణ / హైదరాబాద్ : భారత్‌పై దాడి చేయాలంటే వంద సార్లు ఆలోచించేలా పాకిస్థాన్‌పై చర్యలుండాలని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీహార్ పర్యటనలో ఉన్న అసదుద్దీన్ ఆదివారం ఈస్ట్ చంపారన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అసదుద్దీన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినందుకు పాక్ పై భారత్ దీటుగా సమాధానం ఇవ్వాలని, ఈ విషయంలో ప్రధాని మోడీ గట్టి చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉగ్రదాడిపై పాక్ సిగ్గులేకుండా ఆధారాలు అడుగుతోందని, గతంలో వైమానిక దళ స్థావరంపై దాడి చేసినప్పుడు ఆధారాలు చూపిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పాకిస్థాన్ తన దేశం నుంచి ఉగ్రవాదులు వచ్చి భారత ప్రజలను చంపుతారని ఎప్పటికీ అంగీకరించదని, భారత్ ను శాంతియుతంగా జీవించనివ్వదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పహల్గాం ఉగ్రదాడి విషయంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఉగ్రదాడిలో తన భర్త ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి హిందూ- ముస్లిం విషాన్ని వ్యాప్తి చేసేవారికి చక్కని సందేశం ఇచ్చారని తెలిపారు. ఆమె తన భర్తను కోల్పోయానని, కాని ముస్లింలు, కాశ్మీరీలపై హింసను కోరుకోవడం లేదని చెప్పిందని అన్నారు. ఆమె మాటలు భారత ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం ద్వేషాన్ని కాదు, ప్రేమ, శాంతిని పెంపొందించాలని సూచించారు. భారత్ లో విషాన్ని వ్యాప్తి చేస్తున్న వారు పాకిస్థాన్ ముఖాల్లో చిరునవ్వులు తెస్తున్నారని గుర్తుంచుకోవాలని, ఆ క్రూరమైన వ్యక్తుల ముఖాల్లో చిరునవ్వులు తుడిచేయాలని తాను కోరుకుంటున్నట్లు ఓవైసీ అన్నారు.