లక్నో: ముంబైలోని గణేశ్ పండుగ సందర్భంగా మానవ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని బెదిరింపు సందేశం వాట్సాప్‌లో పెట్టినందుకు నోయిడాలోని సెక్టార్-79లో ఉంటున్న 50 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పాట్నాకు చెందిన అశ్విన్ కుమార్ సుప్రా గత ఐదు సంవత్సరాలుగా నోయిడాలోని సెక్టార్ 79లో నివసిస్తున్నాడు, జ్యోతిష్కుడు, వాస్తు సలహాదారుడిగా పనిచేస్తున్నాడు. లష్కరే జిహాదీకి చెందిన 14 మంది ఉగ్రవాదులు 400 కిలోల ఆర్‌డిఎక్స్‌తో 34 వాహనాల్లో ముంబైలోకి ప్రవేశించారని, కోటి మంది వరకు ప్రాణాలను బలిగొనే భారీ పేలుడుకు ప్రణాళిక వేస్తున్నారని నిందితుడు గురువారం రాత్రి ముంబై పోలీసులకు వాట్సాప్ సందేశం పంపాడు.
ముంబై పోలీసులు ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. కాగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేసి నోయిడాకు చెందిన అశ్విన్ కుమార్ దానిని పంపారని గుర్తించారు. అతడి మొబైల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తమదైన పద్ధతిలో విచారించాక అతడు తనకు స్నేహితుడుగా మారిన శత్రువు బీహార్ వాసి ఫిరోజ్‌ను ఇరికించడానికే అలా చేశానని ఒప్పుకున్నాడు. ఫిరోజ్ పెట్టిన తప్పుడు కేసు కారణంగానే అశ్విన్ 2023లో పాట్నాలో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాడని సమాచారం.