Thursday, February 29, 2024

నవ్వుల పాలవుతున్న జోస్యాలు

- Advertisement -
- Advertisement -

జ్యోతిష్యం ఓ శాస్త్రమని ఎందరు ఒప్పించే ప్రయత్నం చేసినా అది కేవలం ఉహాగానమేనని పలుమార్లు తేలిపోయింది. హస్త రేఖలు, జన్మ నక్షత్రాలు, రాశి ఫలాలు, జాతక చక్రాలు లాంటివి మనిషి జీవిత గమనాన్ని, జయాపజయాలను నిర్ణయిస్తాయనో, నిర్దేశిస్తాయనో నమ్మేవాళ్ళు చాలా ఉన్నా నిర్దిష్టంగా ఎప్పుడూ నిరూపించబడలేదు, పైగా విఫలమై నవ్వులపాలైన సందర్భాలు అనేకం. అలా చెప్పే వాళ్ల మాటలు ఎప్పుడో ఓసారి అనుకోకుండా గాలిలో విసిరిన రాయిలా తగులుతుంటాయి. దాన్నే పదే పదే ప్రచారం చేసి తమను నమ్మేవాళ్ళను కాపాడుకుంటారు, పైగా కిరాయి మనుషులతో ప్రచారం చేయించి తమ వృత్తిని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. నమ్మేవాళ్ళు ఉన్నంతకాలం పచ్చగా నడిచే గారడీ విద్యల్లో ఇదొకటి. అయితే వివిధ సందర్భాల్లో ఇవి శుద్ధ తప్పులని తేలినా అటు జ్యోతిష్యులు, ఇటు నమ్మేవాళ్లు ఏదో సర్దుబాటు మాటలతో గట్టెక్కుతున్నారు.

ఏ జోష్ లోనో ఎన్నిక ప్రచారంలో భాగంగా కేటీఆర్ ’ఈసారి ఇండియా క్రికెట్ వరల్ కప్ సాధించడం ఖాయం, ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం’ అన్నారు. చివరకు రెండూ విజయాన్ని అందుకోలేకపోయాయి. ఆయన ఆ మాట అనే నాటికి ఇండియా తొమ్మిది ఆటల్లో ఓటమి లేకుండా వరుస విజయాల్ని అందుకుంది. పోలిక సరిగ్గానే ఉంది కానీ కప్ కైవసమయ్యాక అంటే బాగుండేది. నిజానికి అప్పటికే కప్ మనదే అని భారతీయులు, భారాస గెలుపు ఖాయమని ప్రజలు, పార్టీ శ్రేణులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందే క్రికెట్ కప్ చేజారి పోయింది. దాంతో ఆయన పోలిక కొంత విమర్శకు, అపహాస్యానికి తావిచ్చినట్లయింది. అయితే ఆయన మాట ఎన్నికల ప్రసంగంలో ఓ తురుపు ముక్కలా భావించాలి.

విచిత్రమైన కాంబినేషన్ ఏమిటంటే మన ఘనత వహించిన జ్యోతిష్యులు కూడా కెటిఆర్ మాదిరే కొందరు క్రికెట్ వరల్డ్ కప్ ఇండియాదేనని గంటా బజాయిస్తే, మరికొందరు కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కుతారని పక్కాగా చెప్పారు. నిజానికి జయాపజయాలకు ఎన్నో రకాల కారణాలు, వ్యూహాలు ఉంటాయి. రాశి ఫలాలు వాటిని నిర్ణయించ లేవు. ఈసారి ఎన్నికల్లో పోటీకి నిలబడిన సుమారు మూడు వేల మందిలో ఏ ఒక్కరిని ఏ ఒక్క సిద్ధాంతి నీ జాతకం ప్రకారం నీవు గెలువవు, ఎన్నికల్లో నిలబడడం అన్నిరకాల నష్టమే అని చెప్పలేదు. నిజంగా జ్యోతిష్యానికి అంత శక్తి ఉంటే నిలబడేవారి సంఖ్య, అనవసరపు ఖర్చు తగ్గేది. మరో కోణంలో ఆలోచిస్తే నిలబడే తాహతు ఉన్నవాడు తనను తాను పరీక్షించుకుంటాడు తప్ప ఎవరి మాట వినడు. మనిషి పూర్తిగా నమ్మని విషయాలను కూడా ఎందుకైనా మంచిది అని ఆచరించడంలోనే ఇలాంటి వారికి ఆస్కారం లభిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక విషయానికొస్తే సుమారు మూడు నెలలుగా జ్యోతిష్యుల ఛానళ్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నాయి. రాశి, నక్షత్రాలు అంటూ కొందరు, పేరుతో మొక్కి గవ్వలు విసిరి కొందరు, రాజకీయ అంచనాలను జోడించి కొందరు తమ తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏవేవో గతంలో కొందరికి జరిగినవి ఉదహరిస్తూ అవి తమ సూచనల వల్లే వారికి సంభవించాయని, తమ మాట పెడచెవిన పెట్టి కొందరు నష్టపోయారని అలా తమ నిర్ణయాలకు బలం చేకూరే మాటలు జోడిస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే దాకా కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి ఖాయమన్న వీళ్లే ఇప్పుడు ఇదేంటి స్వామి, కథ అడ్డం తిరిగింది అంటే ఏవో డొంక తిరుగుడు సమాధానాలతో దాట వేస్తున్నారు. గురు బలంగా ఉన్నా శని పొంచి ఉన్నాడని అప్పుడే చెప్పామని, దానికి శాంతి జరిపించకపోవడమే ఓటమికి కారణమని తేలిగ్గా తప్పించుకుంటున్నారు.

మూడోసారి భారాస గెలుపు ఖాయం కాని గ్రహాల రీత్యా సి కన్నా టి బలంగా ఉన్నందున కెటిఆర్ సిఎం అవుతారని ఒకరు అన్నారు. వారి ఛానళ్లలో క్రితం ఎపిసోడ్‌లో ఒకరి గెలుపు చెప్పి మరో ఎపిసోడ్‌లో దాని నిజానిజాల ప్రస్తావన లేకుండా రేవంత్ ఏ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే మంచిదో లెక్కలేయడం మొదలుపెడుతున్నారు. అంతేకాకుండా వారి యూ ట్యూబ్ పోస్టుల్లో గురువు గారు మీరు దైవ సమానులు. మీ జ్యోతిష్యం నూటికి నూరుపాళ్లు నిజమైంది అని వరుసగా కామెంట్లు ఉంటాయి. ఎవరు ఏమి అడగకున్నా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఆరంభించో లేక పేడ్ ఛానల్ వారి ద్వారానో కట్టుకథలు చెబుతూ కింద మొబైల్ నంబర్ ఇచ్చి బిజినెస్ చేసుకుంటున్నారు. నోరు విప్పితే పలు రంగాల్లోని పెద్ద మనుషుల పేర్లు తప్ప సామాన్యుల ప్రస్తావన ఉండదు.

మూడోసారి కెసిఆర్ తెలంగాణ సిఎం అవకపోతే జ్యోతిష్యం చెప్పడం ఆపేస్తా అన్న జ్యోతిష్యుడు ఇప్పుడు రేవంత్ పక్కన ఉన్నట్లు ఫోటోలు పెడుతున్నాడు. సోషల్ మీడియాలో జ్యోతిష్యుల అంచనాలు అన్ని తారుమారయ్యాయని నెటిజన్ల పోస్టులు మొదలయ్యాయి. ఏ జ్యోతిష్యుడి అంచనా వెదికినా అందరూ కెసిఆర్‌కు అనుకూలంగా చెప్పినవారే తప్ప కాంగ్రెస్‌కు తగిన మెజారిటీ వస్తుందని గాని, వస్తే ఫలానావాళ్లు సిఎం అవుతారని ఒక్కరు చెప్పలేదు. అయితే ప్రస్తుత పరిస్థితులను కొంత ఊహించి అంత బాగానే ఉంది గాని అన్నట్లు గోడ మీది వాటం ప్రదర్శించారు. ఫలితాలు ఎలా ఉన్నా తమకు కొంత సర్దుబాట్లు అవకాశం ఉండేలా మాటలున్నాయి. ముందు జాతకంలో బలముండాలి, తరవాత యోగముండాలి, అందుకు తగ్గ పూజలు చేయాలి, జ్యోతిష్యుడి మాట వినాలి, వీటిలో ఏది తప్పినా ఫలితం తారుమారవుతుందని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.

కొంత వెనక్కి వెళితే దేశంలో ఉన్న జాతక రత్నలు అందరూ రకరకాల లెక్కలేసి క్రికెట్ ప్రపంచ కప్ 2023లో భారత్ గెలిచి తీరుతుందని జోస్యం చెప్పారు. జగన్నాథశర్మ అనే పండిత్ ఇండియా, ఆస్ట్రేలియా క్రీడాకారుల జాతకాలు ముందేసుకుని ఒక్కొక్కరి గ్రహాలు ఎలా ఉన్నాయో చెబుతూ ఇండియాకు కప్ ఖాయమన్నాడు. ఆయనకు ఆస్ట్రేలియా వాళ్ల జాతకాలు ఎలా లభించాయో మరి. ఇండియా క్రికెటర్లు గిల్, కోహ్లీ, రాహుల్, షమీ, బుమ్రా రాశులు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయని సుమీత్ బజాజ్ అనే జ్యోతిషుడు అన్నాడు. ఇది వరకు సుమీత్ చెప్పిన క్రికెట్ జోష్యాలు 85 % నిజమయ్యాయని, ఆయన మాటలపై గురితో బెట్ కట్టి నష్టపోయామని జూదగాళ్లు తిట్టుకున్నారు.

ఎవరు ఏది చెప్పినా వారికి ఆయా రంగాల్లో వున్న అవగాహన, విషయ పరిజ్ఞానం తప్ప మరేదీ పని చేయదు. వేషభాషలతో జనాల్ని మోసగించి బతకడమే జ్యోతిష్యుల పని. దీన్ని వృత్తిగా స్వీకరించి ప్రాక్టీస్ చేస్తున్న వారిపై చట్టపర చర్యలుండాలి. అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని యూనివర్సిటీలలో ఆస్ట్రాలజీ పై కోర్సులకు అనుమతించింది. సర్టిఫికెట్ కోర్సు నుండి పిజి దాకా చదువొచ్చు. వాటిని పూర్తి చేసిన వారు జ్యోతిష్యులుగా, హస్తసాముద్రికులుగా. వైదిక గణికులుగా, న్యూమరాలిజిస్టులుగా వృత్తి చేపట్టవచ్చని కాలేజీ బ్రోచర్లలో ఉంది. నిరూపణ కాని విషయాన్ని శాస్త్రంగా పరిగణించడమే మొదటి తప్పు. ప్రభుత్వాలు తప్పులను పెంచి పోషిస్తే మంచి చెడుల విచక్షణ ఇక ప్రజల వంతే.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News