ప్రతిపక్షం బలంగా ఉన్నా, బలహీనపడిపోయినా, అసలు ప్రతిపక్షం లేకపోయినా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర నిర్వహించేది మీడియా. ప్రజా సమస్యల మీద గొంతెత్తే విషయంలో ప్రతిపక్షాలు, మీడియా రెండిటి బాధ్యత, పాత్ర ఒక్కటే. అందుకే ప్రముఖ పత్రికా సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు ‘పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు, పత్రికొక్కటున్న మిత్రకోటి’ అన్నారు. ఒక పత్రిక పదివేల సైన్యంతో సమానం అంటాడు. అలాగే ఒక పత్రిక ఉంటే కోటిమంది మిత్రులున్నంత బలం అంటాడు. ఆ పదివేల సైన్యం ప్రజల సమస్యలను పరిష్కరించడానికీ, ఆ కోటిమంది మిత్రులూ ప్రజల తరఫున నిలబడి పోరాడటానికీ అని నార్ల వారి అభిప్రాయం, అభిమతం కూడా.మామూలుగా ప్రభుత్వ వ్యవహార శైలిని మీడియా విమర్శనాత్మకంగా చూస్తుంది. తప్పొప్పులను బేరీజు వేస్తుంది. ప్రభుత్వాలు సరైన బాటలో నడిచే విధంగా సలహాలు, సూచనలు ఇస్తుంది. సహజంగానే అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పక్షాలకు మీడియా అవసరం పెద్దగా రాదు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీడియా గుర్తుకొస్తుంది. ఇదంతా ఒకప్పటి మాటేమో అనిపిస్తుంది. ఇప్పుడు అన్ని మారిపోయాయి. రాజకీయ పార్టీలు మీడియాను వేలుపట్టుకుని నడిపించే పరిస్థితి వచ్చింది. మీడియా ఏం చేయాలో రాజకీయ పక్షాలు చెప్పే పరిస్థితి దాపురించింది. అన్నీ తారుమారు, కలగాపులగం. రాజకీయాలకు, మీడియాకు మధ్య ఉండవలసిన సన్నటిగీత ఎప్పుడో చెరిగిపోయింది. ప్రతిపక్షం వైపు.. అంటే ప్రజల పక్షాన నిలబడవలసిన మీడియా అధికార పక్షాల తరఫున వకాల్తా తీసుకుంటున్న పరిస్థితి. అలాగే తమకు ఇష్టమైన మీడియా మీద ఈగ వాలితే కూడా సహించలేని స్థితి కొన్ని అధికార పక్షాలది. మొత్తానికి పరిస్థితి విచిత్రంగా తయారైంది.ప్రస్తుత పరిస్థితికొస్తే, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, అప్పటివరకూ ఉద్యమ సంస్థగా ఉన్న టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఓ రెండు చానళ్ళను 10 కిలోమీటర్ల లోతు గొయ్యి తవ్వి పాతి పెడతానన్నారు. ఆ దెబ్బతో ఆయన పార్టీ అధికారంలో ఉన్న దాదాపు పది సంవత్సరాల్లో మీడియా చాలావరకు భయభక్తులతోటే మెలిగింది.
అందుకు కారణం చాలావరకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన మీడియా సంస్థలు, వాటి కేంద్ర కార్యాలయాలన్నీ హైదరాబాద్‌లోనే ఉండడం, దాదాపుగా అవన్నీ ఆంధ్రప్రాంతంవారి యాజమాన్యంలోనే ఉండడం కావచ్చు. తెలంగాణ ఉద్యమకాలంలో ఈ మీడియా సంస్థలు మనస్ఫూర్తిగా ఉద్యమానికి అనుకూలంగా ఎప్పుడూ లేవు. పైగా ఉద్యమం విచ్ఛిన్నం కావాలని కోరుకున్నవే. అయితే మీడియా ప్రభావానికి ఏమాత్రం లొంగని అశేష తెలంగాణ ప్రజానీకం ఒక్క తాటిమీద నిలబడి కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. తెలంగాణ రాష్ట్రం రావడం, ఆ రాష్ట్ర సాధనకోసం ఉద్యమించిన పార్టీ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన వెంటనే కెసిఆర్ ఆ మీడియా సంస్థలను ‘ఖబడ్దార్ పాతిపెడతా’ అని హెచ్చరించడం కారణంగా, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలి కాబట్టి ఈ మీడియా యాజమాన్యాలన్నీ అణిగిమణిగి ఉన్నట్టే నటించాయి. మళ్లీ మాట్లాడితే పోటీలు పడి ప్రభుత్వానికి బాకాలుగా కూడా మారాయి.
గత పది సంవత్సరాల మీడియా వ్యవహారశైలి (బిహేవియర్) గనుక చూసినట్లయితే తెలంగాణలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించిన మీడియా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేసరికి ముఖ్యంగా గత ఐదేళ్లు, అక్కడి పాలక పక్షాన్ని ఎప్పుడు దింపేద్దామా అన్న పద్ధతిలోనే వ్యవహరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి లాగా కాకుండా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వాటి వ్యవహార శైలిని తీవ్రంగా దుయ్యబట్టడంవరకే పరిమితమై ఉండటం అందుకు కారణం. తెలంగాణలో ప్రభుత్వానికి అణిగిమణిగి ఉండకపోతే తమ వ్యాపారం సాగదని తెలుసు, తమ పప్పులు ఇక్కడ ఉడకవని తెలుసు. ఇక్కడ కూర్చొని ఆంధ్రలో ఉన్న సర్కారు మీద ఎన్ని అవాకులు చవాకులైన పేలవచ్చు. ఇప్పటివరకు జరిగింది ఇదే. ఈ మీడియా సంస్థలు కూడా రాజకీయ నాయకులకంటే ఏం తీసిపోలేదు. సమయంకోసం వేచి ఉన్నాయనుకోవాలి.ఆ సమయం రానే వచ్చింది. 2023లో తెలంగాణలో అధికారం మార్పిడి జరగడం, ఆ తరువాత ఆరు మాసాల్లోనే 2024లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికార మార్పిడి జరగడంతో ఈ మీడియా సంస్థలకు పట్టపగ్గాలు లేకుండా పోయింది.
ఒకటి రెండు మినహాయింపులు ఎక్కడైనా ఉండొచ్చు కానీ దాదాపుగా ఆంధ్ర ప్రాంతం వారి యాజమాన్యంలో ఉన్న మీడియా సంస్థలన్నీ అవి తెలుగు దినపత్రికలు కావచ్చు లేదా తెలుగు న్యూస్ ఛానళ్ళు కావచ్చు.. రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీలు భారత రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండిటి మీద తమ ప్రతాపం చూపించాలని నిర్ణయించినట్టు అర్థం అవుతున్నది. సంవత్సర కాలంగా అదే జరుగుతున్నది.సత్యాన్వేషణ లక్ష్యంగా ఉండాల్సిన మీడియా వ్యాపారంగా మారిపోయింది. సరే, అది ఒక అనివార్యత, అంగీకరించక తప్పదు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం అంతటా, ముఖ్యంగా జాతీయ మీడియాను చూసినా కూడా భారీ పెట్టుబడులతో, అధిక వ్యయంతో కూడుకున్నది కాబట్టి ఇది వ్యాపారంగానే మారింది. కనీస వ్యాపార నీతిసూత్రాలను కూడా గాలికి వదిలేసి అధికారానికి దాసోహం అనే విధంగా తయారయింది మీడియా. అక్కడివరకే అయితే బాగుండేది. వ్యాపార ప్రయోజనాలకోసం, సంపాదనకోసం మాత్రమే అర్రులు జాస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం మీడియాతో వచ్చిన సమస్య ఏమిటంటే పూర్తిగా రాజకీయరంగులు ఒంటినిండా పులుముకోవడం. జాతీయ స్థాయిలో మీడియా చూడండి.. ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని మినహాయింపులు ఉండవచ్చు కానీ మెజారిటీ మీడియా సంస్థల్ని విమర్శకులు ముద్దుగా ‘గోదీ మీడియా’ అని పిలుచుకుంటున్నారు. గోదీ మీడియా అంటే అధికార పక్షాల ఒళ్లో కూర్చొని వాళ్ళు చెప్పింది రాయడం, రాసిచ్చిందే చదవడం అని అర్థం.
రెండు తెలుగు రాష్ట్రాల దగ్గరికి వచ్చేసరికి మీడియా జాతీయ స్థాయిలో లాగా కాకుండా అధికారంలో ఎవరున్నా ఒక్క నాయకుడికోసమే పనిచేస్తూ ఉండటం. ఆ నాయకుడిని గద్దె నెక్కించడంకోసం తాపత్రయపడటం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏవిధంగా అయితేనేం ఆ కోరిక నెరవేరింది. అక్కడ జరుగుతున్న నిర్వాకం సరిపోలేదని ఆ నాయకుడిని తెలంగాణకు కూడా తెచ్చే ప్రయత్నంలో భాగంగానే మీడియా వ్యవహార శైలి ప్రస్తుతం ఉన్నదనే విమర్శలు ఎదుర్కొంటున్నది.
ఇటీవల తెలంగాణలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నాయని అనిపించక మానదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024లో అధికారంలోకి రాగానే మళ్ళీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కారణాలు ఏవైనా, 2015 తరువాత తెలంగాణలో ఆయన పార్టీ నిర్వీర్యం అయిపోయింది. 2018లో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి మళ్ళీ ఒకసారి తెలంగాణలోకి ప్రవేశించే విఫల ప్రయత్నం చేసారు. ఆయన నాయకత్వంలోని తెలుగుదేశంతో పొత్తు లేకపోతే ఆ ఎన్నికల్లోనే కాంగ్రెస్ తెలంగాణలో గెలిచి ఉండేదన్న మాటను కొట్టి పారేయడానికి వీలులేదు.
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే అక్కడ ఒక ఆంగ్ల దినపత్రిక కార్యాలయంమీద రాజకీయ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇటీవల ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక కార్యాలయాల మీద గుంపులుగుంపులుగా రాజకీయ కార్యకర్తలు దాడి చేసి ఒకే తరహాలో విధ్వంసానికి పాల్పడ్డారు. మీడియా మీద దాడి జరిగినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వంలోని పెద్దలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు ఈ రెండు సందర్భాలలో.తాజాగా తెలంగాణలో ఒక టివి చానల్ కార్యాలయం మీద కొందరు రాజకీయ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దలంతా ఆగమేఘాల మీద స్పందించారు. ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుమారుడయిన మరో ప్రముఖ మంత్రి ఆ దాడిని ఖండించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని మీడియా సంస్థలకూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీకి మధ్య ఉన్న సంబంధం ఇక్కడే అర్ధం అవుతున్నది. మీడియా మీద భౌతిక దాడులను ఎవరయినా ఖండించాల్సిందే. కానీ ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయనే విషయం విస్మరించడానికి వీలు లేదు కదా.
కొద్ది మాసాలక్రితం రైతునని చెప్పుకుని ఒక వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దుర్భాషలాడి, అవకాశం దొరికితే చంపేస్తానని బెదిరించిన సంఘటన అనంతరం మీడియా పేరుతో జరుగుతున్న వ్యక్తిత్వ హననం గురించి రాష్ట్రంలో పెద్దయెత్తున చర్చ జరిగింది. ఆ కేసులో ఇద్దరు మహిళలు అరెస్ట్ కూడా అయ్యారు. అప్పుడు ఎందుకో ఆంధ్రప్రదేశ్ పాలకులు నోరు మెదపలేదు.ఇప్పుడు ఇంతకూ ఈ మీడియా సంస్థ మీద దాడి ఎందుకు జరిగింది? ఏ విశ్వసనీయతా లేని సామాజిక వేదికలతో పోటీపడి, ఒక రాజకీయ నాయకుడిని అప్రతిష్ఠ పాలు చెయ్యడానికి కొందరు మహిళల పేర్లను అందులోకి లాగి సంచలనంకోసం నిరాధారమయిన వార్తలకు తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టినందున ఆ నాయకుడి అనుయాయులో, అభిమానులో దాడి చేసారు. దాడి తప్పే, మరి ఆ చానల్ చేసింది గొప్ప పనా? తమ ముఖ్యమంత్రి మీద, ఇతర పార్టీ నాయకుల మీద మీడియా పేరుతో ఇటువంటి అడ్డగోలు రాతలు, మాటలూ జరిగి ఎంతో కాలం కాకముందే ఆ విషయం మరిచిపోయి కాంగ్రెస్ మంత్రులు,
ముఖ్య నాయకులూ ఈ చానల్ కార్యాలయాన్ని సందర్శించి సానుభూతి తెలపడం ఏమిటి? హైదరాబాద్‌లో జరిగిన దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దలు స్పందించినట్టే మరి ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల మీడియా మీద జరిగిన దాడులను ఈ కాంగ్రెస్ మంత్రులు ఎందుకు ఖండించలేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయినా, ప్రతిపక్ష నాయకుడిని అయినా మీడియా పేరుతో వ్యక్తిగతంగా అప్రతిష్ఠపాలు చెయ్యడానికి ఎవరు ప్రయత్నించినా సహించి ఊరుకోడానికి వీల్లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘సెలెక్టివ్ రెస్పాన్స్’ తీరు గురించి అంటారా? దానిని బట్టి ఆయనకు, మళ్లీ తెలంగాణ రాజకీయాల్లోకి ఆయనను తీసుకురావడానికి తపన పడుతున్న అభిమాన మీడియాకు ఏం జవాబు చెప్పాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. మీడియా మీద జరిగిన దాడిని ఖండించాల్సిందే. అదే స్థాయిలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే కల్పిత కథనాలను కూడా అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిందే. అది జరుగుతుందా?