కింగ్‌స్టన్(జమైకా): ఆస్ట్రేలియాతో జరిగిన మూడో, చివరి టెస్టులో వెస్టిండీస్ అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే చాపచుట్టేసింది. ఆస్ట్రేలియాను 121 పరుగులకే ఆలౌట్ చేసిన విండీస్ 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పోయింది. కంగారూలను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఆనందం విండీస్ ఎక్కువ సేపు మిగలలేదు. ఆస్ట్రేలియా బౌలర్లు మిఛెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ చిరస్మరణీయ బౌలింగ్‌తో విండీస్‌ను 27 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా, ప్రపంచ టెస్టు చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 176 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 30తో క్లీన్ స్వీప్ చేసింది.
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు స్టార్క్ తన తొలి ఓవర్‌లోనే కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ ఓవర్‌లో స్టార్క్ మూడు వికెట్లను పడగొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన స్టార్క్ 15 బంతుల వ్యవధిలోనే ఐదు వికెట్లను పడగొట్టి నయా చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో మరే బౌలర్ కూడా ఇంత తక్కువ బంతుల్లో ఐదు వికెట్లను పడగొట్టలేదు. మొత్తం స్టార్క్ 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ నమోదు చేసి విండీస్‌ను తక్కువ స్కోరుకే కుప్పకూల్చడంలో తన పాత్రను పోషించాడు.
బోలాండ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికి జస్టిన్ గ్రీవ్స్ (11), తర్వాతి బంతికి షమర్ జోసెఫ్, మూడో బంతికి జొమెల్ వర్రికాన్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక స్టార్క్ జైడెన్ సీల్స్(0)ను ఔట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ 14.3 ఓవర్లలో 27 పరుగుల వద్ద ముగిసింది. స్టార్క్, బోలాండ్ ధాటికి ఆస్ట్రేలియా 87 బంతుల్లోనే 10 వికెట్లను కోల్పోయి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. విండీస్ టీమ్‌లో ఏడుగురు బ్యాటర్లు సున్నాకే పెవిలియన్ చేరడంతో విశేషం. కాగా ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లను తీసి విండీస్ పతనానికి శ్రీకారం చుట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 225, రెండో ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు ఆలౌటైంది. విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ రెండున్నర రోజుల లోపే ముగియడం విశేషం. ఇంతకుముందు జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా జయకేతనం ఎగుర వేసిన సంగతి తెలిసిందే.