Friday, March 29, 2024

దళిత సంస్కృత పండితురాలు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సంస్కృత అధ్యాపకురాలు, అంబేడ్కర్ వాద సామాజిక ఉద్యమకారిణి, మరాఠా రచయిత్రి అయిన కుముద్ పావ్డే 31 మే నాడు నాగపూర్‌లో మరణించారు. దేశ స్వాతంత్య్రానంతర తొలి దశాబ్దాల్లో మన సమాజంలో కొనసాగిన మహిళా, కుల వివక్షలను అనుభవిస్తూ ధీరత్వంతో వాటిని ఎదుర్కొన్న స్త్రీమూర్తి ఆమె. 1938లో మహారాష్ట్రలోని నాగపూర్‌లో మధ్యతరగతి దళిత మహర్ కులంలో జన్మించిన ఆమె అందరిలో కూచుని చదువుకునేందుకు ఎన్నో అవమానాలు చవిచూశారు. ఆ రోజుల్లో మానవ వ్యర్థాలను, మృతదేహాలను తొలగించడమే వృత్తిగా మహార్లు పని చేసేవారు. కుముద్ తండ్రి న్యాయవాద వృత్తిలో ఉన్నా దళిత బాలికగా పాఠశాలలో కూర్చునే చోటు, తాగే నీళ్ల విషయంలో ఆమె కు అమర్యాదలు తప్పలేదు. కుముద్ తల్లిదండ్రులు 14 అక్టోబర్ 1956 రోజున బాబాసాహెబ్ అంబేడ్కర్‌తో పాటు నాగపూర్‌లో దమ్మదీక్షలో పాల్గొని బౌద్ధమతాన్ని స్వీకరించారు.

ఆ కార్యక్రమాన్ని కుముద్ స్వయంగా చూశారు. ఆనాటి నుండి అంబేడ్కర్ అభిమానిగా మారిపోయారు.కుముద్ చదువుకునే రోజుల్లో నాగపూర్‌లో తన ఇంటికి సమీపంలో ఉన్న లైబ్రరీకి వెళ్లేవారు. అక్కడ అంబేడ్కర్ రచనలు చదువుతున్న క్రమంలో అంబేడ్కర్‌కు సంస్కృతం చదవాలని ఉన్నా అందుకు కేవలం వైదిక బ్రాహ్మణులకే అనుమతి ఉన్నందు వల్ల ఆ రోజుల్లో అది సాధ్యపడలేదని ఓ పుస్తకంలో ఆమె చదివారు. అప్పుడు కుముద్ 8వ తరగతిలో ఉన్నారు. ఆనాడు దళితుడన్న కారణంగా అంబేడ్కర్‌ను సంస్కృతంకు దూరంగా ఉంచారు. ఇప్పుడు స్వతంత్ర భారతంలో దళిత మహిళగా తాను సంస్కృతం నేర్చుకొని ఆయన ఆకాంక్షను నెరవేర్చాలని అప్పుడే ఆమె నిశ్చయించుకున్నారు. తన తండ్రితో చర్చించి చదువులో సంస్కృతాన్ని ఒక విషయంగా ఎంచుకున్నారు. ఆనాటి నుంచి ఆమెకు కూడా కష్టాలు మొదలయ్యాయి.

ఒక దళితురాలు సంస్కృతం నేర్చుకొనుట అనేది తండ్రి మినహా అందరూ వ్యతిరేకించారు. పాఠశాలలో సంస్కృత అధ్యాపకులు, విద్యార్థులు అందరు బ్రాహ్మణులే ఉండేవారు. క్లాసులో టీచర్లు, తోటి విద్యార్థులు ఏదో సాకుతో కొట్టేవారు. కొట్టి, తిట్టి ఎలాగైనా ఆమెను సంస్కృతం క్లాసుకు రాకుండా చేయాలని వారి పన్నాగం. ఎంత కష్టపెట్టినా ఆమె ఒక్క క్లాసును కూడా వదిలిపెట్టలేదు. చివరకు సంస్కృతంలో అందరికన్నా ఎక్కువ మార్కులు పొందారు. అదే పట్టుతో సంస్కృతంలో ఎంఎ పూర్తి చేశారు. అయితే సంస్కృత బోధకురాలిగా ఆమెకు ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలేవీ అవకాశాన్ని ఇవ్వలేదు. దళిత మహిళ సంస్కృతాన్ని చెబితే వినేందుకు బ్రాహ్మణ, ఇతర పైకులాల విద్యార్థులు ఇష్టపడరని ఆమె అభ్యర్థనను తిరస్కరించారు.ఉద్యోగ ప్రయత్నంలో రెండేళ్లు నిష్ఫలం కావడంలో కుముద్ ఆనాటి కేంద్ర కార్మిక మంత్రి బాబు జగ్జీవన్ రామ్‌కు తన బాధనంతా వివరిస్తూ లేఖ రాశారు.ఆ లేఖను చూసిన జగ్జీవన్ దానిని ఆనాటి ప్రధాని నెహ్రూకు అందజేశారు.

కొన్ని రోజులకు నెహ్రూ నుండి కుముద్‌కు ఉత్తరం వచ్చింది. వెంటనే వెళ్లి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శంకర్ దయాల్ శర్మ ని కలవమని అందులో ఉంది. ఖర్చులకు రూ. 250/- ప్రధాని నిధి నుండి అందజేశారు. అలా ఎంపిలో ఆమెకు అధ్యాపక ఉద్యోగం లభించింది. కుముద్ విషయం తెలిసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి వైబి చవాన్ ఆమెను సంస్కృతంలో పిహెచ్‌డి చేయమని ప్రోత్సహిస్తూ మహారాష్ట్రలోని అమరావతికి బదిలీ చేయించారు. తర్వాత నాగపూర్ యూనివర్శిటీలో ఆమె సంస్కృతంలో పిహెచ్‌డి కూడా పూర్తి చేసి నాగపూర్ కాలేజిలోనే ప్రొఫెసర్ గా చేరారు. ఆ తర్వాత ప్రభుత్వ విదర్భ కళాశాల, అమరావతిలో సంస్కృతం విభాగ అధిపతిగా చివరి దాకా పని చేశారు. నాగపూర్ యూనివర్సిటీ ఆమెకు సంస్కృత పండిత అనే అవార్డును ప్రదానం చేసింది. డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగానే ఆమెకు మోతీరాం పావ్డే ని కలిసే అవకాశం కలిగింది. పేద, దళిత పిల్లల కోసం ఒక క్రిస్టియన్ మిషనరీ సంస్థ నడుపుతున్న రాత్రి బడిలో ఆయన పాఠాలు చెబుతున్నారు.

అయితే ఆడపిల్లలకు చదువు చెప్పడానికి ఆడ టీచర్ కావాలని ఆ సంస్థ కుముద్‌కి ఆ పని అప్పగించింది. అలా కుముద్‌తో మోతిరాం పావ్డే తో పరిచయం ఏర్పడింది. అంతవరకు కుముద్ పేరు వెంట సొంకువార్ అనే ఇంటి పేరు ఉండేది. అది మహార్ల ఇంటిపేర్లలో ఒకటి. మోతిరాం కుంబి అనే వ్యవసాయిక వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవాడు. ఇద్దరి పరిచయం ప్రేమగామారి పెళ్ళికి దారి తీసింది. మోతిరాం తల్లిదండ్రులు వీరి పెళ్ళిని ఏమాత్రం అంగీకరించలేదు. పెద్దలనెదిరించి చేసుకున్న పెళ్లి వల్ల కుముద్‌కు భర్త కుటుంబం నుంచి చీత్కారాలే దక్కా యి. వారి పిల్లలను తాకేందుకు మోతిరాం తండ్రి ఇష్టపడలేదు. దళిత స్త్రీ అన్న వివక్షతో సాటి స్త్రీలు కుముద్‌ను నీళ్ల బావి దగ్గరికి రానీయపోతే మోతీరాం ఇతర మహిళలతో వరుసలో నిలబడి నీళ్లు తెచ్చేవాడట. చివరి రోజుల్లో కుటుంబంతో చేరువైన వారి సాంప్రదాయిక పండుగలకు కుముద్‌ని ఆహ్వానించేవారుకారట.
సామాజిక ఉద్యమకారిగా కుముద్ 1995 లో బీజింగ్‌లో, 2001లో డబ్లిన్ లో జరిగిన ప్రపంచ మహిళా సదస్సుల్లో పాల్గొని జాతి వివక్షపై ప్రసంగించారు.

అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘానికి చాలా కాలం అధ్యక్షురాలుగా ఉన్నారు. స్త్రీవాద పత్రికలకు సంపాదకురాలుగా పని చేశారు. పదవీ విరమణ తర్వాత ఆమె ‘అంతః స్ఫోట్’ అనే పేరుతో తన ఆత్మకథను రాశారు. మరాఠీలో రాసిన ఆ రచన సంచలనాత్మక ఆదరణ పొంది కుముద్‌ని రచయిత్రిగా నిలబెట్టింది. తన జీవన పర్యంతం అడుగడుగునా ఎదుర్కొన్న దళిత వివక్షను వాస్తవ సంఘటనలను ఈ పుస్తకంలో ఉదహరించారు. ‘నేను పియర్స్ సబ్బుతో స్నానం చేసేదానిని. మా తల్లి కమనియా బ్రాండ్ తల నూనెను వాడేది. మా బట్టలు రోజూ ఉతికి ఉండేవి. మా ఇల్లు వారి ఇంటి కన్నా శుభ్రంగా ఉండేది. అయినా ఇతర కులాల పిల్లలు నా పక్కన కూచోడానికి ఎందుకు ఇష్టపడక పోయేవారో చిన్నప్పుడు అర్థం కాకపోయేది’ అని ఓ చోట రాసుకున్నారు. తాను ఉద్యోగంలో చేరడం, తద్వారా ఉన్నత పదవులు నిర్వహించడం అంతా తాను పై కుల వ్యక్తి భార్యగా, పావ్డేగా మారినాకే సుగమమైనాయి. ‘సొంకువార్’ గానే ఉండి ఉంటే సాధ్యపడక పోయేదేమో అనే వేదనని కూడా ఆత్మకథలో ఆమె వ్యక్తపరిచారు. ఇందులో ‘నా సంస్కృతం కథ’ అనే అధ్యాయం బహు చర్చితమైనది.

దీనిపై పలు వేదికలపై చర్చలతో పాటు వివిధ పత్రికల్లో వ్యాసాలు కూడా వచ్చాయి. కుముద్ మరణవార్త తెలియగానే అమెరికా తెలుగు కవి అఫ్సర్ ‘తన క్లాసులో భారతీయ ధార్మిక రచనలు అనే అంశంపై బోధన జరిగినపుడు పై అధ్యాయాన్ని ప్రముఖంగా ప్రస్తావించుకున్నామని’ స్మరించుకున్నారు. మృతభాష అని విమర్శిస్తూ, ప్రస్తుతం వాడుకలో లేని పురాతన భాషను నేర్చుకొని ఇప్పుడేమి చేస్తావు అని ఎందరో నిరుత్సాహ పరచినా సంస్కృతానికి ఉన్న కట్టుబాట్లను ఛేదించాలనే పట్టుదలతో ఎదురీది లక్ష్యాన్ని అందుకున్న ‘దళిత సంస్కృత పండిత’ కుముద్ సొంకువార్ పావ్డే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News