Sunday, September 15, 2024

గాయాలు చేసి అఘాయిత్యం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : వైద్యురాలి శరీరంపై 14 చోట్ల గాయాలున్నాయని శవ పరీక్షలో గుర్తించినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బలవంతంగా లైంగిక చర్య జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని, దీని కారణంగా ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయం జరిగినట్టు ఆ నివేదికలో ఉంది. ఊపిరితిత్తుల్లో ఎక్కువ మొత్తం రక్తస్రావం జరిగినట్టు పోస్ట్‌మార్టమ్‌లో గుర్తించారు. సంఘటన సమయంలో నిందితునితో విపరీతంగా ఆమె పోరాడి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. నిందితుడు సంజయ్ రాయ్‌కి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు అతడి శరీరంపై గోళ్లతో రక్కిన గుర్తులు కన్పించాయని, బాధితురాలి మృతదేహాన్ని పరిశీలించగా, ఆమె గోళ్ల లోని చర్మం, రక్త నమూనాలు నిందితుడి నమూనాలతో సరిపోలినట్టు తెలుస్తోందని అధికార వర్గాలు వెల్లడించినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లనే ఆమె మృతి చెందినట్టు పోస్ట్‌మార్టమ్ నివేదికలో పేర్కొన్నారు. బాధితురాలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో నిందితుడు ఈ దాడికి పాల్పడి ఉంటాడని నివేదికలో వెల్లడించినట్టు తెలుస్తోంది.

అక్రమాలపై నిలదీసినందుకే హత్యాచారం?
స్థానిక ఆర్‌జి కార్ ఆసుపత్రి అక్రమ మందుల వ్యాపారం, బదిలీల లంచాల చివరికి అవయవాల అమ్మకాల కేంద్రంగా ఉన్నట్లు వెల్లడైంది. లేడీడాక్టర్ హత్యాచారానికి ఇక్కడి అక్రమాలకు లింక్ ఉన్నట్లు ప్రాధమికంగా గుర్తించారు. ఈ డాక్టరు తరచూ ఈ అక్రమాలపై తరచూ వివిధ వేదికల ద్వారా ప్రశ్నించారు. దీనితోనే కొన్ని శక్తులు ఆమెపై కక్షతో ఈ విధంగా డ్యూటీలో ఉన్నప్పుడు చిత్రవధకు గురి చేసినట్లు ప్రాధమికంగా తెలుస్తోందని వెల్లడించారు. ఇక్కడ కోట్లాది రూపాయల విలువ చేసే అక్రమ లావాదేవీలు సాగినట్లు గుర్తించారు. భారీ స్థాయి కుంభకోణంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారుల హస్తం కూడా ఉందని కనుగొన్నారు.

వైద్యురాలి మృతదేహాన్ని మొదట చూసిన సాక్షి వివరణ
వైద్యురాలి మృతదేహాన్ని మొదటిసారి చూసిన ఓ సాక్షి మీడియాతో మాట్లాడారు. “ సెమినార్ హాల్ లోని పోడియం వద్ద ఆమె విగతజీవిగా కన్పించింది. ఒంటిపై కుర్తా చిందరవందరగా చిరిగిపోయింది. ట్రౌజర్స్ కన్పించలేదు. మెడ నుంచి మోకాలివరకు నీలం రంగు బెడ్‌షీట్ కప్పి ఉంది. ఆమె ల్యాప్‌టాప్, నోట్‌బుక్, సెల్‌ఫోన్, వాటర్‌బాటిల్ పక్కనే ఉన్నాయి” అని ఆ సాక్షి ఓ జాతీయ మీడియాకు వివరించారు. సెమినార్ హాలులో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన ఆమె ఒంటరిగా ఉందని గ్రహించిన నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హత్యాచార సంఘటనకు గురైన 31 ఏళ్ల ట్రయినీ డాక్టర్ తండ్రి మరికొన్ని వివరాలు వెలుగు లోకి తెచ్చారు. తమ కుమార్తె డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని చెప్పారు. “ఆమె బ్యాగులో ఎప్పుడూ పర్సనల్ డైరీ ఉంటుంది. దాన్ని మేం ఎప్పుడూ చదవం. ఆస్పత్రి నుంచి వచ్చాక రోజూ మాతో అన్ని విషయాలు మాట్లాడుతుంది. అయితే సంఘటన తరువాత తన డైరీని చూస్తే అందులో ఓ పేజీ కొంత చిరిగి ఉంది. దానికి సంబంధించిన ఫోటో నావద్ద ఉంది”అని హతురాలి తండ్రి ఓ మీడియాకు వెల్లడించారు. ఆ పేజీలో ఏమున్నదో చెప్పడానికి ఆయన అంగీకరించలేదు. ఈ విషయాలను బయటకు వెల్లడించవద్దని సంయమనం పాటించాలని సిబిఐ సూచించినట్టు ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News