Tuesday, April 30, 2024

మోడీ లేకుంటే అయోధ్య రామాలయం లేదు: జాజ్ థాక్రే

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ లేనిపక్షంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి ఉండేది కాదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే శనివారం అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి బేషరతు మద్దతు ప్రకటించిన రాజ్ థాక్రే శనివారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ బిజెపి సారథ్యంలోని కూటమి సమన్వయం కోసం తమ పార్టీ నాయకుల జాబితాను తయారుచేస్తామని తెలిపారు.

బిజెపి, శివసేన(ఏక్‌నాథ్ షిండే), ఎన్‌సిపి(అజిత్ పవార్)లతో కూడిన మహాయుతి అభ్యర్థుల తరఫున ఎన్నికల్లో ప్రచారం చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. మహాయుతి తరఫున ప్రచారం చేయాలని తన పార్టీ నాయకులు, కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులను ఆదేశించానని, ఎంఎన్‌ఎస్ నాయకులకు తగిన గౌరవం లభిస్తుందని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి మే 20 మధ్య జరిగే ఐదు దశలలో ఎన్నికలు జరగనున్నాయి. అయోధ్య రామాలయ నిర్మాణం అంశం 1992 నుంచి పెండింగ్‌లో ఉందని, మోడీ లేకుండా ఉంటే ఇప్పుడు కూడా ఆలయ నిర్మానం జరిగి ఉండేది కాదని రాజ్ థాక్రే తెలిపారు.

కొన్ని మంచి విషయాలను ప్రశంసించక తప్పదని ఆయన చెప్పారు. ఒకపక్క అసమర్థ నాయకత్వం, మరోపక్క బలమైన నాయకత్వం ఉన్నాయని ఆయన అన్నారు. అందుకే మోడీని బలపరచాలని తాను నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. తాను మోడీకి మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న శివసేన(ఉద్ధవ్ థాక్రే)పై ఆయన మండిపడ్డారు. వారివి కామెర్ల కళ్లని ఆయన విమర్శించారు. మహారాష్ట్రకు సంబంధించి తనకు కొన్ని డిమాండ్లు ఉన్నాయని, మరాఠీకి ప్రాచీన భాష హోదా, రాష్ట్రంలోని కోటల పునరుద్ధరణ వంటివి అందులో కొన్నని ఆయన చెప్పారు. గుజరాత్‌కు చెందిన మోడీకి ఆ రాష్ట్రమంటే ప్రేమ ఉండవచ్చని, కాని అదే తరహాలో ఇతర రాష్ట్రాలను కూడా చూడాలని రాజ్ థాక్రే సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News