Saturday, September 14, 2024

అయ్యోధ్య విల్లాలు

- Advertisement -
- Advertisement -

ప్రైమార్క్ నిర్మాణ సంస్థ ఆక్రమణలతో బాబ్బాకాన్ చెరువు కట్టు కాలువ కనుమరుగు
గ్రామస్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు 
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో నీట మునిగిన అయోధ్య విల్లాలు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపం గా మారుతుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి దుండిగల్ మున్సిపాలిటీ బహదూరపల్లిలోని అయోధ్య విల్లాలు నీట మునగడంతో సుమారు 93 విల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలకు గురయ్యారు. ప్రైమార్క్ నిర్మాణ సంస్థ బాబ్బాకాన్ చెరువు కట్టు కాలువను కబ్జా చేసి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడంతో సమస్య ఉత్పన్నమైంది.

ప్రైమార్క్ నిర్మాణ సంస్థ బాబ్బాకాన్ చెరువు కట్టుకాలువను ఆక్రమించి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడంతో కట్టుకాలువ కనుమరుగు ఫిర్యాదులపై తేరుకున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జులై నెలలో ఉమ్మడి సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించి సంవత్సరం కాలం గడిచినా చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. కట్టుకాలువ కబ్జాతోనే బాబ్బాకాన్ చెరువు అలుగు, తూము ప్రవాహం ప్రధాన రహదారిని  ముంచెత్తుతుందని, లోతట్టు ప్రాంతాలు నీటి మునుగుతున్నట్లు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కబ్జాతో కట్టు కాలువ మాయం
దుండిగల్ మున్సిపాలిటీ బహదూరపల్లిలో బిల్డర్ సాంబశివరావు 182,183, 184,186, 188, 189, 191, 192,193,208,210 సర్వే నంబర్లలో 2019లో 5 ఎకరాల 1 గుంటలో ప్రైమార్క్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో హెచ్‌ఎండీఏ అనుమతి పొందాడు. నిబంధనల ప్రకారం ఎటువంటి డివియేషన్ ఉండరాదు. కానీ బహదూరపల్లిలో నిర్మిస్తున్న ప్రైమార్క్ నిర్మాణదారుడు ఏకంగా పంటపొలాలకు పారే కట్టు కడలువను 9 గుంటలు చెరబట్టి దర్జాగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు తెరలేపాడు. దీంతో పంట పొలాలకు పారే కట్టుకాలువను పూడ్చి నిర్మాణాలు చేపడితే పంటపొలాలు నీరు పారే అవకాశం ఉండదంటూ వాటిని అరికట్టాలంటూ అప్పట్లో ఇరిగేషన్ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు.

రైతుల ఫిర్యాదులు పట్టించుకోకపోగా కాసులకు కక్కుర్తి పడిని ఇరిగేషన్, రెవెన్యూ, స్థానిక మున్సిపల్ అధికారులు సదరు నిర్మాణ సంస్థకు సహకరించారని ఆరోపణలు వినిపించాయి. కట్టు కాలువ కబ్జాతో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. కబ్జాకు గురైన కట్టుకాలువపై హైడ్రా అధికారులు దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలంటూ ప్రజలు కోరుతున్నారు.

కబ్జాతో నెమలిగుట్ట వరదకాలువ కనుమరుగు
బహదూరపల్లిలోని నెమలిగుట్ట నుండి బాబ్బాకాన్ చెరువుకు ప్రవహించే వరద కాలువను స్థానిక నాయకుని సహకారంతో ఓ నిర్మాణదారుడు పూడ్చి వేయడంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరద ప్రవాహం ప్రధాన రహదారిపై ప్రవహిస్తుండడంతో భారీగా ట్రాఫిక్ జామై వాహనదారులు నానా అవస్థలు పడుతున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదు. నెమలిగుట్ట కబ్జాపై మున్సిపల్, ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఫిర్యాదు చేసిన మాపై అధికారులు కేసులు నమోదు చేశారని స్థానిక కౌన్సిలర్ భరత్‌కుమార్ అధికారుల తీరుపై మండిపడ్డాడు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News