Tuesday, December 10, 2024

ఆరు గ్యారంటీల అమలుకు పదివేల రోజులైనా సరిపోవు:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు పది వేల రోజులు కూడా సరిపోవని, అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపైనా, ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోడీ చేసిన విమర్శలకు ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన బండి సంజయ్ తనదైన శైలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్విట్టర్ వేదికగానే శనివారం గట్టి కౌంటర్ ఇచ్చారు. మీ గ్యారంటీలకు షరతులు వర్తిస్తాయని తెలంగాణ అమాయక ప్రజలకు తెలియదని, ఆరు హామీలు నెరవేర్చడానికి వంద రోజులు కాదని, పదివేల రోజులు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవాస్తవ హామీలతో రాష్ట్రాన్ని,

ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయని, కేసీఆర్ కొత్తగా పుట్టిన బిడ్డపై రూ.1 లక్ష అప్పు వేసినట్లే మీరు కూడా ప్రతి తెలంగాణ వ్యక్తి తలపై రూ.2.5 లక్షల అప్పులు చేస్తారని ఆరోపించారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని, రైతు భరోసా, రూ.500 బోనస్ బోగస్ అయ్యిందని విమర్శలు చేశారు. రూ.500 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌లో అర్హులైన లబ్ధిదారులు మిగిలిపోయారనిఅన్నారు. మూసీ ప్రాజెక్ట్ కోసం మీ వద్ద రూ.1.5 లక్షల కోట్లు ఉన్నాయి గానీ, ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి డబ్బు లేవని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం తరహాలో మరో ఏటీఎంగా మూసీ రూపుదిద్దుకోనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రధాని ఆవాస్ యోజన కింద మేం ఇళ్లు నిర్మిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూలుస్తోందని అన్నారు. హాస్టళ్లలో నాసిరకం ఆహారంపై విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం విద్యార్థులు నిరసనలు ప్రారంభించారని తెలిపారు.

అలాగే అసెంబ్లీలో, ఎన్నికల ముందు విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్ పెద్ద జోక్ అని దుయ్యబట్టారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఆలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడంలేదని, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని పలు ఆరోపణలు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం పక్కన పెడితే మునుపెన్నడూ లేని విధంగా విధ్వంసం చేసి అంధకారంలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. మీరు ఆరు హామీలను అమలు చేశారని నిజంగా విశ్వసిస్తే, పాదయాత్రలో పాల్గొనాలని, ప్రజల కోసం వెళ్లి నిజానిజాలు తెలుసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News