Wednesday, March 22, 2023

బిసి జనాభాను లెక్కించాల్సిందే!

- Advertisement -

1931 తర్వాత ఎస్‌సి, ఎస్‌టి మినహా కులాలవారీగా జనగణన చేపట్టలేదు. ఏదిఏమైనా ఒబిసిల జనాభాపై ఇప్పటి వరకు అంచనాలే తప్ప ఒక క్లారిటీ అంటూ లేదు. దీంతో మొత్తం జనాభాలో ఒబిసిల శాతం ఎంత అనేది ఒక అంచనాగానే మిగిలిపోతోంది. ఈ పరిస్థితుల్లో బిసిలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కుల గణన జరిగితే బిసిలకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దేశ వ్యాప్తంగా కులాలవారీ జనగణనను జరిపించి ఎవరు నిజంగా వెనుకబడి వున్నారో, ఏ సామాజిక వర్గానికి సర్కారు సాయం మరింతగా అవసరమో తేల్చాలని జనతా దళ్(యు), ఆర్‌జెడి తదితర పార్టీలు కోరుతున్నాయి.

వెనుకబడిన తరగతుల ఛాంపియన్‌గా మరోసారి నిలిచారు బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అగ్రనేత నితీశ్ కుమార్. బీహార్‌లో కులాలవారీ జనగణనను చేపట్టారు. బిసి సమస్యల పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్పే బిజెపి నాయకులు పాలిస్తున్న ఏరాష్ట్రం తీసుకోని సాహసోపేత నిర్ణయాన్ని నితీశ్ కుమార్ ప్రభుత్వం తీసుకుంది. బిసిల విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది బీహార్. ఈనిర్ణయంతో నితీశ్‌కుమార్ దేశవ్యాప్తంగా బిసిల జేజేలు అందుకుంటున్నారు.మన దేశంలో 1931లో కులాలవారీ జనాభా లెక్కల సేకరణ జరిగినట్లు ఆధారాలున్నాయి. ఆ తరువాత మళ్ళీ కొన్నిప్రయత్నాలు జరిగాయి. కానీ బిసిల జనాభాను లెక్కించే ప్రయత్నాలేవీ వర్క్‌అవుట్ కాలేదు. తాజాగా బీహార్‌లో రెండు దశల్లో కులాలవారీ జనాభా లెక్కలను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో మూడో అతి ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రమైన బీహార్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వమే కులగణనకు ముందుకు రావడం అంటే చిన్న విషయం కాదు.కులాలవారీ జనగణన కోసం రూ.500 కోట్లు కేటాయించి నితీశ్ కుమార్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది.

వాస్తవానికి కులాలవారీ జనగణనను దేశవ్యాప్తంగా జరిపించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. యుపిఎ హయాంలో బిజెపి కూడా ఈ డిమాండ్‌ను బలపరచింది. అయితే అధికారానికి వచ్చిన తరువాత సదరు డిమాండ్ ను అటకెక్కించింది.పార్లమెంటులో ఒబిసి బిల్లు ఆమోదం సందర్భంగా కులాల ఆధారంగా జనాభా లెక్కలు తీయాలనే అంశం తెరమీదకు వచ్చింది. దీంతో బిసి నాయకులు స్పందించారు. అప్పట్లో నితీశ్ కుమార్ పార్టీ జెడి(యు) బిజెపితో దోస్తానాలో ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం పది రాజకీయ పార్టీల ప్రతినిధులను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. 2021లోనే కులాలవారీగా జనాభాను లెక్కించాలని కోరారు. ప్రధానిని కలిసిన ప్రతినిధి వర్గంలో నితీశ్‌కుమార్‌కు అప్పట్లో రాజకీయంగా బద్ద విరోధి అయిన తేజస్వి యాదవ్ కూడా ఉండటం విశేషం.

కులాల వారీగా దేశ జనాభాను లెక్కించడం అంటే చిన్న విషయం కాదు. ఇది చాలా సున్నితమైన వ్యవహారం. దీంతో ఈ డిమాండ్‌పై తొందరపడకూడదని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆచితూచి అడుగు వేయాలని భావించి ఉండొచ్చు. దీంతో ప్రస్తుతానికి రొటీన్ గా పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కింపును సకాలంలో పూర్తి చేయడంపైనే ఫోకస్ పెట్టింది. పార్లమెంటులో మంత్రి నిత్యానంద రాయ్ ఇదే విషయం చెప్పారు. ‘విధానపరంగా ఎస్‌సి, ఎస్‌టిలు మినహా కుల ఆధారిత జనాభా లెక్కలు ఇప్పటికైతే సేకరించరాదని కేంద్రం నిర్ణయం తీసుకొన్నద’ ని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

చాలా వ్యూహాత్మకంగా బిసిల లెక్కలు తీయకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసిందంటారు రాజకీయ విశ్లేషకులు. దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మేలు జరగాలన్నా కులాలవారీగా జనాభాను లెక్కించి తీరాల్సిందేనని బిసిల నాయకత్వంలో నడిచే ప్రధాన రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కులాలవారీగా లెక్కలు లేనట్లయితే తమ మేలు కోసం తీసుకువచ్చే చట్టాల అమలులో తీవ్ర ఇబ్బందులు ఉంటాయంటున్నారు బిసి వర్గాల నేతలు. జనాభాలో కులపరంగా, ఆర్థికంగా, చదువుపరంగా వెనుకబడిన కులాలు …

అంటే ఒబిసిలు 52% ఉంటారన్నది ఒక అంచనా. వీరికి కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్‌రంగ సంస్థల ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ గతంలోనే సిఫార్సు చేసింది. 1931లో చివరిసారిగా జరిగిన కుల గణన వివరాలను ఒబిసిల గుర్తింపునకు ప్రాతిపదికగా తీసుకుంది. అప్పటి నుంచి దేశంలో వివిధ కులాల శాతాలను కచ్చితంగా లెక్కగట్టాలనే డిమాండ్ బలం పుంజుకొంది. అయినా 2001, 2011 జనాభా లెక్కల్లో కులాల వారీగా లెక్కించడానికి కేంద్రం అంగీకరించ లేదు.

కులాలవారీగా జనాభా లెక్కలు తీయడంలో బిజెపి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. 2010లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా బిసి జనాభా కులాలవారీగా లెక్కలు తీయాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి పార్లమెంటులో డిమాండ్ చేసింది. దీనికి స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం కులాల వారీగా లెక్కలు తీయడానికి అంగీకరించింది. అప్పటికే జనాభా లెక్కల ప్రక్రియ మొదలైంది. దీంతో ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి కులాలవారీ జనాభా లెక్కలను తీశారు. అయితే రకరకాల కారణాలతో ఈ వివరాలు బయటకు రాలేదు. అయితే ప్రస్తుతం అధికారంలోఉన్న బిజెపి సర్కార్, బిసి నాయకుల డిమాండ్‌పై ఉదాసీన వైఖరి తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

పార్లమెంటులో వెనుకబడిన తరగతుల జనాభా లెక్కింపు అంశం తెర మీదకు వచ్చినప్పుడు ఇప్పటికిప్పుడు కులాల వారీగా జనాభాను లెక్కించలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వెనుక రాజకీయ కారణాలున్నాయంటున్నారు సోషల్ సైంటిస్టులు. అప్పట్లో బిజెపి ముందు చాలా ఒత్తిళ్లున్నాయి. అప్పటికి అయిదారు నెలల్లో దేశంలోనే అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో జరుగుతున్న ఆందోళనలతో బిజెపికి అప్పటికే తలబొప్పికట్టింది. ఈ నేపథ్యంలో అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకూడదని బిజెపి ఒక నిర్ణయం తీసుకుందని ఢిల్లీ రాజకీయ వర్గాల కథనం. యుపిలో సిద్ధాంతాల రాద్ధాంతాల కంటే కులాల కుంపట్లే ఎక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజెపి అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా ఒబిసిల మద్దతు అవసరం. కులాలవారీగా జనాభా లెక్కల సేకరిస్తే అది హిందువుల ఓట్లలో చీలిక వస్తుందన్న భయం బిజెపికి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మత రాజకీయాలతో మెజారిటీ జనాభాను తనవైపునకు తిప్పుకున్న బిజెపి, హిందూ ఓటు బ్యాంకును చీల్చుకోవడానికి ఇష్టపడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కులాలవారీ జనాభా లెక్కలపై స్పష్టత లేకపోవడంతో వెనుకబడిన తరగతులు బాగా నష్టపోతున్నాయన్నది వాస్తవం. బిసి జనాభాకు చెందిన లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయంటున్నారు సోషల్ సైంటిస్టులు. ఈ లెక్కలు లేకపోవడం వల్లనే రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు కొట్టి వేస్తున్నాయి. జనాభా లెక్కలు సమగ్రంగా లేకపోవడంతో రిజర్వేషన్లను ఏ మేరకు నిర్ణయించాలనే అంశంపై బిసి కమిషన్లు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బిసిలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. జనాభా గణనలో బిసిల కులాలవారీగా లెక్కలు తీయాలి. 2012లో పేదరికం సర్వే కోసం కులాలవారీ లెక్కలను కేంద్రం సేకరించింది. అయితే ఈ వివరాలను ఇప్పటి వరకు బయటపెట్టలేదు. 1931 తర్వాత ఎస్‌సి, ఎస్‌టి మినహా కులాలవారీగా జనగణన చేపట్టలేదు. ఏదిఏమైనా ఒబిసిల జనాభాపై ఇప్పటి వరకు అంచనాలే తప్ప ఒక క్లారిటీ అంటూ లేదు.

దీంతో మొత్తం జనాభాలో ఒబిసిల శాతం ఎంత అనేది ఒక అంచనాగానే మిగిలిపోతోంది. ఈ పరిస్థితుల్లో బిసిలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కుల గణన జరిగితే బిసిలకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దేశ వ్యాప్తంగా కులాలవారీ జనగణనను జరిపించి ఎవరు నిజంగా వెనుకబడి వున్నారో, ఏ సామాజిక వర్గానికి సర్కారు సాయం మరింతగా అవసరమో తేల్చాలని జనతా దళ్(యు), ఆర్‌జెడి తదితర పార్టీలు కోరుతున్నాయి. జనాభా లెక్కింపులే దేశ ప్రజల వెనుకబాటుతనాన్ని చూపించడానికి అద్దంలా పనికొస్తాయని బిసి నాయకులు చెబుతున్నారు.

ఎస్.అబ్దుల్ ఖాలిక్
6300174320

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News