Thursday, February 22, 2024

ఈ సంతోష సందర్భాన…

- Advertisement -
- Advertisement -

మాన్యశ్రీ పి.వి నరసింహారావు గారికి భారత రత్న ప్రకటించడం ఎంతో హర్షదాయకం. ఎన్నడో రావలసిన ‘భారత రత్న” పురస్కారం ఎన్నెన్నో కారణాల వల్ల రాకపోయినా చిట్టచివరికి ఈ రోజు (9/2/2024) ప్రకటితం కావడం ఆయన కుటుంబ సభ్యులకు, అశేష అభిమానులకు అత్యంత ఆనందదాయకమైన విషయం. ఈ ఆనందపు ఘడియల్లో ఆయనకు కొందరు కావాలని ఆపాదించిన అపకీర్తి అంతా పటాపంచలైపోయింది. పి.వి. గారిది స్వచ్ఛమైన మనసు. నటనలు, అబద్ధాలు తెలియని మనిషి. కీర్తి కోసం పాకులాడే మనిషి కాదు. నిక్కమైన, నిఖార్సయిన సెక్యులర్. ఆయన నెహ్రూ గారికి వీరాభిమాని. అయినా కొందరు ఈర్షాపరులు పనిగట్టుకొని ఆయనను కళంకితుణ్ణి చేశారు. ఆలస్యమైనా సత్యమే గెలిచిందని సంబరపడుతున్నాను అందరి అభిమానులతో పాటు.

శ్రీ పి.వి. నరసింహరావు గారి వివాదతీత విశిష్ట వ్యక్తిత్వం, అపారమైన పరిపాలనానుభవం, మూర్తీభవించిన సౌజన్యం, శేఖరీభూతమైన శేముషీ వైదగ్ధం, అసాధారణ వైదుష్యం, నిష్కళంక రాజకీయ చరితం, నిస్వార్థనిరతి, నిశ్చలమైన నిద్దపు నిజాయతి, నిర్మలమైన నిరాడంబరత, చెక్కుచెదరని చిత్తశుద్ధి మొదలైన విశిష్ట గుణాలే ఇక్కడ ముఖ్యమ్రంతి పదవిని, అక్కడ ప్రధాన మంత్రి పదవిని తెచ్చి పెట్టాయనేది యధార్థం. ఇటు తెలుగు తల్లికి, అటు భారత మాతకు సేవజేసిన సేవధి, భాగ్యశాలి. సమర్థుడైన సచివుడిగా, సహృదయుడిగా, సచ్ఛీలుడిగా, సత్పురుషుడిగా, సౌమ్యుడిగా, సాహితీవేత్తగా, అసాధారణ ప్రజ్ఞాధునిగా, అసదృశ విజ్ఞానఖనిగా, మేధావిగా, బహుభాషా కోవిదుడిగా, రాజనీతి దురంధరుడిగా, విద్యావేత్తగా, వినయమూర్ధన్యుడిగా, వివేక చూడామణిగా, ఉత్తమవాజ్మగా, అమితశ్రద్ధాళువుగా, సమయస్ఫూర్తీ, ఔచిత్యమూ ఎరిగిన సరస సంభాషణ చతురుడిగా, స్థితప్రజ్ఞుడిగా సర్వుల ప్రశంసలందుకున్న సహస్ర ప్రతిభాసాకారుడు.

పి.వి. గారు తాను తలపెట్టిన ఆర్థిక సంస్కరణలు సంపూర్ణంగా విజయవంతం కావాలని, అధోగతిలో వున్న దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ఎంతో చిత్తశుద్ధితో కోరుకున్నాడు. అందుకు దేశంలో శాంతి భద్రతలకు ఏ మాత్రం విఘాతం కలగకూడదని, ఎంతో జాగరూకతతో వ్యవహరించాడు. ఒకవైపు పంజాబ్‌లో వేర్పాటువాదం జడలు విప్పినా, కశ్మీర్‌లో ఉగ్రవాదులు చెలరేగుతున్నా వాటిన్నిటినీ సమయస్ఫూర్తితో, సంకల్పశుద్ధితో చక్కదిద్దిన రాజనీతిజ్ఞుడు. ఆయన ఎంతో చిత్తశుద్ధితో బాబ్రీమసీదు చెక్కు చెదరకుండా వుండాలని, దాని పక్కనే మందిర నిర్మాణం జరగాలని ఎంతోగానో కోరుకున్నాడు. ఆ రకంగా సాధువులను, మహంతులను, రాజకీయ నాయకులను ఒప్పించుకున్నాడు. బాబ్రీమసీదు కూల్చివేతకు గురి అయినా, బాబ్రీ మసీదు పునర్నిర్మాణం జరగాలని, పక్కనే రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకొని ఆ దిశగా అడుగులు వేసినప్పటికీ కాలం మరో విధంగా తీర్పు చెప్పింది.

ఏమైనా ఈ విషయంలో ఆయన చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించరానిది. ఆయన ఆంగ్లంలో రాసిన ‘అయోధ్య డిసెంబర్ 6, 1992’ అనే పుస్తకం చదివితే నిజమేదో, ఆయన ఆంతర్యమేమిటో అవగతమవుతుంది. ఏమైనా ఆయన మరణ కాలంలో ఎంతో వేదనకు గురి అయ్యారు. ఆయన పార్థివ దేహం కూడా కనీస మర్యాదలు నోచుకోలేకపోయింది. అదంతా ఒక పీడకలు.
పి.వి. గారు సెక్యులర్‌గా తన జీవితాన్ని, అధికారాన్ని గడిపాడనడానికి ఒక దృష్టాంతం ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది. ప్రధానిగా ఆయన నేపాల్ పర్యటనకు వెళ్ళినపుడు ఉభయ దేశాలకు సంబంధించిన అనేక అంశాల విషయంలో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత చివర సీతాదేవి జన్మస్థలమైన జనక్‌పూర్ (మిథిల)లో ఒక ధర్మశాలను భారత దేశం కట్టించాలని అప్పటి నేపాల్ ప్రధాన మంత్రి గిరిజా ప్రసాద్ కొయిరాల కోరారు.

కాని భారత దేశం మతాతీత లౌకిక రాజ్యాంగానికి కట్టుబడి వుంది. కనుక ప్రభుత్వపరంగా కాక, తన వెంట వచ్చిన మీడియా సలహాదారు పి.ఎ.ఆర్.కె ప్రసాద్ గారు లోగడ తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) నేపాల్ ప్రభుత్వాధినేత కోరిన విధంగా తన నిధులతో ధర్మశాలను నిర్మించింది. పి.వి తన వ్యక్తిగత విశ్వాసాల కోసం ప్రభుత్వ హోదాను దుర్వినియోగం చేయకూడదని ప్రభుత్వపరంగా ఒక మతానికి సంబంధించిన విషయాల్లో నేరుగా జోక్యం చేసుకోవడం సరికాదనే విశ్వాసానికి కట్టుబడి జీవించిన వ్యక్తి. అటువంటి సచ్ఛీలుడికి అపకీర్తి ఆపాదించడం ఉద్దేశపూర్వకంగా చేసినదే తప్ప మరేమీ కాదు.ఇన్నేళ్ళ తర్వాత ఆయనకు రావలసిన ‘భారత రత్న’ రావడంతో అందరూ గతాన్ని మరిచిపోయి, పార్టీలకతీతంగా, సంకుచిత భావాలను, రాగద్వేషాలను విడనాడి, ఏ ఒక్కరూ దుర్వ్యాఖ్యానాలు,

దుర్భాషలు చేయకుండా ఆయన నిక్కమైన నిర్మల చరితను స్మరించుకోవడమే ఆయనకు అర్పించే నిక్కమైన నివాళి సార్థకమవుతుంది. ఆయన నిష్కళంక రాజకీయ చరిత్ర మీద మరింత లోతైన పరిశోధనలు జరిగి సత్యావిష్కరణ జరగాలని ఆయన జీవిత చరిత్రకారుడిగా నిండు మనస్సుతో కోరుకుంటున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News