‘చెప్పడంతో సరిపోదు రొప్పడం రావాల’ని తెలంగాణ సామెత! గట్టుమీద కూర్చొని, ‘అలా కాదు ఇలా…’ అని చెప్పడం ఎవరికైనా వచ్చేదే, మట్టిలోకి దిగి గుంటుక రొప్పడం వస్తేనే వ్యవసాయం ముందుకు సాగుతుందని సామెత అర్థం. ఇతర పార్టీలను వేదిక చేసుకొని, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పికె) ఇన్నాళ్లు పన్నిన వ్యూహ రచనలు, వాటిని అమలు చేయించడం, వైఫల్యాల్ని వదిలేసి సత్ఫలితాల్ని భుజాలకెత్తుకోవడం వేరు! సొంత పార్టీని ఎన్నికల సమరంలో నడుపుతూ, ప్రజామద్దతుతో స్వయంగా ఫలితాలు సాధించాల్సిన ప్రస్తుత పరిస్థితి వేరు! బీహార్ రాజకీయ తెరమీద కొత్త అంశాల్ని లేవనెత్తి, చర్చకు పెట్టి, మీడియా దృష్టినాకర్శించడం వరకు సఫలీకృతమైన పికె జనాదరణ పొందేనా? ఎన్నో రాజకీయ ఆటుపోట్లనెదుర్కొని రాటుదేలిన బీహార్ ఓటర్ మనసు దోచుకోగలరా? రెండు బలమైన రాజకీయ కూటములు ఎన్‌డిఎ, మహాఘట్‌బంధన్‌ల పోటీని తట్టుకొని బీహార్‌లో ఆయన నెగ్గుకురాగలరా? ఇవీ అత్యధికుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. అది బీహార్ కనుక ఆసక్తి దేశవ్యాప్తంగా ఉండటం సహజం!
రాజకీయాలను తెరవెనుక నడిపించే వ్యూహకర్తలు ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలోకి దిగడంతో త్వరలో జరిగే బీహార్ శాసనసభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భారత రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో సుపరిచితుడైన ప్రశాంత్ కిశోర్ (పికె) ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌సురాజ్ పార్టీ (జెఎస్‌పి) రూపంలో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బలమైన కూటములుగా ఉన్న అధికార బీహార్, జెడి(యు) పార్టీతో కూడిన ఎన్‌డిఎ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్‌జెడి పార్టీలతో కూడిన మహాఘట్‌బంధన్ బీహార్‌లో పోటాపోటీగా తలపడుతుంటే మూడో శక్తిగా జెఎస్‌పి రంగంలోకి దిగుతోంది. విడివిడిగా కూటములుగా బీహార్ సుదీర్ఘ గమనంలో తలపండిన పార్టీల రాజకీయాల ముందు..
పార్టీగా ఆవిర్భవించి సంవత్సరం కూడా పూర్తి చేసుకోని జెఎస్‌పికి ఏమేరకు ప్రజాదరణ లభిస్తుందో రానున్న శాసనసభ ఎన్నికల్లో తేలిపోతుంది. బీహార్‌లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక తదేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పెద్ద వివాదాన్నే రేపుతోంది. సుమారు 60 నుంచి 70 లక్షల ఓట్ల (చనిపోయిన, వలసపోయిన, బహుళ ఓట్లున్న వారి) వివాదమిది! పాలకులకు అనుకూలంగా లక్షలాది ఓట్లను తొలగిస్తున్నారనే ఆరోపణలతో, ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తే ఎన్నికల్ని బహిష్కరిస్తామని కూడా ఆర్‌జెడి బెదిరించే స్థితి తలెత్తింది. ఎన్నికల సంఘం మాత్రం తనపని తాను చేసుకుపోతోంది. దీని ప్రభావం ఎన్నికలు, ఫలితాలపైన ఎలా ఉంటుందో చూడాలి.
దేశంలో ఎన్నికల వ్యూహకర్తగా విజయవంతమైన ట్రాక్ రికార్డు ఉన్న పికె, స్వయంగా తానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేందుకు సొంత రాష్ర్టం బీహార్‌ను ప్రయోగాత్మకంగా ఎంచుకున్నారు. భారత్‌లో నరేంద్ర మోడీ, ప్రశాంత్ కిశోర్ ఇద్దరి పేర్లు ఒకేమారు సంచనలం అయ్యాయి. దీర్ఘకాలికంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాల్లో వచ్చేందుకు పికె వ్యూహాలు కూడా కొంత తోడ్పడ్డాయి. 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు, 2014 లోక్‌సభ ఎన్నికలకు బిజెపి వ్యూహకర్తగా పనిచేసిన పికె అనంతరం ఆ పార్టీతో వచ్చిన విభేదాలతో కాంగ్రెస్‌తోపాటు వివిధ పార్టీలకు వేర్వేరు రాష్ట్రాల్లో వ్యూహ సేవలందించారు.
తర్వాతి దశలో కాంగ్రెస్ తరఫున రాజకీయ ప్రవేశం చేయాలనుకున్నా అనుకున్నది అనుకున్నట్టు కుదరక ముందడుగు పడలేదు. ఈక్రమంలో పికె జెడి(యు)లో చేరి నెంబరు 2గా ఎదిగినా ఆయన అదృష్టం కిక్ కాలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ అరంగ్రేటంపై పట్టువదలని పికె 2024 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున జన్‌సురాజ్‌ను ఏర్పరిచారు. పార్టీ స్థాపించిన నెలరోజుల వ్యవధిలో బీహార్‌లో జరిగిన నాలుగు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే, వారి పార్టీ మూడు చోట్ల 3వ స్థానానికి, మరో చోట 4వ స్థానానికి పరిమితమయ్యింది. బీహార్ ఉపఎన్నికల్లో బొప్పిగట్టించుకున్న పికె త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు జన్‌సురాజ్‌ను సర్వ అస్త్రాలతో బరిలోకి దింపుతున్నారు. కానీ, బలమైన ఎన్‌డిఎ, మహాఘట్‌బంధన్ కూటములతో తలపడడం అంత తేలిక వ్యవహారం కాదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి.
బిజెపితో పాటు దేశంలోని పలు రాజకీయ పార్టీలకు కూడా వ్యూహకర్తగా పనిచేసి వారికి విజయాలు అందించిన పికె బీహార్ ఎన్నికల్లో తనకోసం పాచికలు వేస్తున్నారు. బిజెపి, కాంగ్రెస్ జాతీయ పార్టీలు బీహార్‌లో జెడి(యు), ఆర్‌జెడిలతో కలిసి రాష్ట్రాన్ని వెనుకబాటుకు గురిచేశాయని ప్రచారం చేస్తున్న పికె బృందం రాష్ర్ట వ్యాప్తంగా పాదయాత్రలతో ప్రజలకు చేరువయే యత్నం చేస్తోంది. మీడియాలో, బయట పికె చర్చనీయాంశమయ్యారు. పట్టణాల్లో జన్‌సురాజ్‌కు కొంత ప్రజాదరణ లభిస్తోంది. రాష్ర్టంలోని విద్యావేత్తల్లో, యువతలో కూడా పార్టీపై కొంత సానుకూలత కనిపిస్తోంది. అయితే ఆయా వర్గాల సానుకూలతంతా జన్‌సురాజ్‌కు ఓట్లుగా మారుతుందా అన్నదొక కోటి రూకల ప్రశ్న.
నరేంద్ర మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు తోడ్పడిన బిజెపి హిందుత్వ సైద్ధాంతికతకు పికె వ్యూహాలు కూడా దోహదపడ్డాయి. ఇటువంటి భావోద్వేగాలు బీహార్‌లో పికెకు కలిసిరాకపోవచ్చు. సెక్యులర్ పార్టీగా బరిలోకి దిగుతున్న జన్‌సురాజ్ మత అంశాల కంటే బీహార్ ఆత్మగౌరవానికి, రాష్ర్ట అభివృద్ధికి ప్రాధాన్యతిస్తూ ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని రాష్ర్ట ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. ‘మోడీ ఘనత’, ‘ప్రపంచ పటంలో సూపర్ పవర్‌గా ఎదుగుతున్న భారత్’ వంటి బిజెపి/ ఎన్‌డిఎ నినాదాలను స్థానికత, ‘బీహార్ ప్రైడ్’ వంటి అంశాలతో తిప్పికొట్టే వ్యూహాలు పికె రచిస్తున్నారు. మరోవైపు ‘బీహార్ బద్లావ్’ (బీహార్‌ని మార్చండి) పేరుతో జన్‌సురాజ్ ప్రజల వద్దకు వెళ్లడం ఆ పార్టీకి సానుకూలంగా ఉంది. బిజెపి లాగా ప్రతి విషయంలో ఢిల్లీ అధిష్టానంపైన ఆధారపడకుండా స్థానికంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు పక్కా ప్రాంతీయ పార్టీ అయిన జన్‌సురాజ్‌తో ఉంటుందని ప్రజల్లో ఒక ఆలోచన రేపడం ద్వారా బిజెపిని ఎదుర్కోజూస్తున్నారు.
ప్రజాసంక్షేమ పథకాల పరంగా కొత్త పార్టీ అయిన జన్‌సురాజ్ ప్రజలకు చేరువవడం అంత సులభం కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎవ్‌ు కిసాన్ పథకంతో రైతులకు, ఉజ్వల గ్యాస్ పేరుతో మహిళలకు, ఆర్యోగంపై ఆయుష్మాన్‌భవ పేరుతో ఇలా.. అన్నివర్గాలకు ఎన్‌డిఎ చేరువైంది. ఆయా పథకాల్లో, అమలులో ఉన్న లోపాలను ఎత్తిచూపే కసరత్తులో జెఎస్‌పి నిమగ్నమైంది. మరోవైపు గతంలో పలు ప్రజాకర్షణ పథకాలు అమలు పరచి, ఫలాలు అందించిన మహాఘట్‌బంధన్ తాజాగా ఇస్తున్న ఉచిత హామీలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాత పథకాలు కొత్త హామీలతో ప్రజలకు దగ్గరవుతున్న ఈ రెండు కూటములను ఎదుర్కొనేందుకు జన్‌సురాజ్ రూపొందించే వ్యూహాలు, ఎత్తుగడలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. కొత్త పార్టీగా ప్రజలకు, ప్రధానంగా యువతకు ఆశాజనకంగా కనిపిస్తున్న జన్‌సురాజ్ ప్రకటించే పథకాలపైన వాటికి లభించే జనాధరణపైనే పికె రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది.
రాష్ర్టవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సంస్థాగత బలంతో ఉన్న బిజెపి, ఆర్‌జెడి పార్టీలను జన్‌సురాజ్ అభ్యర్థులు నేరుగా ఎదుర్కోవడం ఆసక్తికరమే. తమ పార్టీకి కోటి మంది సభ్యత్వం ఉందని చెప్పుకుంటున్న జన్‌సురాజ్ నేతలు రాష్ర్ట వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే పనిలో ఉన్నారు. ఒకవైపు ఇలా ప్రయత్నిస్తూ, మరోవైపు వివిధ స్థాయిల్లో నిర్మాణం ద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నారు. ఆర్థికంగా బలమైన బిజెపికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌ల క్షేత్రప్రచారం వారికి అదనపు బలం. సోషల్ మీడియా ప్రచారంలో కూడా బిజెపి ముందంజలో ఉంది. మరో బలమైన పార్టీ ఆర్‌జెడికి ప్రతి గ్రామంలో బలమైన కేడర్ ఉండడంతో పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాలు చేపడుతోంది. బలమైన ఈ రెండు ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు కొత్త రాజకీయ పక్షమైన జన్‌సురాజ్ ఇంకా ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో ఆసక్తికరమే.
యువనేతలుగా తేజస్వి యాదవ్ (ఆర్‌జెడి), చిరాగ్ పాశ్వన్ (లోక్‌జన్‌శక్తి రావిపా) రాష్ర్ట రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. తేజస్వి యాదవ్ ఇప్పటికే నిరుద్యోగం, బీహారీల వలసలపై పెద్ద ఎత్తున ప్రచారంతో యువతకు చేరువవుతున్నారు. ఆయన ప్రకటిస్తున్న సంక్షేమ పథకాల హామీలు కూడా భారీగానే ఉన్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ రాష్ర్టంలో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తూ సంస్థాగతంగా, రాజకీయంగా బలపడాలని చూస్తున్నారు. ఈ విషయంలో బలమైన యువనాయకత్వం లేకుండా బిజెపి వెనుకబడిందనే చెప్పాలి. జెడి(యు) కూడా యువనాయకత్వాన్ని తెరపైకి తీసుకువచ్చే ఆఖరు నిమిషపు యత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్‌తో పాటు మాజీ ఐఎఎస్ అధికారి మనీష్ వర్మ జెడి(యు)లో బలపడేందుకు కృషి చేస్తున్నారు.
జన్‌సురాజ్ పార్టీకి యువతలో ఆదరణ ఉన్నా, నాయకత్వ అవకాశాలివ్వడం ద్వారా పార్టీలోకి యువ నేతలను ఆకర్షించేందుకు పికె ఎలాంటి వ్యూహాలు పన్నుతారో వేచిచూడాలి. బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వ్యూహాల్లో దిట్టయిన ప్రశాంత్ కిశోర్ రాష్ర్టంలో సుపరిపాలన అందిస్తానంటూ చేస్తున్న ‘జన్‌సురాజ్ ప్రయోగం’ సాధించే ఫలితాలపైనే వారి రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఆశించిన ఫలితాలొస్తే ‘ఆప్’ పార్టీలాగానే జన్‌సురాజ్ కూడా బీహార్ బయటకు కాలు కదుపవచ్చు. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలతో పనిచేసి ఉన్న అనుభవం దృష్ట్యా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా తన సత్తాను నిరూపించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓడిపోతే మాత్రం బీహార్‌తోనే ప్రత్యక్ష రాజకీయాలకు ముగింపు పలకాల్సి రావచ్చు. ఇదంతా ప్రధానంగా బీహార్ ఓటర్ విజ్ఞతమీద ఆధారపడి ఉన్న అంశం!
(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)
దిలీప్‌రెడ్డి
సమకాలీనం