Saturday, April 27, 2024

బీహార్ బాద్ షా ఎవరు?

- Advertisement -
- Advertisement -

బీహార్‌లో 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ (1951లో మొదటి శాసన సభ ఎన్నికలు జరిగాయి) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా అందచేస్తామని ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్నికల వాగ్దానాలు ఎలా ఉంటాయో దీనిని బట్టి మనకు అర్ధం అవుతుంది. అధికారంలో ఉన్న బిజెపి కేవలం ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఓట్లు పొందేందుకు ప్రయోగించిన అస్త్రం ఈ కరోనా వాక్సిన్ ఉచిత పంపిణీ కార్యక్రమం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దేశంలో ఉన్న అందరికీ అందించవచ్చు కదా. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన ఈ ప్రకటన దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే లేపింది. బీహార్ ప్రజలపై బిజెపి వేసిన కరోనాస్త్రం నవ్వులపాలైంది. దేశంలో అన్ని రాష్ట్రాలకు వాక్సిన్‌ను ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వం ఒక్క రాష్టానికే ఉచితంగా ఇస్తాననడం దుర్మార్గం. ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే .

రాజకీయ పార్టీలకు ఓటర్ల పై ఉన్న అభిప్రాయానికి మచ్చుతునక ఈ నిర్ణయం. కాదేదీ రాజకీయాలకు అనర్హం అనుకుంటుంది కమల దళం. ఓటుకు నోటు పాతగిలిపోయింది. ఇప్పుడు కొత్తగా ఓటుకు పోటు. (వాక్సిన్ రూపంలో).
ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికలు ప్రాణం వంటివి. ఈ ఎన్నికలను స్వేచ్ఛగా, ఎలాంటి ప్రలోభాలు, ప్రభావాలకు ఆశపడకుండా ప్రజలను భయాందోళనలకు గురి చేయకుండా ఉండేలా ప్రశాంతంగా నిర్వహించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ప్రజలకు కల్పించవలసిన బాధ్యత పాలకులపై ఉంది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 28న 71 స్థానాల్లో మొదటి దశ, నవంబర్ 3న 94 స్థానాల్లో రెండో దశలో, నవంబర్ 7న 78 స్థానాల్లో మూడవ దశలో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెలువడి బీహార్ బాదుషా ఎవరో తెలియనుంది. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, సి.పి. ఎం, సి.పి.ఐ, సిపిఐ (ఎంఎల్) మహా కూటమిగా జతకట్టి అధికార ఎన్‌డిఎను గద్దె దించే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగుతున్నాయి. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్.జె.డి. నేత తేజస్వి యాదవ్‌ను ప్రకటించాయి. ఆర్.జె. డి 144, కాంగ్రెస్ 70, సి.పి.ఎం 4, సి.పి.ఐ 6, సి.పి.ఐ. (ఎం.ఎల్.) 19 స్థానాలకు ఉమ్మడిగా పోటీచేస్తున్నాయి.

అధికార ఎన్‌డిఎ కూటమిలో జెడి(యు), బిజెపి, హిందుస్తాన్ అవామ్ మోర్చా, వికాస్‌శీల్ ఇన్షాన్ పార్టీలు ఉన్నాయి. వీటి ఒప్పందం ప్రకారం జెడి(యు) 122 స్థానాల్లో, బిజెపి 121 స్థానాల్లో పోటీ చేస్తాయి. జెడి(యు) తన వాటాలోని 7 సీట్లను ఆర్. జె. డి కూటమి నుండి బయటకు వచ్చిన జీతన్ రామ్ మంజీ నాయకత్వంలోని హిందుస్తాన్ అవామ్ మోర్చాకు ఇస్తుంది. బిజెపి తన వాటాలోని 6 సీట్లను విపక్ష కూటమి నుండి బయటకు వచ్చిన వికాస్ శీల్ ఇషాన్ పార్టీకి కేటాయించింది. దీంతో జెడి(యు), బిజెపిలు నికరంగా చెరో 115 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. విపక్ష ఆర్‌జెడి కూటమి నుండి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ పోటీ చేసే స్థానాల సంఖ్యతో విభేదాలు తలెత్తి దాని నాయకుడు ఉపేంద్ర కుశ్వాహా కూటమి నుండి బయటకు వచ్చి బిఎస్‌పి, జన్ వాది సోషలిస్టు పార్టీలతో మూడవ కూటమిని ఏర్పాటు చేశారు. ఎంఐఎం పార్టీ, దేవేంద్ర ప్రసాద్ యాదవ్ కు చెందిన సమాజ్ వాది జనతాదళ్ డెమొక్రటిక్ పార్టీతో కలిసి మరో కూటమిగా ఏర్పడి పోటీ చేయనున్నట్లు ఎంఐఎం పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసి ప్రకటించారు. నాలుగు కూటముల మధ్య బీహార్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అగ్ర వర్ణాలు, భూమిహార్లు, యాదవేతర ఒబిసిల్లో ఒక వర్గానికి ప్రతినిధిగా బిజెపి, నిమ్న కులాలు, మహాదళితులు, ఇబిసిల దన్నుతో జెడి (యు), ముస్లిం లు, యాదవుల ఓటు బ్యాంకుతో ఆర్‌జెడి గెలుపుపై ధీమాగా ఉన్నాయి. వీటిలో ఏ రెండు పార్టీలు కలిపి పోటీ చేసినా మూడో పార్టీ మనుగడ కష్టం అని గత ఫలితాలు పరిశీలిస్తే గమనించవచ్చు. 2010లో బిజెపితో కలిసి విజయ తీరానికి చేరిన జెడి (యు), 2015 లో ఆర్‌జెడితో పొత్తుపెట్టుకుని అధికారం చేపట్టింది. 2017లో తిరిగి ఎన్‌డిఎ గూటికి చేసిన జెడి(యు) అధినేత నితీశ్ ప్రస్తుత ఎన్నికల్లో విజయం వైపు పయనించడానికి నానా కష్టాలు పడుతున్నారు. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్‌ను ప్రకటించిన బిజెపి సైతం నితీశ్ పట్ల సానుకూలంగా లేదని చెప్పవచ్చు. 2015లో ‘సాత్ నిశ్చయ్’ పేరిట ఇచ్చిన వాగ్దానాలు అమలు చేశామని, వాటికీ కొనసాగింపుగా మరో 7 వాగ్దానాలు తెరపైకి తీసుకురాగా, 10లక్షల ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వ లక్ష్యం అంటూ ఆర్‌జెడి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ప్రకటించారు. బిజెపి మరో అడుగు మందుకు వేసి 19 లక్షల ఉద్యోగాల కల్పన మా ప్రణాళిక అంటూ బీహారీల బుర్రలని వేడెక్కిస్తున్నారు. మూడు విడతల నితీశ్ పాలనలో బీహార్‌లో జరిగిన అభివృద్ధి పై ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉంటే 2015 ఎన్నికల సమయంలో నితీశ్ ని విమర్శించిన ప్రధాని మోడీ ప్రస్తుత ఎన్నికల్లో నితీశ్ పాలనలో బీహార్ అభివృద్ధిలో దూసుకుపోతోందని కితాబు ఇస్తున్నారు. ఐదేళ్ల క్రితం 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఉన్న రాజకీయ వాతావరణానికి, ఇప్పటి వాతావరణానికి ఎంతో తేడా ఉంది. అప్పటి ఎన్నికల్లో ఆర్‌జెడి, కాంగ్రెస్ తదితర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నితీశ్ తరువాత కాలంలో ఎన్‌డిఎతో జతకట్టారు. 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన అనుభవం ఉన్న నితీశ్ తీవ్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలను ఎదుర్కొంటున్నారు. అయన ప్రజాదరణ సైతం మునుపటి కంటే తగ్గినట్లు పలు సర్వేలు ప్రకటించాయి. బీహార్ దేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఆ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయి? పదహారు మాసాలు కిందట లోక్‌సభ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి అట్టహాసంగా హస్తినలో అధికార దండం చేతపట్టిన నరేంద్ర మోడీ ఎందుకు బీహార్ ఎన్నికల్లో శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తున్నారు?
2018 మార్చి నాటికి స్వయంగా కానీ, మిత్రపక్షాలతో భాగస్వామిగా కానీ భారతదేశంలోని 21 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. జమ్మూ కశ్మీర్‌ను 2019 లో రెండు రాష్ట్రాలుగా విభజించటానికి ముందు 2018లో దేశంలో 28 రాష్ట్రాలు ఉండేవి. 2018 శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లను బిజెపి కోల్పోయింది. అధికారం 17 రాష్ట్రాలకు పరిమితం అయ్యింది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, సిక్కిం, అసోం, మేఘాలయా, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, గోవా, గుజరాత్ లలో అధికారంలో ఉండి పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రాలను కోల్పోవడంతో కమలనాథుల్లో ఒంకింత కలవరం పుట్టింది. ఇప్పు డు బీహార్ ఎన్నికల నేపథ్యంలో దేశంలో పెద్ద రాష్ట్రాల జాబితాలో మూడవ స్థానం (జనాభా) లో ఉన్న బీహార్‌లో తమ పట్టు నిలుపు కోవడానికి బిజెపి నానాతంటాలు పడుతుంది. ఒక వైపు నితీశ్ ని సిఎం అభ్యర్థిగా ప్రకటించి, ఎటునుండి ఏమి జరిగిన అధికారం చేయి దాటనీయకుండా పావులు కదుపుతుంది. దీనిలో భాగంగానే ఎల్‌జిపి అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో చిరాగ్ పాశ్వాన్ మోడీకి స్నేహ హస్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బీహార్‌లో ఎన్‌డిఎ నుండి తాము బయటకు వస్తున్నట్లు ఎల్‌జెపి చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రకటించడంతో బీహార్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అయితే తాము కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి, రాష్ట్రంలో పార్టీ నాయకత్వానికి విధేయులముగా కొనసాగుతామని పాశ్వాన్ ప్రకటించడం ఆసక్తిగా మారింది. తాము బిజెపి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తూ జెడి(యు) అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా పని చేస్తామని నితీశ్ టార్గెట్‌గా ఎల్‌జెపి విమర్శలు చేస్తుంది. ఎన్నికల్లో జెడి(యు) అభ్యర్థులను ఓడించి అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించి సిఎం పీఠాన్ని అధిరోహించాలనే బిజెపి వ్యూహంగా ఇది ఉంది. లోకసభ ఫలితాలు బీహార్‌లో పునరావృతం అవుతాయని చెప్పలేము. 2009 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన యుపిఎ తరువాత 2010లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేక పోయింది. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన మోడీకి బీహారీలు షాక్ ఇచ్చారు. 2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి చిత్తయింది. ఈ ఎన్నికల్లో ఆర్‌జెడి, జెడి(యు)లు కలిసి పోటీ చేశాయి. ఇక 2019 లోక్ సభ ఎన్నికల్లో అయితే బీహార్‌లో బిజెపి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. బిజెపి, జెడి(యు), ఎల్‌జెపిలు సంచలన విజయం నమోదు చేశాయి. ఆర్‌జెడి, కాంగ్రెస్ కూటమి చిత్తయింది. కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క సీట్లో విజయం సాధిస్తే, ఆర్‌జెడి కనీసం ఖాతా ప్రారంభించలేదు. బీహార్ నుండి 6 ఎంపిలను కలిగియున్న ఎల్‌జెపికి అసెంబ్లీ లో ఉన్న సీట్లు ఒక్కటంటే ఒక్కటి . గత రెండు పర్యాయాలుగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పర విరుద్ధమైన ఫలితాలు ఇస్తున్నారు బీహార్ ప్రజలు. ఈసారి బిజెపి, జెడి(యు) కలిసి వెళ్తున్నాయి. ఎల్‌జెపి సోలో పెర్ఫార్మన్స్ ని బిజెపి వ్యూహంగా నే ప్రజలు భావిస్తున్నారు. ఏకంగా 30 లక్షల మంది వలస కూలీలు ఉన్న రాష్ట్రం బీహార్. ఈ కరోనా సమయంలో బాగా ఇబ్బందిపడిన వర్గం అది. ఇటువంటి సందర్బంలో కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వ పని తీరును కూడా బీహార్ ఎన్నికలు ఒక పరీక్షకాబోతున్నాయి. బీహారీల తీర్పు ఈ సారి ఎలా ఉండబోతుందో 10 వ తేదీ వరకు వేచి చూడాలి.

జెవి ప్రమోద్ కుమార్
9490833108

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News