Saturday, July 27, 2024

బిజెపికి ఓటు.. రాజ్యంగం, రిజర్వేషన్లపై వేటు

- Advertisement -
- Advertisement -
ఆర్‌ఎస్‌ఎస్ మూల సిద్ధాంతమే
రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని
మార్చడం కమలానికి వేసే ప్రతి
ఓటూ రిజర్వేషన్ల రద్దుకు దోహదం
చేస్తుంది రాజ్యాంగాన్ని
మార్చాలా, వద్దా అనే అంశంపైనే
ఈ ఎన్నికలు మోడీ 400 సీట్లు
కావాలనేది రిజర్వేషన్లు రద్దు
చేసేందుకే నిజాలు మాట్లాడుతున్నందుకే
నాపై ఢిల్లీలో అక్రమ కేసులు ఎన్నికల్లో
గెలుపుకోసం బిజేపి ఢిల్లీ పోలీసులను
వాడుకుంటోంది నన్ను బెదిరించే
ప్రయత్నాలను విరమించుకోవాలి
అబద్ధాల వర్శిటీకి విసి మోడీ,
రిజిష్ట్రార్ అమిత్ షా విలేకరుల
సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు తీసేయడం బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని టిపిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే బిజెపి అజెండానని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల రద్దుపై చర్చ జరగకుండా బిజెపి శా యశక్తులా ప్రయత్నించిందని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ విధానాలపై తాను స్పష్టంగా మాట్లాడానని అన్నారు. అంబేడ్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చే యాలని ఆర్‌ఎస్‌ఎస్ మూల సిద్ధాంతమని చెప్పా రు. ఇప్పటికే కొన్ని 370 ఆర్టికల్ రద్దు, యుసిసి వంటి ఆర్‌ఎస్‌ఎస్ మౌలిక సిద్ధాంతాలను మోదీ, అమిత్ షా 17వ లోక్‌సభలోనే అమలు చేశారని చెప్పారు.

18వ లోక్‌సభలో రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల ఎత్తివేతనే బిజెపి ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ కార్యాచరణ పేరే బిజెపి అని పేర్కొన్నారు. కేంద్రం చేస్తున్న దాడులను మీరందరూ చూశారని, తాను ఆర్‌ఎస్‌ఎస్ మూల సిద్ధాంతాలపై నిర్ధిష్టమైన ఆరోపణ చే స్తున్నానని అన్నారు. ఎన్నికలకు ఇబ్బంది అవుతుందనే తాను మాట్లాడే విషయాలను బిజెపి నేత లు పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నిజా లు మాట్లాడుతున్నందుకే తనపై ఢిల్లీలో అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తాము రిజర్వేషన్లు పెంచాలని భావిస్తుంటే, బిజెపి రిజర్వేషన్లు తొలగించాలని చూస్తోందని ధ్వజమెత్తా రు. తన వాదనలపై సరైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మోదీ, అమిత్ షాకు ఉందని చెప్పారు. బిజెపి ఎన్నికల్లో గెలవడానికి ఇడి, సిబిఐ, ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. బిజెపి కుట్రను భాజపా కుట్రను తిప్పి కొట్టేందుకు కచ్చితంగా పోరాడుతానని తెలిపారు.

నాపై అక్రమ కేసులు పెట్టారు
రిజర్వేషన్ల రద్దుపై చర్చించినందుకే తనపై అక్రమ కేసులు పెట్టారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎవరో సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేసిందని అన్నారు. ఢిల్లీ పోలీసులు గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. ఎవరో ఫిర్యాదు చేస్తే తనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారని మండిపడ్డారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లినట్లు ఆగమేఘాల మీద తనపై కేసు పెట్టారని దుయ్యబట్టారు. తనపై కేసు పెట్టేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నియంత్రణలో పనిచేసే ఢిల్లీ పోలీసులను ఎంచుకున్నారు, ఎందుకంటే వారు కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటారు కదా అంటూ ఎద్దేవా చేశారు.

మోదీ, అమిత్ షా తనను బెదిరించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని అన్నారు. తాను వాళ్ల ముందు లొంగిపోతానని ఈ ఢిల్లీ సుల్తానులు ఎందుకు అనుకుంటున్నారో అర్ధం కావట్లేదని పేర్కొన్నారు. తాను ఎన్నికల ప్రచారం చేయకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోనూ తనపై అక్రమ కేసులు బెదిరించి లొంగదీసుకోవాలని ఒకాయన చూశారని, అలా చేస్తే ఏం జరుగుతుందో ఆయనను అడిగి తెలుసుకోవాలని అన్నారు. ఢిల్లీ పోలీసులు వస్తే మాట్లాడటం మానేస్తానని అనుకుంటున్నారేమోనని.. కానీ అంతకు రెండింతలు కచ్చితంగా మాట్లాడుతానని అన్నారు. రిజర్వేషన్లు కాపాడడం ముఖ్యమంత్రిగా తన బాధ్యతని సిఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.

రిజర్వేషన్లు పెంచాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలి
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కె.ఆర్ నారాయణన్ ప్రసంగించారని, రాష్ట్రపతి ప్రసంగం సారాంశంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఉందని తెలిపారు. రిజర్వేషన్ల రద్దు గురించి ఆధారాలతో సహా తాను వాదిస్తున్నాని అన్నా రు. తన వాదనలపై సరైన వివరణ ఇచ్చుకోవాల్సిన బా ధ్యత మోదీ, అమిత్ షాకు ఉందని పేర్కొన్నారు. రా జ్యాంగాన్ని మార్చే ప్రక్రియల్లో భాగంగానే దివంగత ప్రధానమంత్రి వాజ్‌పేయ్ హయాంలో కమిషన్ ఏర్పాటు చేస్తూ మొదటిసారి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు. రాజ్యాంగంపై సమీక్షించాలని 2000 సంవత్సరం ఫిబ్రవరి 22న వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఓ గెజిట్ ఇచ్చారని, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ ప్రసంగం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగం సారాంశం లో రిజర్వేషన్ల రద్దు గురించి ఉందని, దీనిపై ఆధారాలతో సహా తాను వాదిస్తున్నానని పేర్కొన్నారు. మూడింట రెండొంతులు మెజారిటీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.

2000 సంవత్సరంలో కేంద్రంలోని వాజ్‌పేయి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చడానికి పది మంది సభ్యులతో కలిసి జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్‌ను వేసిందని, 2002లో వెంకటాచలయ్య కమిషన్ స్పష్టమైన నివేదిక ఇచ్చిందని తెలిపారు. రా జ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలని వెంకటాచలయ్య కమిషన్ నివేదిక ఇచ్చిందని, 2002లో ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక అందుబాటులోలేదని చెప్పారు. 2004 లో కేంద్రంలో సోనియాగాంధీ నేతృత్వంలో యుపిఎ 1 ప్రభుత్వం రావడంతో రాజ్యాంగాన్ని మార్చే అవకాశం బిజెపి లేకుండా పోయింది. ఈసారి బిజెపికి ఓటు వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు పెంచాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి అనే అంశాలు పక్కకెళ్లాయని, ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని మార్చాలా..? మార్చకూడదా..? అనే అంశంపై మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు.

రిజర్వేషన్ల రద్దు కోసమే బిజెపికి 400 సీట్లు కావాలి
కుల ఆధారిత రిజర్వేషన్లు సరికాదని 2015లో ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎన్‌జి వైద్య పత్రికల్లో వ్యాసాలు రాశారని, ఆయన రాసినట్టే 2025 నాటికి రిజర్వేషన్లు రద్దు చేయాలని బిజెపి ప్రయత్నిస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను సవరించాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ, 50 శాతం శాససనభల తీర్మానం అసవరమని చెప్పారు. రిజర్వేషన్ల రద్దు కోసమే బిజెపి 400 సీట్లు కావాలని చూస్తోందని అన్నారు. ఇప్పటికే ఎనిమిది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలను బిజెపి పడగొట్టిందని పేర్కొన్నారు. 1925లో ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పడినప్పటి నుంచి దేశాన్ని హిందూదేశంగా ప్రకటించాలనేది, రిజర్వేషన్ల రద్దు అనేది ఆర్‌ఎస్‌ఎస్ మౌలిక సిద్ధాంతం అని వ్యాఖ్యానించారు.

ఎస్‌సిలకు సమానత్వం, హక్కులు లేని హిందూ రాష్ట్రం కావాలని ఆర్‌ఎస్‌ఎస్ రెండో సర్సంఘ్ చాలక్ గోల్వాల్కర్ రాశారని తెలిపారు. దురదృష్టవశాత్తూ దళితులకు కూడా సమాన హక్కులు ఇచ్చారని ఆయన రాశారని గుర్తు చేశారు. పదేళ్ల తర్వాత రిజర్వేషన్లు తొలగించాలని సూచించారని, ఆయన చెప్పిన గడువు దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు రద్దుకు యత్నిస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే 2017లో రాజ్యాంగం మారనున్నదని చెప్పారు. గత లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు. రిజర్వేషన్లు దేశాభివృద్ధికి దోహదం చేస్తాయా..? అని సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బిజెపి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోందని అన్నారు. రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్, బిజెపికి చెందిన కీలక చేసిన వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

బిజెపి ఉధృతంగా రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేసింది
1978లో మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా బిజెపి కమాండల యాత్ర నిర్వహించిందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాను మాట్లాడే విషయాలపై మోదీ, అమిత్ షాలకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. బి.పి.మండల్ కమిషన్ బిసిలకు 27 శాతం రిజర్వేషన్లకు సిఫారసు చేసినప్పుడు బిజెపి రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం ఉధృతంగా చేసిందని గుర్తు చేశారు. బిసి రిజర్వేషన్లు సమ్మతమేనని తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇందిరా సహాని కేసులో రిజర్వేషన్లకు 50 శాతానికి మించకుండా అమలు చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందని అన్నారు.

తమ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కలిసి రిజర్వేషన్లు పెంచాలని విజ్ఞప్తి చేశారని, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు పరిశీలించిన తమ ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్ల అమలు పరిమితి తొలగించి రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా జనగణన చేపడుతున్నామని, తెలంగాణలో బిసి జనగణనకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని నిధులు కేటాయించామని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన బీహార్, రాజస్థాన్‌లో కులగణనపై చేపట్టామని తెలిపారు.

అబద్ధాల యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ మోదీ, రిజిస్ట్రార్ అమిత్ షా
అబద్ధాల యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ మోదీ, రిజిస్ట్రార్ అమిత్ షా అంటూ సిఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బిజెపి పార్టీ రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని తాను బహిరంగ సభల్లోనే మాట్లాడుతున్నానని, తనకు ఫేక్ వీడియోలు తయారు చేయాల్సిన అవసరం సీఎంకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. అలాంటి అవసరం వాట్సాప్ యూనివర్సిటీ నడిపేవాళ్లకే ఉంటుందని విమర్శించారు.

మన్మోహన్ సింగ్ పాకిస్తాన్‌తో కలిసి తనను హత్యం చేయించేందుకు కుట్ర చేశారని ప్రధాన నరేంద్ర మోడీ ఆరోపించారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ కన్వర్టెడ్ బిసి అని విమర్శించారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఒసి అని, ఆయన సిఎం అయిన తర్వాత తన కులాన్ని బిసిలో కలిపారని చెప్పారు. అవసరాన్ని బట్టి మోడీ తాను బిసినే అని చెప్పుకుంటారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News