Sunday, April 28, 2024

మధ్యప్రదేశ్‌లో ఎస్‌సి, ఎస్‌టి స్థానాల్లో సత్తా చాటిన బిజెపి

- Advertisement -
- Advertisement -

మొత్తం 82 స్థానాలకు 50 చోట్ల విజయం

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఎస్‌టిలు, ఎస్‌సిలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో మెరుగైన ఫలితాలను సాధించింది. ఈ రెండు వర్గాలకు రిజర్వ్ చేసిన 82 స్థానాల్లో 50 సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాల్లో 17 సీట్లలో మాత్రమే ఆ పార్టీ గెలుపొందింది. రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టి వర్గాల్లో తన పునాదిని బిజెపి బాగా విస్తరించుకుందని ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది. అయితే ఆ పార్టీ ప్రముఖ గిరిజన నాయకుడు, కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం.

గత నెల 17న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఈ నెల 3న ఫలితాలు వెల్లడయిన విషయం తెలిసిందే. 230 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో 163 స్థానాల్లో గెలుపొంది బిజెపి తిరుగులేని విజయం సాధించగా, గత ఎన్నికల్లో 114 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ ఈ సారి 66 స్థానాలకే పరిమితమైంది. ఫలితాలను బట్టి రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వ్ చేసిన 82 స్థానాల్లో బిజెపి 50 సీట్లను గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాల్లో 33 చోట్ల మాత్రమే బిజెపి గెలుపొందింది. ఎస్‌లకు రిజర్వ్ చేసిన 47 స్థానాల్లో బిజెపి ఈ సారి 24 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ బలం 22 సీట్లకు పడిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ 9 అసెంబ్లీ స్థానాలను కోల్పోయింది.

2018లో బిజెపి ఈ సీట్లలో 15 చోట్ల మాత్రమే విజయం సాధించింది రట్లాం జిల్లాలోని సైలానా సీటును కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన భారత్ ఆదివాసీ పార్టీ గెలుచుకుంది. ఇక 35 ఎస్‌సి స్థానాల్లో 26 చోట్ల బిజెపి విజయం సాధించగా, కాంగ్రెస్ బలం 9కి పడిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ 8 సీట్లు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో 18 చోట్ల విజయం సాధించింది. గిరిజనుల్లో బిజెపి పట్టు పెరిగినప్పటికీ కేంద్ర మంత్రి, బిజెపిలో బలమైన గిరిజన నాయకుడు అయిన కులస్తే మాండ్లా జిల్లాలోని నివాస్ స్థానంలో ఓడిపోవడం గమనార్హం. కాగా తమ పార్టీకి ఎస్‌సి, ఎస్‌టిలతో పాటుగా సమాజంలోని అన్ని వర్గాలనుంచి ఆదరాభిమానాలు లభించాయని రాష్ట్ర బిజెపి ప్రతినిధి పంకజ్ చతుర్వేది అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News